వుమెన్స్ ఆసియా కప్-2024లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను పది వికెట్ల తేడాతో చిత్తు చేసి సెమీస్ రేసులో ముందడుగు వేసింది. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ఆసియా టోర్నీలో పాక్ తొలుత భారత్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన చేతిలో.. నిదా దర్ బృందం ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించి గెలుపు బాటపట్టింది. తాజాగా యూఏఈని పది వికెట్లు తేడాతో ఓడించింది. డంబుల్లా వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ పాక్ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 103 పరుగులే చేసింది. పాక్ స్పిన్నర్లు నష్రా సంధు, సైదా ఇక్బాల్, తూబా హసన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. నిదా దర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.
ఇక యూఏఈ విధించిన 104 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు గుల్ ఫెరోజా(55 బంతుల్లో 62), మునీబా అలీ (30 బంతుల్లో 37) అద్భుత ఆట తీరుతో జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరు కలిసి 14.1 ఓవర్లలో 107 పరుగులు జోడించి పాక్‌ను గెలిపించారు. ఫలితంగా పాక్ మహిళా జట్టు ఆసియా కప్-2024 సెమీ ఫైనల్ రేసులోకి దూసుకువచ్చింది.
కాగా ఆసియా కప్-2024లో ఇండియా, పాకిస్తాన్, నేపాల్, యూఏఈ జట్లు గ్రూప్-ఏలో.. శ్రీలంక, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేషియా గ్రూప్-బిలో ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఆడి రెండూ గెలిచి టాపర్(నెట్ రన్‌రేటు +3.298)గా ఉంది.
పాకిస్తాన్ మూడింట రెండు గెలిచి రెండో స్థానం(నెట్ రన్‌రేటు + 1.158)లో కొనసాగుతోంది. ఇక గ్రూప్-బి నుంచి శ్రీలంక, థాయ్‌లాండ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇక గ్రూప్ దశలో పాక్ తమ మూడు మ్యాచ్‌లు ఆడేయగా.. భారత్ మంగళవారం నేపాల్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో ఫలితం తర్వాత సెమీస్ బెర్తులు అధికారికంగా ఖరారవుతాయి.
చదవండి: IPL 2025: మెగా వేలం.. రోహిత్ శర్మపై కన్నేసిన ఆ మూడు జట్లు
Comments
Please login to add a commentAdd a comment