ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్-2025లో భారత్ రెండో విజయం సాధించింది. మలేసియాతో ఇవాళ (జనవరి 21) జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మలేసియాను భారత బౌలర్లు 31 పరుగులకే (14.3 ఓవర్లలో) కుప్పకూల్చారు.
భారత స్పిన్నర్ వైష్ణవి శర్మ హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లతో (4-1-5-5) చెలరేగింది. మరో స్పిన్నర్ ఆయుషి శుక్లా (3.3-1-8-3) మూడు వికెట్లు తీసింది. వీజే జోషిత్ (2-1-5-1) ఓ వికెట్ పడగొట్టింది.
మలేసియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో లభించిన 11 పరుగులే ఆ జట్టు తరఫున అత్యధికం. నలుగురు బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు 5 పరుగులు, ఇద్దరు 3 పరుగులు, ఒకరు 2, ఇద్దరు ఒక్క పరుగు చేశారు.
అనంతరం అతి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 17 బంతుల్లోనే ఆట ముగించేసింది. ఓపెనర్లు గొంగడి త్రిష, జి కమలిని కళ్లు మూసి తెరిచే లోగా ఖేల్ ఖతం చేశారు. త్రిష పూనకాలు వచ్చినట్లు ఊగిపోయి 12 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 27 పరుగులు చేసింది. కమలిని 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసింది.
ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో తిరుగులేని రన్‌రేట్‌తో (+9.148) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. గ్రూప్-ఏలో భారత్ సహా శ్రీలంక (2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో రెండో స్థానం), వెస్టిండీస్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో మూడో స్థానం), మలేసియా (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలతో నాలుగో స్థానం) జట్లు ఉన్నాయి.
కాగా, భారత్ తమ తొలి గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనూ భారత బౌలర్లు చెలరేగి వెస్టిండీస్‌ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం టీమిండియా వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ప్రత్యర్థి నిర్ధేశించిన 45 పరుగుల లక్ష్యాన్ని భారత్ 4.2 ఓవర్లలనే ఛేదించింది.
గొంగడి త్రిష 4 పరుగులకే ఔటైనా.. కమలిని (16 నాటౌట్), సనికా ఛల్కే (18 నాటౌట్) భారత్‌ను గెలుపు తీరాలు దాటించారు. అంతకుముందు భారత బౌలర్లు పరుణిక సిసోడియా (2.2-0-7-3), ఆయూషి శుక్లా (4-1-6-2), వీజే జోషిత్ (2-0-5-2) విజృంభించడంతో వెస్టిండీస్ 44 పరుగులకే ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment