
దంబుల్లా: సమష్టి ఆటతీరుతో రాణించిన భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు సాధించింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే (45; 6 ఫోర్లు), చమరి ఆటపట్టు (43; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 13.5 ఓవర్లలో 87 పరుగులు జోడించారు. పూజా వస్త్రకర్ బౌలింగ్‌లో ఆటపట్టు అవుటయ్యాక లంక పతనం మొదలైంది. చివరి ఆరు ఓవర్లలో లంక 38 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది.
భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రేణుక సింగ్, రాధా యాదవ్, పూజా వస్త్రకర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసి గెలిచింది. స్మృతి మంధాన (34 బంతుల్లో 39; 8 ఫోర్లు), షఫాలీ వర్మ (10 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్), సబ్బినేని మేఘన (10 బంతుల్లో 17; 4 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్మన్‌ప్రీత్ కౌర్ (32 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు) చివరిదాకా నిలిచి భారత్‌ను విజయతీరానికి చేర్చింది. చివరిదైన మూడో టి20 సోమవారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment