సిడ్నీ: ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సరైన వేదిక అని ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయ పడ్డాడు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో లీగ్ గురించి ఏమీ చెప్పలేమని అతను అన్నాడు. ‘ప్రస్తుతం కోవిడ్–19 విజృంభిస్తుండటంతో ప్రణాళికలు మారిపోయాయి. ఇలాంటి సంక్షోభం రాకముందు మా ఆటగాళ్లంతా ఐపీఎల్‌లో ఆడాలని మేం కోరుకున్నాం. టి20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సన్నద్ధతపరంగా చూస్తే ఐపీఎల్‌కు మించిన వేదిక మరేదీ లేదు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఆటగాళ్ల ఆరోగ్యమే కాదు...మా దేశం, భారత్ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది’ అని లాంగర్ వ్యాఖ్యానించాడు. తమ టి20 జట్టు పటిష్టంగా ఉందని, కొత్తగా సెలక్షన్‌పరంగా ఎలాంటి సమస్యలు లేవని అతను అన్నాడు. ‘ఒకటి, రెండు స్థానాలు మినహా మా టి20 జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అంతా కుదురుకొని ఉంది. దక్షిణాఫ్రికాపై మేం బాగా ఆడి సిరీస్ గెలిచాం’ అని ఆసీస్ కోచ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment