వరుసగా రెండు విజయాల ఊపు. సమష్టిగా రాణిస్తున్న జట్టు. మరొక్క గెలుపు చాలు... సెమీఫైనల్స్ చేరినట్లే! ప్రత్యర్థి బలహీన ఐర్లాండ్! పరాజ యాలతో ఇప్పటికే ఇంటి బాటలో ఉంది! టీమిండియా చేయాల్సిందల్లా మరోసారి చెలరేగడమే.
గయానా: పటిష్ట న్యూజిలాండ్‌ను మట్టికరిపించి... దాయాది పాకిస్తాన్‌ను చిత్తుచేసిన టీమిండియా మహిళల టి20 ప్రపంచ కప్ మూడో లీగ్ మ్యాచ్‌లో గురువారం ఐర్లాండ్‌తో తలపడనుంది. దీంట్లోనూ ప్రత్యర్థిని ఓడిస్తే వరుసగా మూడో గెలుపుతో టీమిండియా నేరుగా సెమీఫైనల్ చేరుతుంది. అన్ని రంగాల్లో అదరగొడుతూ, దూకుడు మీదున్న హర్మన్‌ప్రీత్ కౌర్ బృందానికి ఇదేమంత పెద్ద పనేం కాదు. అయితే, పోరాటపటిమ చూపే ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయకపోవడం మంచిది.
ఆ ఇద్దరూ రాణిస్తే...
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎంతటి విధ్వంసకరంగా ఆడుతుందో, యువ జెమీమా రోడ్రిగ్స్ ధాటి ఏమిటో కివీస్‌పై వారి ఇన్నింగ్స్‌లు చాటాయి. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగని వెటరన్ మిథాలీ రాజ్... పాక్‌పై చక్కటి అర్ధ శతకంతో ఫామ్‌ను చూపింది. మిగిలింది స్మృతి మంధాన, వేద కృష్ణమూర్తి. వీరిద్దరూ ఐర్లాండ్‌పై చెలరేగితే భారత్ బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుంది. తద్వారా గ్రూప్ ‘బి’ టాపర్ స్థానం కోసం ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌కు సంసిద్ధం అయినట్లుంటుంది. నెమ్మదైన విండీస్ పిచ్‌లను టీమిండియా స్పిన్ చతుష్టయం హేమలత, రాధా యాదవ్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ సమర్థంగా ఉపయోగించుకుంటూ, పొదుపుగా బౌలింగ్ చేస్తున్నారు. హేమలత, పూనమ్ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 10 వికెట్లు పడగొట్టారు. ఐర్లాండ్‌పైనా ఏకైక పేసర్‌గా తెలుగమ్మాయి అరుంధతి రెడ్డినే కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్‌లో తేలిపోయింది. వంద పరుగులైనా చేయలేకపోతోంది. ఛేదనలోనూ చేతులెత్తేస్తోంది. ఒకరిద్దరు తప్ప బౌలర్లూ ప్రభావవంతంగా లేరు. భారత్‌తో మ్యాచ్ వారికి చావోరేవోలాంటిది. గెలిస్తేనే ప్రపంచ కప్ ప్రయాణంపై ఎంతోకొంత ఆశలుంటాయి.
హ్యాట్రిక్ గెలుపుతో సెమీస్‌లో ఆసీస్
వరుసగా మూడో విజయంతో మహిళల టి20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ చేరింది. మూడో లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 33 పరుగులతో న్యూజిలాండ్‌ను ఓడించింది. తొలుత ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ అలీసా హీలీ (38 బంతుల్లో 53; 8 ఫోర్లు) వరుసగా రెండో అర్ధశతకంతో చెలరేగింది. ఓపెనర్ బెథాని మూనీ (26; 4 ఫోర్లు)తో పాటు రాచెల్ హేన్స్ (29; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మేఘన్ (3/25) మూడు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో మెగాన్ షట్ (3/12), సోఫీ (2/20), డెలిస్సా కిమ్మిన్స్ (2/24) ధాటికి న్యూజిలాండ్ 17.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది.
ఐర్లాండ్‌ను ఓడించిన పాక్
మరో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై పాకిస్తాన్ 38 పరుగులతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కెప్టెన్ జవేరియా ఖాన్ (52 బంతుల్లో 74; 11 ఫోర్లు) అజేయ అర్ధశతకం, ఓపెనర్ అయేషా జాఫర్ (22) తోడ్పాటుతో పాక్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. లూసీ ఓరియల్ (3/19) కట్టడి చేసింది. అయితే, ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ స్వల్ప లక్ష్యాన్నీ ఛేదించలేకపోయారు. పాక్ బౌలర్లు సనా మిర్ (2/20), ఐమన్ అన్వర్ (2/25), నష్రా సంధు (2/8), అలియా రియాజ్ (2/16) ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేసే అవకాశమివ్వలేదు. ఓపెనర్ క్లేర్ షిల్లింగ్టన్ (25 బంతుల్లో 27; 5 ఫోర్లు), ఇసొబెల్ జాయ్సె (31 బంతుల్లో 30; 4 ఫోర్లు) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Comments
Please login to add a commentAdd a comment