మెల్‌బోర్న్: ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆసీస్ జట్టులో స్టార్క్ సతీమణి అలీసా హీలీ వికెట్ కీపర్, బ్యాటర్. మిచెల్ స్టార్క్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఆస్ట్రేలియా వన్డే జట్టు తరఫున సిరీస్‌లో బిజీగా ఉన్నాడు. అయినా సరే... తన భార్య ఆడే ఫైనల్ పోరును ప్రత్యక్షంగా తిలకించాలనుకున్న స్టార్క్ అంతే ఠంచనుగా తిరుగుముఖం పట్టేశాడు. దీంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పురుషుల జట్ల మధ్య శనివారం జరిగే ఆఖరి వన్డేకు స్టార్క్ దూరమయ్యాడు. ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్ సంతోషంగానే అతనికి అనుమతిచ్చింది.
‘ఇలాంటి అవకాశం జీవితంలో ఎవరికో ఒకరికి చాలా అరుదుగా వస్తుంది. స్టార్క్‌కు ఇప్పుడా చాన్స్ వచ్చింది. కాబట్టి తన శ్రీమతి ఆడే మ్యాచ్‌కు ప్రత్యక్షంగా మద్దతుగా నిలిచేందుకు సమ్మతించాం’ అని ఆస్ట్రేలియా పురుషుల జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పాడు. మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ 0–2తో కోల్పోయింది. ఇక అమ్మాయిల మెగా ఫైనల్ విషయానికొస్తే... భారత్ ఈ పొట్టి ఫార్మాట్‌లో తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సంపాదించగా... ఆసీస్ ఈ ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచింది. అన్నట్లు ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్ కూడా! కానీ తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment