సిడ్నీ: మహిళల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో తలపడే జట్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌ను భారత్... రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ స్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ‘ఢీ’కొంటాయి. ఈ రెండు మ్యాచ్‌లు కూడా ఒకే రోజు (గురువారం) జరుగుతాయి. వర్షం కారణంగా గ్రూప్ ‘బి’లో భాగంగా మంగళవారం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కూడా ఫలితం రాలేదు. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా రద్దు కావడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దాంతో మొత్తం 7 పాయింట్లతో దక్షిణాఫ్రికా గ్రూప్ ‘బి’ టాపర్‌గా నిలిచింది. రెండో స్థానం సాధించిన ఇంగ్లండ్ జట్టు హర్మన్‌ప్రీత్ సేనతో సవాల్‌కు సన్నద్ధమైంది. మరోవైపు ఇదే గ్రూప్‌లో పాకిస్తాన్, థాయ్‌లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా రద్దయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షంతో పాకిస్తాన్‌కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు.
ఎలీస్ పెర్రీ అవుట్...: కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ క్రీడాకారిణి ఎలీస్ పెర్రీ కండరాల గాయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ అయిన ఎలీస్ లేకపోవడం ఆ జట్టు అవకాశాలను ప్రభావితం చేయవచ్చు. 2009లో మహిళల టి20 ప్రపంచ కప్ ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 36 మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలోనూ పెర్రీ భాగం కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment