కెప్టెన్ మిథాలీరాజ్
ఇంగ్లండ్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ ఒకవైపు... దీని గురించి సుదీర్ఘ చర్చోపచర్చలు సాగుతుండగా మరోవైపు సౌతాంప్టన్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో భారత మహిళల జట్టు ప్రశాంతంగా తమ సన్నాహాలు కొనసాగిస్తోంది. పురుషుల టీమ్‌తో పాటే ప్రయాణించి ఒకేసారి ఇంగ్లండ్ చేరిన మహిళలు డబ్ల్యూటీసీ ఫైనల్‌కంటే రెండు రోజుల ముందుగానే మైదానంలోకి దిగబోతున్నారు. నేటి నుంచి ఆతిథ్య జట్టుతో మిథాలీ బృందం తలపడే ఏకైక టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నాలుగు రోజుల ఈ పోరు ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం.
భారత జట్టు తాము ఆడిన గత వరుస మూడు టెస్టుల్లో కూడా గెలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే నాలుగో విజయంతో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలుస్తుంది.
బ్రిస్టల్: ఏడేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. బుధవారం నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడుతుంది. 2014 తర్వాత భారత్ టెస్టులు ఆడనుండటం ఇదే తొలిసారి కాగా... ఈ మధ్య కాలంలో మూడు టెస్టులు ఆడిన ఇంగ్లండ్‌దే కాస్త పైచేయిగా కనిపిస్తోంది. అయితే గత పర్యటనలో ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించిన భారత జట్టును తక్కువగా అంచనా వేయలేం.
సీనియర్లపైనే భారం...
భారత్ ఈ ఏకైక టెస్టు కోసం 18 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇందులో 8 మందికి మాత్రమే గతంలో టెస్టు ఆడిన అనుభవం ఉండగా... అందరూ ఆడిన మ్యాచ్‌లు కలిపి 30 మాత్రమే. వన్డే, టి20 ఫార్మాట్ రెగ్యులర్ ప్లేయర్లు ఈ ఫార్మాట్‌లో అదే స్థాయి ఆటను ప్రదర్శించడం అంత సులువు కాదు. పైగా వీరందరూ కనీసం దేశవాళీ క్రికెట్‌లో కూడా నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడలేదు. ఈ నేపథ్యంలో ఎంతో కొంత సీనియర్లే మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. పదేసి టెస్టుల అనుభవం ఉన్న కెప్టెన్ మిథాలీ రాజ్, పేసర్ జులన్ గోస్వామి జట్టును ముందుండి నడిపించాలి. బ్యాటింగ్‌లో మిథాలీ కీలకం కానుంది. ఆమె బలమైన డిఫెన్స్ కూడా వికెట్ల పతనాన్ని అడ్డుకోగలదు. అయితే జులన్ చాలా కాలంగా బౌలింగ్‌లో సుదీర్ఘ స్పెల్‌లు వేయలేదు కాబట్టి ఎలా ఆడుతుందనేది చూడాలి.
ఇంగ్లండ్ జట్టు
బ్యాటింగ్‌లో హర్మన్ ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ కీలకం కానున్నారు. క్రీజ్‌లో కాస్త ఓపిక ప్రదర్శించి ఎక్కువ సమయం క్రీజ్‌లో గడపగలిగితే వీరిద్దరు పరుగులు రాబట్టగల సమర్థులు. దీప్తి శర్మ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో పాటు ఓపెనర్‌గా పూనమ్ రౌత్ కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. స్పిన్నర్‌గా పూనమ్ యాదవ్‌కు కూడా తన సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. పేసర్లలో శిఖా పాండే, అరుంధతి రెడ్డిలలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది చూడాలి. అన్నింటికి మించి అందరి దృష్టి ఉన్న బ్యాటర్ షఫాలీ వర్మ. టి20లు మినహా కనీసం వన్డేల అనుభవం కూడా లేని షఫాలీని టెస్టులోకి ఎంపిక చేసింది ఆమె దూకుడైన ఆట కారణంగానే. షఫాలీ చెలరేగితే భారత్ పైచేయి సాధించగలదు. ఊహించినట్లుగానే ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు ఆశించినంత ప్రాక్టీస్ లభించలేదు. అయితే పరిమిత వనరులతోనే మెరుగ్గా ఆడగలమని జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది.
అనుభవజ్ఞులతో...
15 మంది సభ్యుల ఇంగ్లండ్ టెస్టు జట్టులో 11 మందికి టెస్టులు ఆడిన అనుభవం ఉంది. అందరూ కలిసి 47 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఇంగ్లండ్ జట్టు ఆడిన గత మూడు టెస్టుల్లో బరిలోకి దిగిన వారంతా దాదాపుగా ప్రస్తుత జట్టులో ఉన్నారు. కెప్టెన్ హీతర్‌నైట్, నటాలీ స్కివర్, ఓపెనర్ బీమాంట్, ఆల్‌రౌండర్ బ్రంట్‌లకు తమకంటూ అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పేసర్లు ష్రబ్‌సోల్, కేట్ క్రాస్‌లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా పేరు సంపాదించుకుంది. వీరందరికీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించగల సామర్థ్యం ఉంది. సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో పాటు ఫిట్‌నెస్‌పరంగా కూడా వీరంతా మన జట్టు సభ్యులతో పోలిస్తే చాలా ముందంజలో ఉన్నారు.
ఇన్నేళ్ల కెరీర్‌లో నేను చాలా తక్కువ టెస్టులే ఆడాననేది వాస్తవం. అయితే ఫార్మాట్ ఏదైనా సన్నాహాలు మాత్రం ఒకే తరహాలో ఉం టాయి. మేం అలాగే సిద్ధమయ్యాం. ఈ క్రమం లో అనేక మంది ఇతర క్రికెటర్ల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నాం. జట్టులోని జూనియర్ సహచరులకు కూడా టెస్టులు ఎలా ఆడాలనేదాని గురించి మేం చెప్పాం. చాలా మందికి కొత్త కాబట్టి అనవసరపు ఒత్తిడి పెంచుకోవద్దని, స్వేచ్ఛగా ఆడుతూ క్రికెట్‌ను ఆస్వాదించాలని చెప్పాం. మున్ముందు జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లలో తప్పనిసరిగా కనీసం ఒక టెస్టు ఉంటే బాగుంటుందనేది నా సూచన.
–మిథాలీ రాజ్, భారత కెప్టెన్
కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు 10 రోజులు
బర్మింగ్‌హమ్: 2022 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ పోటీలు జరిగే తేదీల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. టి20 ఫార్మాట్‌లో జరిగే ఈ మ్యాచ్‌లను జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు నిర్వహిస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్‌కు చోటు కల్పించడం ఇదే మొదటిసారి. ఆగస్టు వరకు లీగ్ మ్యాచ్‌లు, ఆగస్టు 6న సెమీఫైనల్ జరగనుండగా...ఆగస్టు 7న ఫైనల్‌తో పాటు మూడో స్థానం కోసం పోరు నిర్వహిస్తారు. కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా అర్హత సాధించగా... ఆతిథ్య జట్టు హోదాలో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. ఒకే వెస్టిండీస్ జట్టుగా కాకుండా వేర్వేరు కరీబియన్ దేశాలు (ట్రినిడాడ్, జమైకా తదితర) పోటీ పడి వాటిలోంచి ఒక టీమ్, 2022 జనవరిలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి మరో జట్టు అర్హత సాధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment