సెమీఫైనల్స్‌కు రిజర్వ్‌ డే కావాలి!  | ICC T20 World Cup Will Be In October 2020 | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్స్‌కు రిజర్వ్‌ డే కావాలి! 

Published Sun, Mar 22 2020 1:09 AM | Last Updated on Sun, Mar 22 2020 1:09 AM

ICC T20 World Cup Will Be In October 2020 - Sakshi

సిడ్నీ: ఇటీవలే ఆస్ట్రేలియాలో ముగిసిన మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే లేకుండా పోయింది. ఫలితంగా భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన తొలి సెమీస్‌ రద్దు కాగా... ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో సెమీస్‌లోనూ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ద్వారా ఫలితం తేలింది. అయితే లీగ్‌ దశలో ఎక్కువ విజయాలు సాధించడంతో ఇంగ్లండ్‌ను వెనక్కి తోసి భారత్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. కీలకమైన సెమీస్‌కు కనీసం రిజర్వ్‌ డే పెట్టకపోవడంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ప్రతిష్టాత్మక పురుషుల టి20 ప్రపంచకప్‌లో అలాంటి పరిస్థితి రాకూడదని ఆతిథ్య బోర్డు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కోరుకుంటోంది. ఇప్పటికే అంగీకరించిన నిబంధనల ప్రకారం ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌ డే ఉంది. ఇప్పుడు సెమీఫైనల్స్‌కు కూడా రిజర్వ్‌ డే పెట్టమంటూ ఐసీసీకి విజ్ఞప్తి చేయాలని సీఏ నిర్ణయించింది. త్వరలో జరగనున్న ఐసీసీ క్రికెట్‌ కమిటీ సమావేశంలో సీఏ ఈ ప్రతిపాదన పెట్టనుంది.

ఈ సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందని, అనంతరం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (సీఈసీ) ఆమోద ముద్ర వేస్తే తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తుందని ఐసీసీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మరి కొన్ని నెలల్లో టోర్నీ జరగనున్న నేపథ్యంలో నిబంధనలు మార్చడం అరుదుగా జరుగుతుందని, అయితే ఐసీసీ సభ్యదేశాల్లో ఎవరైనా వీటిని మార్చే విషయంపై చర్చ జరపవచ్చని ఆయన చెప్పారు. ‘ఒక టోర్నీ జరిగిన తర్వాత మంచి చెడుల గురించి విశ్లేషించడం, రాబోయే టోర్నీకి ఎలా సన్నద్ధం కావాలో తెలుసుకోవడం ఎప్పుడైనా జరుగుతుంది. వేర్వేరు సమయంలో నిర్వహించినా టి20 ప్రపంచకప్‌ 2020కి సంబంధించి రెండు టోర్నీలకూ ఒకే తరహా నిబంధనలు మహిళా వరల్డ్‌ కప్‌ జరగక ముందే విధించారనేది వాస్తవం. అయితే నిబంధనల మార్పు గురించి మన వాదనలో వాస్తవం ఉండాలి. ఇంగ్లండ్‌ మహిళల జట్టు పరిస్థితి ఏమిటో మాకు బాగా తెలుసు. ఇప్పుడు మాలో చాలా మంది సెమీస్‌కు కూడా రిజర్వ్‌ డే ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు’ అని సీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ అభిప్రాయ పడ్డారు. ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబర్‌ 15 వరకు టి20 ప్రపంచ కప్‌ జరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement