IPL 2025: రోహిత్‌ శర్మ కోసం ఆ జట్ల మధ్య పోటీ! | IPL 2025 Mega Auction: 3 Teams That May Target Rohit Sharma If He Leaves Mumbai Indians In IPL 2025 | Sakshi
Sakshi News home page

IPL 2025: మెగా వేలం.. రోహిత్‌ శర్మపై కన్నేసిన ఆ మూడు జట్లు

Published Tue, Jul 23 2024 4:20 PM | Last Updated on Tue, Jul 23 2024 5:18 PM

IPL 2025 Mega Auction: 3 Teams That MayTarget Rohit Sharma

కెప్టెన్‌గా ఐదు ట్రోఫీలు.. ఓవరాల్‌గా 6628 పరుగులు... ఇందులో రెండు సెంచరీలు.. 43 హాఫ్‌ సెంచరీలు.. 599 ఫోర్లు.. 280 సిక్సర్లు.. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ ట్రాక్‌ రికార్డ్‌ ఇది. దక్కన్‌ చార్జర్స్‌ ద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన ఈ ముంబై బ్యాటర్‌.. తర్వాత ముంబై ఇండియన్స్‌కు మారాడు.

తన అద్భుతమైన ఆట తీరుతో హిట్‌మ్యాన్‌గా ఎదిగి.. భారత జట్టు సారథిగానూ పగ్గాలు చేపట్టాడు. అయితే, గత రెండేళ్లుగా ముంబై ఇండియన్స్‌తో అతడి అనుబంధం బీటలు వారిందనే వార్తలు వచ్చాయి. గతేడాది రోహిత్‌ను కెప్టెన్‌గా తొలగించి.. అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించడంతో వీటికి బలం చేకూరింది.

ఈ క్రమంలో వచ్చే ఏడాది రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో.. ఈ టీ20 వరల్డ్‌ప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ను దక్కంచుకునేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడటం ఖాయం.

ముఖ్యంగా మూడు జట్లు ఇప్పటి నుంచే రోహిత్‌పై కన్నేసినట్లు ఐపీఎల్‌ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆ జట్టు ఏవి? వాటికి రోహిత్‌ అవసరం ఎంత?!

లక్నో సూపర్‌ జెయింట్స్‌
అరంగేట్ర సీజన్‌ 2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరి సత్తా చాటింది. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలోని ఈ జట్టు 2023లోనూ మూడో స్థానంలో నిలిచింది. అయితే, ఈ ఏడాది మాత్రం దారుణంగా విఫలమైంది.

పద్నాలుగింట కేవలం ఏడు మ్యాచ్‌లు గెలిచి.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ, కెప్టెన్‌ రాహుల్‌ మధ్య విభేదాలు తలెత్తాయని.. రాహుల్‌ ఆర్సీబీ వైపు చూస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

ఒవకేళ అదే జరిగితే లక్నో కెప్టెన్‌తో పాటు.. ఓపెనర్‌నూ కోల్పోతుంది. ఆ స్థానాన్ని భర్తీ చేయగల బెస్ట్‌ ఆప్షన్‌ రోహిత్‌ శర్మనే అవుతాడు మరి!

ఢిల్లీ క్యాపిటల్స్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం జట్టును ప్రక్షాళన చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హెడ్‌ కోచ్‌గా రిక్కీ పాంటింగ్‌ను తొలగించింది. అంతేకాదు కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను కూడా రిలీజ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో పంత్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌లో చేరబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఒకవేళ పంత్‌ గనుక ఢిల్లీని వీడితే.. ఆ ఫ్రాంఛైజీ రోహిత్‌ శర్మ వైపే చూస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని ఢిల్లీకి రోహిత్‌ వస్తే బహుశా ఆ లోటు తీరొచ్చేమో!

పంజాబ్‌ కింగ్స్‌
ఐపీఎల్‌లో ఇంత వరకు ట్రోఫీని ముద్దాడని మరో జట్టు పంజాబ్‌ కింగ్స్‌. పవర్‌ హిట్టర్లు ఉన్నా .. ఆఖరి నిమిషంలో అవకాశాలు చేజార్చుకోవడం ఆ జట్టుకు అలవాటే.

దీనికి ప్రధాన కారణం సరైన నాయకుడు లేకపోవడమే అని చెప్పవచ్చు. కెప్టెన్ల విషయంలో ఇక్కడ నిలకడే లేదు. ఈ ఏడాది కూడా ఇద్దరు సారథ్యం వహించారు.

శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా దూరం కాగా.. ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కర్రన్‌ కెప్టెన్సీ చేపట్టాడు. అయితే, ఆరంభంలో బాగానే రాణించినా పంజాబ్‌ జట్టు.. తమ పాత కథను పునరావృతం చేస్తూ.. ఏడు విజయాలతో ఆరో స్థానానికే పరిమితమైంది.

ఫలితంగా శిఖర్‌ ధావన్‌తో పాటు ఖరీదైన ఆటగాడైన సామ్‌ కర్రన్‌ను కూడా వదిలించుకోవాలని పంజాబ్‌ ఫ్రాంఛైజీ ఫిక్సైనట్లు వినికిడి. ఒకవేళ రోహిత్‌ శర్మను దక్కించుకుంటే వారికి అంతకంటే మంచి కెప్టెన్‌ దొరకడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
చదవండి: 'బుమ్రా, బ్రెట్‌లీ కాదు.. క్రికెట్ చ‌రిత్ర‌లో అత‌డిదే బెస్ట్ యార్క‌ర్‌'

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement