Indian Women Cricket Former Captain Mithali Raj Interview With Sakshi - Sakshi
Sakshi News home page

‘శభాష్‌’ అనిపించుకోగలిగాను!

Published Tue, Jun 21 2022 5:11 AM | Last Updated on Tue, Jun 21 2022 9:03 AM

Indian women cricket former captain Mithali raj interview with sakshi - Sakshi

2005... మెదక్‌ పట్టణంలో ఒక చిన్నస్థాయి క్రికెట్‌ టోర్నీ... అమ్మాయిలు క్రికెట్‌ ఆడటమే అరుదు అనుకుంటే కొందరు స్థానికుల చొరవతో టోర్నమెంట్‌ కూడా జరుగుతోంది. ఒక మ్యాచ్‌లో సరిగా చూస్తే మిథాలీ రాజ్‌ బ్యాటింగ్‌ చేస్తోంది. ఆమె భారత క్రికెట్‌ జట్టు తరఫున ఆడటం మొదలు పెట్టి అప్పటికే ఆరేళ్లు దాటింది... కానీ అక్కడ బరిలోకి దిగడానికి ఆమె సంకోచించలేదు... ఇలాంటి అంకితభావమే ఆమెను గొప్పగా తీర్చిదిద్దింది. ఆటపై ఉన్న అభిమానమే ఏకంగా 23 ఏళ్లు దేశం తరఫున ఆడేలా చేసింది. ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ రాజ్‌ ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన పలు విశేషాలు...
 
బయోపిక్‌... బయోగ్రఫీ...
రిటైర్మెంట్‌ తర్వాతి కెరీర్‌పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. నాకు తెలిసిన విద్య క్రికెట్‌ మాత్రమే కాబట్టి ఆటకు సంబంధించిందే అవుతుంది. ప్రస్తుతం నా బయోపిక్‌ ‘శభాష్‌ మిథూ’ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నాను. నా బాల్యం నుంచి పెద్ద స్థాయికి ఎదిగే వరకు వేర్వేరు అంశాలతో సినిమా ఉంటుంది. అయితే ఎక్కడితో సినిమాను ముగిస్తున్నామో ఇప్పుడే చెప్పను. తాప్సీ చక్కటి నటి కావడంతో పాటు మహిళా ప్రధాన చిత్రాలు కూడా కొన్ని చేసింది కాబట్టి బయోపిక్‌ కోసం ఆమెను సరైన వ్యక్తిగా అనుకున్నాం. దీంతో పాటు నా ఆటోబయోగ్రఫీ పని కూడా నడుస్తోంది. త్వరలోనే పుస్తకం విడుదలవుతుంది.  

లోటుగా భావించడం లేదు
ప్రపంచకప్‌ గెలవాలనేది నా కల. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను కూడా. అయితే చివరకు అది లేకుండానే కెరీర్‌ ముగిసింది. కానీ అది లేనంత మాత్రాన నా ఇన్నేళ్ల ప్రదర్శన విలువ తగ్గదు. భారత పురుషుల క్రికెట్‌లోనూ చూస్తే ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌లో భాగం కాకపోయినా, క్రికెట్‌ చరిత్రలో గొప్ప ఆటగాళ్లుగా నిలిచినవారు ఎంతో మంది ఉన్నారు. రెండు ప్రపంచకప్‌లలో జట్టును ఫైనల్‌కు చేర్చడం కూడా చెప్పుకోదగ్గ ఘనతే కాబట్టి విచారం ఏమీ లేదు.  

సుదీర్ఘ కెరీర్‌కు అదే కారణం
చాలా ఎక్కువగా కష్టపడే తత్వమే నన్ను ఈ స్థాయికి చేర్చింది. నిలకడగా, మార్పు లేకుండా ఇన్నేళ్ల పాటు ఒకే తరహా ‘టైమ్‌ టేబుల్‌’ను అమలు చేశాను. అత్యుత్తమంగా ఎదిగేందుకు సన్నద్ధత, ప్రతీ రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవడం, ఆటకు మెరుగులు దిద్దుకోవడం, అదే ప్రాక్టీస్, అదే డ్రిల్స్‌ను ఏకాగ్రత చెదరకుండా 23 ఏళ్ల పాటు కొనసాగించగలిగాను. రోజూ ఇదేనా అనే భావన లేకుండా మైదానంలోకి వచ్చేదాన్ని. నా సాధన నాకు ఎప్పుడూ బోర్‌ కొట్టలేదు. అందుకే ఇలాంటి కెరీర్‌ సాధ్యమైంది. సమాజంలో కొందరు నేను క్రికెట్‌ ఆడటంపై కామెంట్లు చేసినా... మైదానంలో మాత్రం ఎప్పుడూ, ఎలాంటి వివక్ష ఎదుర్కోలేదు.
 
అలా అనుకోలేదు
ఎన్నో గంటల ప్రాక్టీస్‌ తర్వాత కూడా ఆడింది చాలు, కొంత విరామం తీసుకుందాం, కొంచెం విశ్రాంతిగా కూర్చుందాం అనే ఆలోచన రాలేదు. చాలా ఎక్కువగా కష్టపడుతున్నాను కదా, ఇంత అవసరమా అనుకోలేదు. సరిగ్గా చెప్పాలంటే నాపై నేను ఎప్పుడూ జాలి పడలేదు. 23 ఏళ్ల కెరీర్‌లో నేను గాయాలపాలైంది కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు గాయపడినా సిరీస్‌ మొత్తానికో, ఒక టోర్నీకో ఎప్పుడూ దూరం కాలేదు. రక్తం కారినప్పుడు కూడా బయటకు వెళ్లాలనే భావన రాలేదు. నొప్పి, బాధను భరిస్తూనే ఆడేందుకు ప్రయత్నించా. ఆట ముగిసిన తర్వాతే కోలుకోవడంపై దృష్టి పెట్టా. ఇన్నేళ్ళలో ఇది కూడా నన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఒక్క 2009లో మాత్రమే మోకాలి గాయంతో చాలా బాధపడ్డా. రిటైర్మెంట్‌ ఇద్దామని అనుకున్న క్షణమది. అయితే అదృష్టవశాత్తూ కొన్నాళ్ల క్రితమే అధికారికంగా బీసీసీఐలోకి రావడంతో జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) సౌకర్యాలను తొలిసారి ఉపయోగించుకునే అవకాశం కలిగి కోలుకోగలిగాను.  

అన్ని చోట్లా ఆడాను
కెరీర్‌ ఆరంభంలో బీసీసీఐ సహకారం లేని సమయంలో ఆర్థికపరంగా మేం ఎదుర్కొన్న సమస్యలు, వాటిని పట్టించుకోకుండా ఆడటం గురించి అందరికీ తెలుసు. అయితే మరో అంశం గురించి నేను చెప్పాలి. క్రికెట్‌పై ఆ సమయంలో నాకున్న అపరిమిత ప్రేమ, పిచ్చి ఎక్కడికైనా వెళ్లేలా చేసింది. భారత్‌ తరఫున అరంగేట్రం చేసి ఆరేళ్లు దాటిన తర్వాత కూడా నేను ‘ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌’లకు వెళ్లడం మానలేదు. చిన్న పట్టణాల్లో, హైస్కూల్‌ మైదానాల్లో జరిగిన మ్యాచ్‌లలో కూడా పాల్గొన్నాను. టర్ఫ్‌ వికెట్, మ్యాట్‌ వికెట్‌ ఏదైనా సరే... ఆడే అవకాశం వస్తే చాలని అనిపించేది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా, మంచి జ్ఞాపకాలవి.  

టి20లు కలిసి రాలేదు
నేను అంతర్జాతీయ క్రికెట్‌ మొదలు పెట్టినప్పుడు టి20లు లేవు. మహిళల క్రికెట్‌లోనూ టెస్టులు ఉండి ఉంటే దాంతో పాటు వన్డేలను ఎంచుకొని అసలు టి20 ఆడకపోయేదాన్నేమో. కానీ టెస్టులు లేకపోవడంతో రెండో ఫార్మాట్‌ అవసరం ఏర్పడింది. నేను మూడో టి20 ఆడే సమయానికే నా అంతర్జాతీయ కెరీర్‌ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఇంత ఆలస్యంగా మొదలు పెట్టడంతో నేను సర్దుకోవడానికే టైమ్‌ పట్టింది. ఓపెనర్‌గా వచ్చే సాహసం చేశాక పరిస్థితి కొంత మెరుగుపడింది. అయితే ఆశించినంత స్థాయిలో ఫలితాలు రాలేదు. కోచ్‌ రమేశ్‌ పొవార్‌తో వివాదంతో నా కెరీర్‌ ముగియలేదు. ఆ తర్వాతా రెండు సిరీస్‌లు ఆడి ఇక చాలనుకున్నాను. అందుకే రిటైర్మెంట్‌ ప్రకటించాను.  

ప్రస్తుత క్రికెటర్లతో పోల్చరాదు
వాణిజ్యపరంగా నాకు ఆశించినంత గుర్తింపు రాలేదనేది వాస్తవం. వాస్తవికంగా చూస్తే సగంకంటే ఎక్కువ కెరీర్‌ నన్ను ఎక్కువ మంది కనీసం గుర్తు కూడా పట్టని విధంగానే సాగింది. అలాంటప్పుడు కార్పొరేట్లు ఎలా ముందుకొస్తాయి. సరిగా గమనిస్తే 2017 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాతి నుంచి భారత మహిళల ప్రతీ మ్యాచ్‌ టీవీలో లైవ్‌గా వచ్చింది. అంతకుముందు అసలు టీవీల్లో కూడా కనిపిస్తే కదా!  స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌లతో పోలిస్తే నా ప్రయాణం పూర్తిగా భిన్నం. వీరితో పోలిస్తే ఇప్పుడే వచ్చిన షఫాలీ, రిచాలు కూడా భిన్నం. కాబట్టి పోలిక అనవసరం. భారత మహిళల క్రికెట్‌ ఎదుగుదలలో నేనూ కీలక భాగం కావడమే అన్నింటికంటే ఎక్కువ సంతృప్తినిచ్చే అంశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement