సిల్హెట్: ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న జెమీమా రోడ్రిగ్స్ (53 బంతుల్లో 76; 11 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి చెలరేగడంతో ఆసియా కప్ మహిళల టి20 టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తమ తొలి లీగ్ పోరులో భారత్ 41 పరుగులతో శ్రీలంకపై జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (6), షఫాలీ వర్మ (10) జట్టు స్కోరు 23 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్)తో జతకట్టిన జెమీమా భారత్ స్కోరును మెరుపు వేగంతో నడిపించింది.
ఇద్దరు కలిసి దాదాపు 13 ఓవర్లపాటు క్రీజులో నిలవడంతో లంక బౌలర్లకు కష్టాలు తప్పలేదు. మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జెమీమా 38 బంతుల్లోనే (7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. నిజానికి భారత్ స్కోరు మరింత పెరగాలి. అయితే డెత్ ఓవర్లలో జెమీమాతో పాటు రిచా ఘోష్ (9), పూజ (1) విఫలమవడంతో ఆశించినన్ని పరుగులు రాలే దు. అనంతరం శ్రీలంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు హేమలత (3/15), పూజ (2/12), దీప్తి శర్మ (2/15) లంకను దెబ్బ తీశారు. హర్షిత (26; 5 ఫోర్లు), హాసిని పెరీరా (30; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 9 వికెట్లతో థాయ్‌లాండ్‌పై గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment