2024 ఏడాదిని ముగించిన భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు
మలేసియాతో స్నేహపూర్వక అంతర్జాతీయ మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించిన టీమిండియా
తర్వాతి అంతర్జాతీయ మ్యాచ్ వచ్చే మార్చిలో
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ జట్టు 2024ను ఒక్క విజయం లేకుండా ముగించింది. ఏడాదిలో చివరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శనే కనబర్చినా చివరకు గెలుపు మాత్రం దక్కలేదు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో సోమవారం భారత్, మలేసియా జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) స్నేహపూర్వక అంతర్జాతీయ మ్యాచ్ 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగిసింది.
మలేసియా తరఫున పావ్లో జోస్ 19వ నిమిషంలో గోల్ సాధించగా... భారత్ తరఫున రాహుల్ భేకే 39వ నిమిషంలో హెడర్ ద్వారా గోల్ కొట్టాడు. రెండో అర్ధభాగంలో గోల్ చేయడంలో ఇరు జట్లు విఫలమయ్యాయి. ఈ ఏడాది మొత్తం 11 మ్యాచ్‌లు ఆడిన మన జట్టు 6 పరాజయాలు, 5 ‘డ్రా’లు సాధించింది.
భారత ఫుట్‌బాల్ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పెయిన్‌కు చెందిన మనోలో మార్కెజ్‌కు తొలి విజయం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. భారత్ తమ తర్వాతి అంతర్జాతీయ మ్యాచ్ 2027 ఆసియా కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా వచ్చే ఏడాది మార్చిలో ఆడుతుంది.
జోరుగా ఆరంభం...
ఆరంభంలో భారత్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించింది. తొలి 15 నిమిషాల పాటు బంతిని తమ ఆ«దీనంలోనే ఉంచుకున్న జట్టు కొన్ని సార్లు గోల్‌పోస్ట్‌కు చేరువగా వెళ్లగలిగినా... ఆశించిన ఫలితం దక్కలేదు. ఆరో నిమిషంలో రోషన్, చంగ్లే అందించిన పాస్‌తో ముందుకు దూసుకెళ్లిన లాలెంగ్‌మవియా కొట్టిన షాట్ క్రాస్ బార్ మీదుగా దూసుకెళ్లింది.
అయితే భారత కీపర్ గుర్‌ప్రీత్‌సింగ్ సంధూ చేసిన తప్పు ప్రత్యరి్థకి ఆధిక్యాన్ని అందించింది. భారత బ్యాక్‌లైన్ వద్ద మలేసియాను అడ్డుకునే ప్రయత్నంలో సంధూ తన పోస్ట్ వదిలి ముందుకొచ్చాడు. వెంటనే చక్కగా బంతిని అందుకున్న పావ్లో జోస్ ఖాళీ నెట్‌పైకి కొట్టడంతో మలేసియా ఖాతాలో తొలి గోల్ చేరింది. తర్వాత కొద్ది సేపటికే ఫౌల్ చేయడంతో రాహుల్ భేకే ఎల్లో కార్డ్‌కు గురయ్యాడు.
28వ నిమిషంలో రోషన్ ఇచ్చిన కార్నర్ క్రాస్‌ను అందుకోవడానికి ఎవరూ లేకపోవడంతో భారత్‌కు మంచి అవకాశం చేజారింది. ఈ దశలో కొద్దిసేపు ఇరు జట్లూ హోరాహోరీ గా పోరాడాయి. చివరకు భారత్ ఫలితం సాధిం చింది. బ్రండన్ ఇచ్చిన కార్నర్ పాస్‌ను బాక్స్ వద్ద ఉన్న భేకే నెట్‌లోకి పంపడంతో స్కోరు సమమైంది.
హోరాహోరీ పోరాడినా...
రెండో అర్ధభాగంలో ఇరు జట్లు పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమించాయి. అయితే తమకు లభించిన అవకాశాలను సది్వనియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయి. తొలి అర్ధభాగంతో పోలిస్తే ఈసారి భారత డిఫెన్స్ మెరుగ్గా కనిపించింది. 47వ నిమిషంలో బాక్స్ వద్ద అగ్వెరో కిక్‌ను సందేశ్ జింగాన్ సమర్థంగా అడ్డుకోగా... 53వ నిమిషంలో కార్నర్ ద్వారా భారత ప్లేయర్ బ్రండన్ చేసిన గోల్ ప్రయత్నం వృథా అయింది.
మరో ఏడు నిమిషాల తర్వాత వచ్చిన అవకాశాన్ని ఫరూఖ్ వృథా చేశాడు. చివరి ఐదు నిమిషాల ఇంజ్యూరీ టైమ్‌లో కొన్ని ఉత్కంఠ క్షణాలు సాగాయి. సుమారు 15 వేల మంది ప్రేక్షకులు మద్దతు ఇస్తుండగా భారత్ పదే పదే మలేసియా పోస్ట్‌పైకి దూసుకెళ్లినా గోల్ మాత్రం దక్కలేదు. మరోవైపు భారత కీపర్ సంధూ కూడా ప్రత్యర్థి ఆటగాళ్ళను సమర్థంగా నిలువరించగలిగాడు.
Comments
Please login to add a commentAdd a comment