Mithali Raj: వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు! | Mithali Raj confirms retirement after ICC event | Sakshi
Sakshi News home page

Mithali Raj: వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు!

Published Sun, Apr 25 2021 5:18 AM | Last Updated on Sun, Apr 25 2021 12:02 PM

Mithali Raj confirms retirement after ICC event - Sakshi

న్యూఢిల్లీ: తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో అందనిద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్‌కప్‌ టైటిల్‌ కోసం వచ్చే ఏడాది మరోసారి ప్రయత్నిస్తానని భారత మహిళా స్టార్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత తాను ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలున్నాయని ఈ హైదరాబాదీ క్రికెటర్‌ సంకేతాలు ఇచ్చింది. ‘అంతర్జాతీయ క్రికెట్‌లో 21 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. 2022 నా కెరీర్‌లో చివరి ఏడాది కావొచ్చు. కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ నా ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తున్నాను.

వయసు పెరుగుతున్నకొద్దీ ఫిట్‌నెస్‌కు  ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నాకు తెలుసు’ అని శనివారం వర్చువల్‌గా జరిగిన ‘1971: ది బిగినింగ్‌ ఆఫ్‌ ఇండియాస్‌ క్రికెటింగ్‌ గ్రేట్‌నెస్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిథాలీ రాజ్‌ వ్యాఖ్యానించింది. ‘వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్నాయి. ఇప్పటి నుంచి ప్రతి సిరీస్‌ మాకు ముఖ్యమే.

వరల్డ్‌కప్‌ కోసం పటిష్ట జట్టును రూపొందించే పనిలో ఉన్నాం. ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో మనం కొంచెం బలహీనంగా ఉన్నాం. సీనియర్‌ జులన్‌ గోస్వామి రిటైరైతే ఆమె స్థానాన్ని భర్తీ చేసేవారు కావాలి’ అని 38 ఏళ్ల మిథాలీ తెలిపింది. 1999లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన మిథాలీ రాజ్‌ ఇప్పటివరకు 10 టెస్టులు, 214 వన్డేలు, 89 టి20 మ్యాచ్‌లు ఆడింది. ప్రత్యర్థి జట్టుపై ఎప్పుడూ దూకుడుగా వ్యవహరించాలని... ఈ విషయంలో విరాట్‌ కోహ్లిని మిథాలీ రాజ్‌ బృందం ఆదర్శంగా తీసుకోవాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ సూచించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement