మహిళా క్రికెటర్లకు ఘనస్వాగతం..
ముంబై: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడి తిరిగి స్వదేశం చేరుకున్న మిథాలీ సేనకు ఘనస్వాగతం లభించింది. బుధవారం తెల్లవారుజామున ఇంగ్లండ్ నుంచి ముంబై చేరుకున్న జట్టుకు బీసీసీఐ సిబ్బంది, అభిమానులు ఇండియా.. ఇండియా అంటూ హర్షాతిరేకల మధ్య ఘనంగా ఆహ్వానించారు.
జులై 23న ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 9పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. టోర్ని ఆసాంతం భారత మహిళల ప్రదర్శన భారత అభిమానుల మనసులను గెలుచుకొంది. కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్‌కౌర్, జులన్ గోస్వామితో పాటు పలువురు క్రికెటర్లకు ముంబైలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానంలో ఘనస్వాగతం లభించింది.
ఈ స్వాగతం అంచనా వేయలేదు..
ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ.. ‘స్వదేశంలో ఇంతటి ఘనస్వాగతం లభిస్తోందని ఏ ఒక్కరమూ అంచనా వేయలేదు. ప్రస్తుతం క్రీడల్లో అమ్మాయిలు అద్భుతంగా రాణిస్తున్నారు. వారంతా వేడుకలు చేసుకోవాలి. గతంలో మహిళా క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వారు కాదు. ప్రపంచకప్‌లో మా ప్రదర్శనతో ఇప్పుడు అందరూ మా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇది చాలా సంతోషకరం’ అని మిథాలీ తెలిపారు. త్వరలో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మిథాలీ సేనను సత్కరించనుంది. ఈ కార్యక్రమంలోనే గతంలో ప్రకటించిన నజరానా(ఒక్కొక్క మహిళా క్రికెటర్‌కు రూ.50లక్షలు)ను అందజేయనుంది. త్వరలో ప్రధాని మోదీని మిథాలీ సేన కలిసే అవకాశం ఉంది.