మహిళలు చేజేతులా... | T20  New Zealand won by 23 runs | Sakshi
Sakshi News home page

మహిళలు చేజేతులా...

Published Thu, Feb 7 2019 2:18 AM | Last Updated on Thu, Feb 7 2019 2:18 AM

T20  New Zealand won by 23 runs - Sakshi

భారత మహిళల విజయలక్ష్యం 160 పరుగులు... స్మృతి మంధాన జోరు మీదుండగా ఒక దశలో స్కోరు 102/1... మరో 52 బంతుల్లో 58 పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి పటిష్ట స్థితిలో ఉండి కూడా మన జట్టు కుప్పకూలింది. 34 పరుగులకే చివరి 9 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్‌ ముందు తలవంచింది. ఈ పోరుకు ముందు భారత్‌ తమ చివరి టి20 మ్యాచ్‌ను దాదాపు రెండున్నర నెలల క్రితం ప్రపంచ కప్‌ సెమీస్‌లో ఆడింది. నాడు 23 పరుగులకే చివరి 8 వికెట్లు కోల్పోయిన తీరును తాజా ఫలితం మళ్లీ గుర్తు చేసింది. సరిగ్గా అప్పటిలాగే స్మృతి, జెమీమా మినహా అంతా విఫలం కావడంతో హర్మన్‌ బృందం కుదేలైంది.   

వెల్లింగ్టన్‌: స్మృతి మంధాన సూపర్‌ హిట్‌... భారత్‌ అట్టర్‌ ఫ్లాప్‌... న్యూజిలాండ్‌ మహిళల జట్టుతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌ ఫలితంపై సంక్షిప్త వ్యాఖ్య ఇది! అద్భుతమైన ఆరంభం లభించినా దానిని కొనసాగించలేక మన అమ్మాయిలు చతికిల పడ్డారు. చివరకు 23 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. స్మృతి భారత్‌ తరఫున టి20ల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ (24 బంతుల్లో) నమోదు చేసినా జట్టును మాత్రం గెలిపించలేకపోయింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

సోఫీ డెవిన్‌ (62; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్‌ సాటర్‌వైట్‌ (33; 4 ఫోర్లు) అండగా నిలిచింది. అనంతరం భారత్‌ 19.1 ఓవర్లలో 136 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన (34 బంతుల్లో 58; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీతో పాటు జెమీమా రోడ్రిగ్స్‌ (33 బంతుల్లో 39; 6 ఫోర్లు) కూడా రాణించింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 98 పరుగులు జత చేశారు.   కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ (17) విఫలం కాగా... మిగతా ఎనిమిది మంది ఒక్కో అంకె స్కోరుకే పరిమితయ్యారు. లీ మేరీ తహుహు (3/30) భారత్‌ను దెబ్బ తీసింది. రెండో టి20 మ్యాచ్‌ రేపు ఆక్లాండ్‌లో జరుగుతుంది.  

కీలక భాగస్వామ్యం... 
ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే సుజీ బేట్స్‌ (7)ను ఔట్‌ చేసి పూనమ్‌ యాదవ్‌ భారత్‌కు శుభారంభం అందించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే గర్రీ (15)ని కూడా పూనమ్‌ బౌల్డ్‌ చేసింది. ఈ దశలో డెవిన్, సాటర్‌వైట్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. 69 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యాన్ని హైదరాబాద్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి విడగొట్టింది. అరుంధతి ఓవర్లో తొలి రెండు బంతులను బౌండరీ దాటించిన డెవిన్‌ తర్వాతి బంతికి వెనుదిరిగింది. తర్వాతి ఓవర్లోనే సాటర్‌వైట్‌ను దీప్తి ఔట్‌ చేసింది. పూనమ్‌ వేసిన ఆఖరి ఓవర్లో మార్టిన్‌ రెండు సిక్సర్లు బాదడంతో కివీస్‌ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది.  

టపటపా... 
వన్డేల్లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచిన స్మృతి అదే ఫామ్‌ను టి20ల్లోనూ కొనసాగించింది. అయితే కెరీర్‌ లో తొలి మ్యాచ్‌ ఆడిన మరో ఓపెనర్‌ ప్రియా పూనియా (4) మొదటి ఓవర్లోనే వెనుదిరిగింది. ఆ తర్వాత స్మృతి, జెమీమా కలిసి అలవోకగా పరుగులు సాధించారు. రోజ్‌మేరీ వేసిన ఆరో ఓవర్లో స్మృతి 2 సిక్సర్లు, ఫోర్‌ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. కాస్పరెక్‌ వేసిన తర్వాతి ఓవర్లో జెమీమా వరుసగా 3 ఫోర్లు కొట్టింది. డెవిన్‌ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో స్మృతి రికార్డు అర్ధసెంచరీ నమోదైంది. వీరిద్దరు జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్న తరుణంలో ఒక్కసారిగా మ్యాచ్‌ మలుపు తిరిగింది. కెర్‌ బౌలింగ్‌లో డీప్‌ ఎక్స్‌ట్రా కవర్‌లో రోవ్‌ అద్భుత క్యాచ్‌ పట్టడంతో స్మృతి ఇన్నింగ్స్‌ ముగిసింది. మరో నాలుగు బంతులకే జెమీమాను తహుహు ఔట్‌ చేసింది. ఆమె తర్వాతి ఓవర్లో భారత్‌ 2 వికెట్లు కోల్పోయింది. గెలుపు కోసం 17 బంతుల్లో 37 పరుగులు చేయాల్సిన స్థితిలో భారీ సిక్సర్‌ కొట్టిన హర్మన్‌...తర్వాతి బంతికే ఔటవ్వడంతో భారత్‌ ఆశలు కోల్పోయింది.  

మిథాలీకి చోటు లేదు... 
ఊహించినట్లుగానే తుది జట్టులో వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు అవకాశం దక్కలేదు. వరల్డ్‌ కప్‌ సెమీస్‌ వివాదం తర్వాత ఆమె టి20 టీమ్‌లో కొనసాగినా... పొట్టి ఫార్మాట్‌ నుంచి మిథాలీ రిటైర్మెంట్‌పై వార్తలు వస్తున్న నేపథ్యంలో మ్యాచ్‌లో ఆడించడం సందేహంగానే కనిపించింది. చివరకు అదే జరిగింది. కొత్త అమ్మాయిలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మిథాలీని ఆడించలేదని ఈసారి కెప్టెన్‌ హర్మన్‌ ముక్తసరి సమాధానంతో ముగించింది.

నాతో పాటు జెమీమా కూడా వెంట వెంటనే ఔట్‌ కావడం ఫలితాన్ని మార్చింది. ఇలా జరిగినప్పుడు కోలుకోవడం చాలా కష్టం. ఈ రోజు మా ప్రణాళిక ఫలించలేదు. వచ్చే సారి మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది. మేం మ్యాచ్‌ గెలవాలంటే నేను 20వ ఓవర్‌ వరకు కూడా బ్యాటింగ్‌ చేయాలి. మిడిలార్డర్‌ కుప్పకూలిపోకుండా ఉండాలంటే అదొక్కటే సరైన మార్గం. కనీసం 18వ ఓవర్‌ వరకైనా క్రీజ్‌లో ఉంటే మిగతా వారికి సమస్య ఉండదు. తర్వాతి మ్యాచ్‌లో అలా చేసేందుకు ప్రయత్నిస్తాను. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. నిజానికి మేం లక్ష్యాన్ని ఛేదించాల్సింది.  
–స్మృతి మంధాన, భారత వైస్‌ కెప్టెన్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement