Asia Cup 2022: లంకకు ఎదురుందా! | Asia Cup 2022: Sri Lanka vs Pakistan finals on 11 aug 2022 | Sakshi
Sakshi News home page

Asia Cup 2022: లంకకు ఎదురుందా!

Published Sun, Sep 11 2022 6:23 AM | Last Updated on Sun, Sep 11 2022 6:23 AM

Asia Cup 2022: Sri Lanka vs Pakistan finals on 11 aug 2022 - Sakshi

దుబాయ్‌: ఆసియా కప్‌ టి20 క్రికెట్‌ టోర్నీలో ‘అండర్‌ డాగ్‌’గా బరిలోకి దిగి అదరగొట్టిన శ్రీలంక ఇప్పుడు టైటిల్‌పైనే కన్నేసింది. ‘సూపర్‌–4’లో అజేయంగా నిలిచిన సింహళ జట్టు ఇప్పుడు ఫైనల్లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సూపర్‌–4లో తడబడుతూ తుదిపోరుకు చేరిన పాకిస్తాన్‌తో నేడు అమీతుమీ తేల్చుకోనుంది. భారత్‌తో బాగా ఆడిన పాకిస్తాన్‌ తర్వాత క్రికెట్‌ కూన అఫ్గానిస్తాన్‌తో చచ్చిచెడీ చివరి ఓవర్లో ఆఖరి వికెట్‌తో గట్టెక్కింది.

గత మ్యాచ్‌లో ఎదురుపడిన శ్రీలంకతో తేలిపోయింది. ఐదో వరుస బ్యాటర్స్‌ దాకా ఒక్క కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ మినహా ఇంకెవ రూ 14 పరుగులైనా చేయలేకపోవడం జట్టు బ్యా టింగ్‌ వైఫల్యాన్ని చూపిస్తోంది. మిడిలార్డర్‌ కూడా లంక బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయింది. 20 ఓవర్ల కోటా కూడా పూర్తిగా ఆడలేక 121 పరుగులకే ఆలౌ ట్‌ అవడం పాక్‌ నిలకడలేమికి అద్దం పడుతోంది.  

దుర్భేద్యంగా షనక బృందం
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న భారత్, రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్‌ కంటే 8వ ర్యాంకులో ఉన్న లంక జట్టే ఈ టోర్నీలో అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు నిసాంక, కుశాల్‌లతో పాటు భానుక రాజపక్స బ్యాట్‌తో చెలరేగుతున్నారు. డెత్‌ ఓవర్లలో కెప్టెన్‌ షనక, హసరంగ కూడా రాణిస్తుండటం, బౌలింగ్‌లో తీక్షణ, మదుశంక స్థిరంగా వికెట్లు తీయడం జట్టును ఎదురులేని జట్టుగా మార్చింది. గతమ్యాచ్‌లో హసరంగ తన స్పిన్‌ ఉచ్చులో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ నేపథ్యంలో ఏరకంగా చూసిన లంకను ఆపడం పాక్‌కు కష్టమే!

జట్లు (అంచనా)
శ్రీలంక: షనక (కెప్టెన్‌), నిసాంక, కుశాల్, దనుష్క గుణతిలక, ధనంజయ, కరుణరత్నే, భానుక రాజపక్స, హసరంగ, తీక్షణ, మదుశంక, మదుషన్‌.

పాకిస్తాన్‌: బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), రిజ్వాన్, ఫఖర్, ఇఫ్తికార్, ఖుష్‌దిల్, షాదాబ్, నవాజ్, ఆసిఫ్‌ అలీ, హారిస్‌ రవూఫ్, హస్‌నైన్, నసీమ్‌ షా.

► పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు 22 టి20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్, 9 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి.

► ఇప్పటివరకు ఆసియా కప్‌ టోర్నీ 14 సార్లు జరిగింది. శ్రీలంక ఐదు సార్లు... పాకిస్తాన్‌ రెండుసార్లు చాంపియన్‌గా నిలిచాయి. భారత్‌ ఏడుసార్లు విజేతగా నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement