మన వనిత... పరాజిత | India Womens Team Lost ICC T20 World Cup | Sakshi
Sakshi News home page

మన వనిత... పరాజిత

Published Mon, Mar 9 2020 12:47 AM | Last Updated on Mon, Mar 9 2020 10:46 AM

India Womens Team Lost ICC T20 World Cup - Sakshi

మరో ప్రపంచ కప్‌ ఫైనల్‌... మళ్లీ అదే ఓటమి వ్యథ... విశ్వ వేదికపై భారత మహిళల క్రికెట్‌ జట్టు వేదన పునరావృతమైంది. గత వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్లో చివరి వరకు పోరాడి పరాజయం వైపు ఉండిపోయిన మన బృందం ఈసారి టి20 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో కూడా ఓటమి పక్షానే నిలవాల్సి వచ్చింది. రికార్డు సంఖ్యలో మైదానంలో 86,174 మంది ప్రేక్షకులు, అటు ప్రత్యర్థిగా ఆతిథ్య జట్టు, భారీ లక్ష్యం... అన్నీ కలగలిసి తీవ్ర ఒత్తిడిలో హర్మన్‌ బృందం కుప్పకూలింది. కనీస పోటీ కూడా ఇవ్వలేక చేతులెత్తేసిన తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. 

లీగ్‌ దశలో భారత్‌ చేతిలో ఓడినా... అసలు పోరులో ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. లోపాలు సరిదిద్దుకొని సరైన వ్యూహంతో బరిలోకి దిగి భారత్‌ను దెబ్బ కొట్టింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో ఐదోసారి పొట్టి ప్రపంచ కప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లు హీలీ, మూనీ ఇచ్చిన ఆరంభం భారీ స్కోరుకు బాటలు వేయగా, బౌలింగ్‌లో మెగాన్‌ షూట్, జొనాసెన్‌ చెలరేగి ప్రత్యర్థి ఆటకట్టించారు. టోర్నీలో ప్రయాణం తడబడుతూనే సాగినా ... చివరకు తమ స్థాయిని ప్రదర్శించి ఆసీస్‌ ఐదోసారి జగజ్జేతగా నిలిచింది.

మెల్‌బోర్న్‌: భారత మహిళల క్రికెట్‌ జట్టు ప్రపంచ విజేతగా నిలవాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే! టి20 వరల్డ్‌ కప్‌లో తొలిసారి ఫైనల్‌ చేరి అరుదుగా లభించిన అవకాశాన్ని అందుకోవడంలో విఫలమైన మన జట్టు మళ్లీ రన్నరప్‌గానే ముగించింది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 85 పరుగుల భారీ తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అలీసా హీలీ (39 బంతుల్లో 75; 7 ఫోర్లు, 5 సిక్సర్లు)... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ బెత్‌ మూనీ (54 బంతుల్లో 78 నా టౌట్‌; 10 ఫోర్లు) తొలి వికెట్‌కు 70 బంతుల్లోనే 115 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్‌ 19.1 ఓవర్లలో 99 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ (35 బంతుల్లో 33; 2 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. షూట్‌ (4/18), జొనాసెన్‌ (3/20) భారత ఇన్నింగ్స్‌ పతనాన్ని శాసించారు.

హీలీ విధ్వంసం... 
స్పిన్‌ బలాన్ని నమ్ముకున్న భారత్‌... దీప్తి శర్మతో తొలి ఓవర్‌ వేయించింది. అయితే మొదటి బంతిని ముందుకు దూసుకొచ్చి ఆడి బౌండరీగా మలచిన హీలీ తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. అదే ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ... శిఖా వేసిన తర్వాతి ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టింది. పవర్‌ప్లే తర్వాత కూడా హీలీ దూకుడు తగ్గలేదు. రాజేశ్వరి వేసిన ఓవర్లో ఆమె వరుసగా రెండు సిక్సర్లు కొట్టింది. ఇందులో మొదటిది ఏకంగా 83 మీటర్ల దూరంలో పడింది! అనంతరం 30 బంతుల్లోనే ఆమె అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత శిఖా వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో హీలీ పండగ చేసుకుంది.

వరుసగా మూడు బంతుల్లో ఆమె 6, 6, 6 బాదింది. ఈ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. తొలి వికెట్‌ భాగస్వామ్యం సెంచరీ దాటిన తర్వాత ఎట్టకేలకు రాధ యాదవ్‌ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో హీలీ అవుట్‌ కావడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. హీలీకి జతగా మరోవైపు మూనీ చక్కటి బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చింది. ఆమె 41 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుంది. వీరిద్దరి తర్వాత వచ్చిన ఇతర బ్యాటర్‌లను నిలువరించడంలో భారత్‌ సఫలమైంది. ఫలితంగా చేతిలో 9 వికెట్లు ఉన్నా... చివరి 5 ఓవర్లలో ఆసీస్‌ 42 పరుగులే చేయగలిగింది.

దీప్తి మినహా... 
ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో షూట్‌ వేసిన మొదటి ఓవర్లో షఫాలీ 4 ఫోర్లతో 16 పరుగులు రాబట్టింది. కానీ ఈసారి షూట్‌ వంతు! తొలి ఓవర్‌ మూడో బంతికే హీలీ అద్భుత క్యాచ్‌కు షఫాలీ (2) వెనుదిరిగింది. జొనాసెన్‌ వేసిన రెండో ఓవర్లో మెడకు బంతి తగలడంతో తానియా (2) రిటైర్డ్‌హర్ట్‌గా నిష్క్రమించగా,  జెమీమా (0) పేలవ షాట్‌తో వెనుదిరిగింది. ఆ తర్వాత మాలినెక్స్‌ కూడా తన మొదటి ఓవర్లోనే స్మృతి (11) పని పట్టింది. జొనాసెన్‌ తర్వాతి ఓవర్లో డీప్‌లో క్యాచ్‌ ఇచ్చి కెప్టెన్‌ హర్మన్‌ కౌర్‌ (4) అవుట్‌ కావడంతో భారత్‌ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. వేద (24 బంతుల్లో 19; 1 ఫోర్‌), తానియా స్థానంలో కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రిచా ఘోష్‌ (18; 2 ఫోర్లు)తో కలిసి దీప్తి కొద్దిసేపు పోరాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.

