ప్రస్తుత వరల్డ్ క్రికెట్‌లో యార్కర్ల కింగ్ ఎవరంటే అందరికి టక్కున గుర్తు వచ్చేది టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రానే. రెప్పపాటులో తన యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించడం బుమ్రా స్పెషల్. చాలా మంది దిగ్గజ క్రికెటర్లు సైతం ఇప్పటివరకు బుమ్రాలా యార్కర్ల వేసే బౌలర్‌ను చూడలేదని కితాబు ఇచ్చారు.
కానీ దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టేయిన్ దృష్టిలో బెస్ట్ యార్కర్ల వేసే బౌలర్ బుమ్రా కాదట. తాజాగా ఐస్‌లాండ్ క్రికెట్ వరల్డ్ క్రికెట్ హిస్టరీలో బెస్ట్ యార్కర్ వేసిన బౌలర్ ఎవరు? అన్న ప్రశ్నను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అందుకు బదులుగా డేల్ స్టేయిన్.. 1999 వరల్డ్‌కప్‌లో షోయబ్ అక్తర్ వేసిన యార్కర్ తన బెస్ట్ అంటూ సమధానమిచ్చాడు. అయితే స్టేయిన్ బుమ్రాను గానీ, ఆసీస్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్‌లీని గానీ ఎంచుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక స్టెయిన్ విషయానికి వస్తే.. తన కెరీర్‌లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20 మ్యాచులు ఆడిన ఈ సఫారీ పేస్‌గన్ మూడు ఫార్మాట్లలో కలిపి 699 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటికి స్టెయిన్ పేరిటే ఉంది.
అంతేకాకుండా 2008 నుంచి 2014 వరకు ఏకంగా 263 వారాల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెం1 బౌలర్ గా స్టెయిన్ కొనసాగాడు. 2008లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఈ సఫారీ దిగ్గజం నిలిచాడు. అదే విధంగా 2013లో విజ్డన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత బౌలింగ్ కోచ్‌గా, కామెంటేటర్‌గా కొనసాగతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment