మెల్‌బోర్న్: కరోనా వైరస్ కారణంగా టోర్నీలన్నీ రద్దవుతున్నప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం అక్టోబర్‌లో ఆసీస్ వేదికగా జరిగే టి20 ప్రపంచ కప్ మెగా టోర్నీపై దృష్టి సారించింది. ఈ మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరగాల్సిన క్రీడా ఈవెంట్లన్నీ రద్దయ్యాయి. అయితే వరల్డ్ కప్ నిర్వహణ సజావుగా సాగేట్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోంది. టోర్నీకి ఆతిథ్యమిచ్చే మైదానాలను సంరక్షించడంతో పాటు నిధులను పద్ధతి ప్రకారం కూడబెడుతున్నట్లు సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ తెలిపారు. ‘కరోనా కారణంగా రాబోయే నెలల్లో ఏం జరుగుతుందో చెప్పలేం. నిపుణుల సలహా మేరకు మేం నడచుకుంటున్నాం. ప్రపంచ కప్ నిర్వహణకు మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నాం’ అని అన్నారు. అక్టోబర్ 18–23 వరకు జరిగే ప్రి క్వాలిఫయర్స్‌తో ప్రపంచకప్‌కు తెరలేస్తుంది. 24న ప్రధాన టోర్నీ ప్రారంభమవుతుంది. నవంబర్ 15న ఎంసీజీలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఐపీఎల్‌కూ ఆసీస్ ఆటగాళ్లు దూరం!
ఒక వేళ ఐపీఎల్ జరిగితే అందులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనేది అనుమానంగా మారింది. కరోనా నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనేది ఆలోచించి... పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆటగాళ్లకు సీఏ చీఫ్ కెవిన్ సూచించారు. మొత్తం 17 మంది ఆసీస్ ప్లేయర్లు ఐపీఎల్‌లో భాగంగా ఉన్నారు. ఈ టోర్నీలో తమ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా సమీక్షిస్తున్నట్లు అక్కడి వార్తా పత్రికలు పేర్కొన్నాయి. ప్యాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లను తమ కాంట్రాక్టులను వదులుకోమని సీఏ అడిగే అవకాశాలున్నట్లు కూడా అందులో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్‌ను రద్దు చేసి లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ‘న్యూ సౌత్ వేల్స్’ జట్టును సీఏ విజేతగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment