ఈ విషయంపై భారత ఫుట్‌బాల్ సమాఖ్య, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి
ఇతర దేశాల్లో ఈ నిబంధన అమలులో ఉంది
భారత జట్టు గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధు మనోగతం
ఈనెల 18న మలేసియాతో ఫ్రెండ్లీ మ్యాచ్‌కు టీమిండియా సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: ఇతర దేశాల్లో మాదిరిగా భారత్‌లో కూడా విదేశీ ప్లేయర్లను జాతీయ జట్టు తరఫున ఆడించే నిబంధనలను అమల్లోకి తెస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని భారత ఫుట్‌బాల్ జట్టు గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డాడు. చాలా దేశాల్లో విదేశీ క్రీడాకారులు నిర్దిష్ట సమయంపాటు నివసిస్తే వాళ్లకు ఆ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇచ్చే నిబంధన అమల్లో ఉంది. అయితే భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదు.
ఈ నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వం, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ఆ దిశగా ఆలోచన చేయడం మంచిదని గుర్‌ప్రీత్ సూచించాడు. దాని కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకువస్తే మంచిదని సూచనాప్రాయంగా అన్నాడు. ఇలా విదేశీ ప్లేయర్లు జాతీయ జట్టు తరఫున ఆడితే... మన ప్లేయర్లకు కూడా చాలా ఉపయుక్తకరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఏఎఫ్‌సీ ఆసియా కప్‌నకు అర్హత సాధించడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమన్న గుర్‌ప్రీత్... కొత్త కోచ్ మానొలో సారథ్యంలో జట్టు మంచి విజయాలు సాధించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు.
వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీకి ముందు భారత్ చివరి అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఈ నెల 18న హైదరాబాద్ వేదికగా మలేసియాతో తలపడుతుంది. మలేసియా జట్టులో పలువురు విదేశీ ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో గుర్‌ప్రీత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది.
ఈ నేపథ్యంలో బుధవారం గుర్‌ప్రీత్ ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ... ‘గతం గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. జరిగిందేదో జరిగింది. ప్రతీసారి గెలవాలనే లక్ష్యంతోనే మైదానంలో అడుగు పెడతాం. కొన్నిసార్లు అది సాధ్యం కాదు. మలేసియాతో పోరు కోసం బాగా సన్నద్ధమవుతున్నాం. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు మాకు ఇదే చివరి మ్యాచ్. మలేసియా జట్టులో విదేశాలకు చెందిన 14 మంది ప్లేయర్లు ఉన్నారు.
స్పెయిన్‌కు చెందిన మారాలెస్, బ్రెజిల్‌కు చెందిన ఎన్‌డ్రిక్ డాస్, సాన్‌టోస్ వంటి పలువురు ఆటగాళ్లు మలేసియా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నిబంధన వల్ల వాళ్లకు అదనపు ప్రయోజనం చేకూరడం ఖాయం. మనం కూడా ఆ దిశగా ఆలోచిస్తే మంచిది. శ్రీలంక జట్టు కూడా ఇలా విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఇస్తోంది’ అని అన్నాడు. భారత్‌లో మాత్రం అలాంటి అవకాశం లేదు. ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు కల్యాణ్ చౌబే గతంలో విదేశాల్లోస్థిరపడిన భారత సంతతి ఆటగాళ్లను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేసినా... అది కార్యరూపం దాల్చలేదు.
Comments
Please login to add a commentAdd a comment