ఈ టి20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌లో మొదలైన సంచలనాలు ‘సూపర్ 12’లో ముగిశాయి. ఇప్పుడిక మేటి జట్ల మధ్య నాకౌట్ మెరుపులకు రంగం సిద్ధమైంది. వర్షం కురిస్తే రిజర్వ్ డే ఉందేమో కానీ ఓడితే మాత్రం ఇంకో మ్యాచ్ ఉండదు. ఇంటిముఖం పట్టాల్సిందే! అదృష్టం కలిసొచ్చిన పాకిస్తాన్ జట్టుతో నిలకడగా ఆడుతున్న న్యూజిలాండ్ నేడు జరిగే తొలి సెమీఫైనల్లో తలపడనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ టైటిల్ వేటలో తొలి అడుగు వేసేందుకు సై అంటుండగా... గత ప్రపంచకప్‌లో సెమీస్‌తో ముగిసిన తమ ప్రయాణాన్ని ఈసారి ఫైనల్ దాకా కొనసాగించాలని, 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పాకిస్తాన్ పట్టుదలతో ఉంది.
సిడ్నీ: ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్‌లలో (వన్డే, టి20) ఇప్పటివరకు న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ ఓడిపోలేదు. కానీ ఈసారి పాకిస్తాన్ జట్టుకు గెలవడం అంత సులభం కాదేమో! బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతి విభాగంలో పాక్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్న కివీస్ విజయమే లక్ష్యంగా టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో బరిలోకి దిగుతోంది. పడుతూ లేస్తూ వచ్చి న బాబర్ ఆజమ్ బృందం ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే సర్వశక్తులు ఒడ్డితేనే ముందడుగు వేస్తుంది. లేదంటే గత ఏడాది మాదిరిగానే ఈసారీ సెమీఫైనల్లో నిష్క్రమించాల్సి వస్తుంది. చివరిసారి 2009 టి20 ప్రపంచకప్‌లో ఫైనల్ చేరి విజేతగా నిలిచిన పాక్ ఆ తర్వాత ఫైనల్ చేరలేకపోయింది.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో...
ఈ టోర్నీ ఆరంభం నుంచి కూడా న్యూజిలాండ్ నిలకడైన ప్రదర్శనతో విజయాలు సాధిస్తూ వచ్చింది. ఒక్క ఇంగ్లండ్ మ్యాచ్‌లో మినహా ప్రతి మ్యాచ్‌లోనూ పెద్ద తేడాతోనే నెగ్గుకొచ్చింది. ఆతిథ్య ఆసీస్‌నైతే 89 పరుగులతో ఓడించింది. టాపార్డర్‌లో ఓపెనర్లు అలెన్, డెవాన్ కాన్వే, కెప్టెన్ విలియమ్సన్ సహా నాలుగో వరుసలో గ్లెన్ ఫిలిప్స్ రాణిస్తున్నారు. ముఖ్యంగా లంకతో జరిగిన పోరులో టాపార్డర్ మూకుమ్మడిగా విఫలమైనా... ఫిలిప్స్ ఒంటిచేత్తో శతక్కొట్టి గెలుపును ఖాయం చేశాడు. బౌలింగ్‌లో బౌల్ట్, సౌతీ, సాన్‌ట్నర్, ఫెర్గూసన్, సోధి ప్రత్యర్థి బ్యాటర్స్‌ను ఇబ్బంది పెడుతున్నారు. బౌల్ట్ మినహా మిగతా నలుగురు బౌలర్లు ప్రతీ మ్యాచ్‌లోనూ వికెట్లను పడగొట్టారు. .
ఒత్తిడిలో బాబర్ జట్టు
పాకిస్తాన్ ఈ టోర్నీలో సాధారణ ప్రదర్శనతోనే నెట్టుకొచ్చింది. అదృష్టంతో ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. అయితే ఇక్కడ మాత్రం అదృష్టాన్ని నమ్ముకుంటే కుదరదు... మెరుపుల్లేని ఓపెనింగ్ జోడీ రిజ్వాన్, బాబర్ బ్యాట్ ఝుళిపించాల్సిందే. మిడిలార్డర్‌లో ఇఫ్తికార్, షాన్ మసూద్ ఆదుకుంటున్నారు. బౌలింగ్ కూడా రాటుదేలితేనే పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఢీకొట్టగలదు. లేదంటే ఇక్కడితోనే ఇంటిబాట ఖాయం!
గత రికార్డులు..
- న్యూజిలాండ్‌తో జరిగిన మూడు ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో (1992, 1999 వన్డే వరల్డ్‌కప్, 2007 టి20 ప్రపంచకప్) పాకిస్తాన్ జట్టే గెలిచింది.
- అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో ఓవరాల్‌గా న్యూజిలాండ్, పాక్ జట్ల మధ్య 28 మ్యాచ్‌లు జరిగాయి. 17 మ్యాచ్‌ల్లో పాక్ గెలుపొందగా... 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది.
పిచ్, వాతావరణం
సిడ్నీ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం కావడంతో మెరుపులకు కొదవే ఉండదు. కివీస్, ఆసీస్‌ల మధ్య ‘సూపర్ 12’ తొలి మ్యాచ్‌కు ఉపయోగించిన పిచ్‌పైనే తొలి సెమీస్‌ను ఆడిస్తున్నారు. దీంతో పాక్‌కంటే న్యూజిలాండ్‌కే కాస్త అనుకూలం ఎందుకంటే ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టుపై 200 పరుగులు చేసింది. ఉదయం చినుకులు కురిసే అవకాశమున్నప్పటికీ మ్యాచ్ సమయానికి ఏ ఇబ్బంది ఉండదు.
జట్లు (అంచనా)
న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), అలెన్, డెవాన్ కాన్వే, ఫిలిప్స్, మిచెల్, నీషమ్, సాన్‌ట్నర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, సోధి, ఫెర్గూసన్.
పాకిస్తాన్: బాబర్ ఆజమ్ (కెప్టెన్), రిజ్వాన్, హారిస్, షాన్ మసూద్, ఇఫ్తికార్, నవాజ్, షాదాబ్ ఖాన్, వసీమ్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రవూఫ్.
చదవండి: 'కోహ్లి కొట్టిన సిక్స్ చరిత్రలో నిలిచిపోతుంది'
Comments
Please login to add a commentAdd a comment