ఆ రెండు క్యాచ్‌లు...
ఆసీస్‌లాంటి జట్టుకు ‘లైఫ్‌’ ఇస్తే ఎలా ఉంటుందో ఫైనల్‌ మ్యాచ్‌ మళ్లీ చూపించింది. రెండుసార్లు తమకు వచ్చిన అవకాశాలను భారత్‌ జారవిడుచుకొని మూల్యం చెల్లించింది. తొలి ఓవర్‌ ఐదో బంతికి హీలీ వ్యక్తిగత స్కోరు 9 వద్ద ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కవర్స్‌లో షఫాలీ వర్మ వదిలేయగా... రాజేశ్వరి తన మొదటి ఓవర్లోనే మూనీ తన వ్యక్తిగత స్కోరు 8 వద్ద ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను నేలపాలు చేసింది. వీరిద్దరే ఆ తర్వాత చెలరేగి భారత్‌ కథ ముగించారు.

►5 ఆస్ట్రేలియాకు ఇది 5వ ప్రపంచకప్‌ టైటిల్‌.  7 సార్లు టోర్నీ జరిగితే ఇంగ్లండ్, వెస్టిండీస్‌ ఒక్కోసారి నెగ్గాయి.
►30 అలీసా హీలీ అర్ధ సెంచరీకి తీసుకున్న బంతులు. ఏ ఐసీసీ టోర్నీ ఫైనల్లోనైనా (పురుషులతో సహా) ఇదే ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ.
►184 ఫైనల్లో ఆసీస్‌  స్కోరు. ఏ టి20 ప్రపంచకప్‌లోనైనా (పురుషులతో సహా) ఇదే అత్యధిక స్కోరు.
►85 భారత్‌కు ఇది రెండో (85 పరుగులు) అతి పెద్ద పరాజయం. గతంలో దక్షిణాఫ్రికా చేతిలో 105 పరుగులతో ఓడింది.
►52 శిఖా పాండే ఇచ్చిన పరుగులు. ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో ఒక బౌలర్‌ ఇచ్చిన అత్యధిక పరుగులు ఇవే.

86, 174 ఎంసీజీలో ఫైనల్‌ మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకుల సంఖ్య. ఒక మహిళల క్రికెట్‌ మ్యాచ్‌కు ఎక్కడైనా హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య ఇది కాగా... ఆస్ట్రేలియా గడ్డపై ఏ క్రీడాంశంలోనైనా మహిళల మ్యాచ్‌కు హాజరైన అత్యధిక ప్రేక్షకుల సంఖ్య కూడా ఇదే.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: అలీసా హీలీ (సి) వేద (బి) రాధ 75; బెత్‌ మూనీ (నాటౌట్‌) 78; మెగ్‌ లానింగ్‌ (సి) శిఖా పాండే (బి) దీప్తి శర్మ 16; గార్డ్‌నర్‌ (స్టంప్డ్‌) తానియా (బి) దీప్తి  శర్మ 2; హేన్స్‌ (బి) పూనమ్‌ 4; క్యారీ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 184. 
వికెట్ల పతనం: 1–115; 2–154; 3–156; 4–176. 
బౌలింగ్‌: దీప్తి శర్మ 4–0–38–2; శిఖా పాండే 4–0–52–0; రాజేశ్వరి 4–0–29–0; పూనమ్‌ యాదవ్‌ 4–0–30–1; రాధ యాదవ్‌ 4–0–34–1.

భారత్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ వర్మ (సి) అలీసా హీలీ (బి) షూట్‌ 2; స్మృతి మంధాన (సి) క్యారీ (బి) మాలినెక్స్‌ 11; తానియా (రిటైర్డ్‌హర్ట్‌) 2; జెమీమా రోడ్రిగ్స్‌ (సి) క్యారీ (బి) జొనాసెన్‌ 0; హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) జొనాసెన్‌ 4; దీప్తి శర్మ (సి) మూనీ (బి) క్యారీ 33; వేద కృష్ణమూర్తి (సి) జొనాసెన్‌ (బి) కిమిన్స్‌ 19; రిచా ఘోష్‌ (సి) క్యారీ (బి) షూట్‌ 18; శిఖా పాండే (సి) మూనీ (బి) షూట్‌ 2; రాధ (సి) మూనీ (బి) జొనాసెన్‌ 1; పూనమ్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) షూట్‌ 1; రాజేశ్వరి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో ఆలౌట్‌) 99. 
వికెట్ల పతనం: 1–2; 1–5 (రిటైర్డ్‌హర్ట్‌), 2–8; 3–18; 4–30; 5–58; 6–88; 7–92; 8–96; 9–97; 10–99.  
బౌలింగ్‌: మెగాన్‌ షూట్‌ 3.1–0–18–4; జొనాసెన్‌ 4–0–20–3; మాలినెక్స్‌ 4–0–21–1; కిమిన్స్‌ 4–0–17–1; క్యారీ 4–0–23–1. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement