మెల్‌బోర్న్: సెమీఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన చోట ఆస్ట్రేలియా మహిళల జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో వరుసగా ఏడోసారి టి20 ప్రపంచ కప్‌లో సెమీస్ చేరిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (50 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. ఆమెకు మెగ్ ల్యానింగ్ (21; 4 ఫోర్లు), గార్డ్‌నెర్ (20; 2 ఫోర్లు), ఎలీస్ పెర్రీ (21; 2 ఫోర్లు) సహాయపడగా... చివర్లో రాచెల్ హైనస్ (8 బంతుల్లో 19; 2 ఫోర్లు, సిక్స్) దూకుడుగా ఆడింది.
అనంతరం ఛేదనలో కివీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసి ఓడింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జార్జియా వారెమ్ (3/17), మేఘాన్ షూట్ (3/28) ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. నిలకడగా ఆడుతున్నట్లు కనిపించిన సోఫీ డివైన్ (31; 2 ఫోర్లు, సిక్స్), సుజీ బేట్స్ (14; 2 ఫోర్లు), మ్యాడీ గ్రీన్ (28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)లను వారెమ్ పెవిలియన్‌కు చేర్చి మ్యాచ్‌ను ఆసీస్ వైపుకు తిప్పింది. మార్టిన్ (18 బంతుల్లో 37; 4 ఫోర్లు, సిక్స్) కివీస్ విజయం కోసం తుది వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో గెలుపు కోసం 20 పరుగులు చేయాల్సి ఉండగా... కివీస్ 15 పరుగులను మాత్రమే రాబట్టగలిగింది. ఇదే గ్రూప్‌లో నామమాత్రంగా జరిగిన మరో మ్యాచ్‌లో శ్రీలంక 9 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 91 పరుగులు చేసింది. నిగర్ సుల్తానా (39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. శశికళ సిరివర్దనే 4 వికెట్లతో రాణించింది. శ్రీలంక 15.3 ఓవర్లలో వికెట్ నష్టపోయి 92 పరుగులు చేసి విజయంతో టోర్నీని ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment