డేవిడ్‌ వార్నర్‌ ఆలస్యంగా...  | 12 Australian Players Will Miss Starting Matches Of IPL 2020 | Sakshi
Sakshi News home page

డేవిడ్‌ వార్నర్‌ ఆలస్యంగా... 

Published Sat, Aug 15 2020 2:14 AM | Last Updated on Sat, Aug 15 2020 2:14 AM

12 Australian Players Will Miss Starting Matches Of IPL 2020 - Sakshi

మెల్‌బోర్న్‌: వార్నర్, స్మిత్, ఫించ్, మ్యాక్స్‌వెల్, కమిన్స్‌... ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆరంభ దశ మ్యాచ్‌లకు దూరమయ్యే ఆస్ట్రేలియాకు చెందిన స్టార్‌ ఆటగాళ్లు వీరు. ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లు ముగిసిన తర్వాతే వీరు యూఏఈకి వెళతారు. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా మూడు టి20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడుతుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా బోర్డు (సీఏ) 21 మంది సభ్యులతో కూడిన జంబో జట్టును ప్రకటించింది. వీరిలో 12 మంది ఐపీఎల్‌లో ఆడుతున్నారు.

ఐపీఎల్‌కు ఆలస్యంగా రానున్న ఇతర ఆసీస్‌ ఆటగాళ్ల జాబితాలో మిషెల్‌ మార్‌‡్ష, జోష్‌ ఫిలిప్, కేన్‌ రిచర్డ్సన్, అలెక్స్‌ కారీ, మార్క్‌ స్టొయినిస్, జోష్‌ హాజల్‌వుడ్, ఆండ్రూ టై ఉన్నారు. వీరిలో వార్నర్‌ సన్‌రైజర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా... ప్యాట్‌ కమిన్స్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రికార్డు మొత్తానికి వేలంలో తీసుకుంది. స్మిత్‌ రాజస్తాన్‌ జట్టుకు, మ్యాక్స్‌వెల్‌ పంజాబ్‌కు, ఫించ్‌ బెంగళూరు టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లీగ్‌లో మరో ఇద్దరు ఆసీస్‌ క్రికెటర్లు నాథన్‌ కూల్టర్‌ నీల్, క్రిస్‌ లిన్‌ ముంబై ఇండియన్స్‌కు ఆడనుండగా... వీరిద్దరు ఆస్ట్రేలియా జట్టులోకి ఎంపిక కాలేదు. కాబట్టి ఇతర సహచరులతో కలిసి వారు సరైన సమయంలోనే యూఏఈ చేరుకుంటారు.  

ఇంగ్లండ్‌–ఆస్ట్రేలియా సిరీస్‌ వచ్చే నెల 4 నుంచి 16 వరకు కొనసాగుతుంది. ఐపీఎల్‌ సెప్టెంబర్‌ 19న మొదలవుతుంది. అయితే ఐపీఎల్‌ తాజా నిబంధనల ప్రకారం ఏ దేశంనుంచి క్రికెటర్లు యూఏఈకి వచ్చినా కచ్చితంగా వారం రోజుల పాటు హోటల్‌లో క్వారంటైన్‌లో ఉండాలి. ఆ వారంలో మొదటి, మూడు, ఆరో రోజుల్లో వారికి కోవిడ్‌–19 పరీక్షలు నిర్వహిస్తారు. మూడు పరీక్షల్లో కూడా నెగిటివ్‌గా వస్తేనే జట్టుతో చేరి ప్రాక్టీస్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తారు. కొన్ని ఫ్రాంచైజీలు ఇంగ్లండ్‌నుంచి వచ్చే ఆటగాళ్ల క్వారంటైన్‌ సమయాన్ని తగ్గించాలంటూ ప్రత్యేక విజ్ఞప్తి చేసినా... దానిని గవర్నింగ్‌ కౌన్సిల్‌ తిరస్కరించినట్లు తెలిసింది. ఐపీఎల్‌ కోసం బీసీసీఐ రూపొందించిన ఎస్‌ఓపీకి యూఏఈ ప్రభుత్వంనుంచి ఇంకా అధికారికంగా ఆమోద ముద్ర కూడా పడాల్సి ఉంది.
ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కూడా...
ఆస్ట్రేలియాలాగే ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కూడా ఆలస్యంగానే తమ తమ ఐపీఎల్‌ జట్లతో చేరతారు. ఇంగ్లండ్‌నుంచి బెన్‌ స్టోక్స్, ఇయాన్‌ మోర్గాన్, జాస్‌ బట్లర్‌ సహా మొత్తం 13 మంది ఐపీఎల్‌ బరిలో నిలిచారు.  

మెక్‌డొనాల్డ్‌కు అనుమతి... 
ఆటగాళ్ల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వని సీఏ అసిస్టెంట్‌ కోచ్‌ మెక్‌డొనాల్డ్‌కు మాత్రం ఐపీఎల్‌ కోసం నేరుగా యూఏఈ వెళ్లేందుకు పత్యేక అనుమతి మంజూరు చేసింది. అతను రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 
ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన 

ఆస్ట్రేలియా జట్టు
ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), సీన్‌ అబాట్, అస్టన్‌ అగర్, అలెక్స్‌ కారీ, కమిన్స్,  హాజల్‌వుడ్, మార్నస్‌ లబ్‌షేన్, నాథన్‌ లయన్, మిషెల్‌ మార్‌‡్ష, మ్యాక్స్‌వెల్, రిలీ మెరిడిత్, జోష్‌ ఫిలిప్, సామ్స్, కేన్‌ రిచర్డ్సన్, స్టీవ్‌ స్మిత్, మిషెల్‌ స్టార్క్, స్టొయినిస్, ఆండ్రూ టై, మ్యాథ్యూ వేడ్, డేవిడ్‌ వార్నర్, ఆడమ్‌ జంపా.

సిరీస్‌ షెడ్యూల్‌
3 టి20 మ్యాచ్‌లు – సెప్టెంబర్‌ 4, 6, 8 (వేదిక సౌతాంప్టన్‌)  
3 వన్డే మ్యాచ్‌లు – సెప్టెంబర్‌ 11, 13, 16 (వేదిక మాంచెస్టర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement