క్రికెట్ ప్రపంచంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే!.. దాయాదులు పరస్పరం నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ పడుతుంటే.. ఇరు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులంతా మ్యాచ్‌కే అతుక్కుపోతారు. ఇరు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా భారత్- పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో నిలిచిపోయిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కేవలం ఆసియా కప్, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థులు పోటీపడుతున్నాయి. భారత్- పాకిస్తాన్ చివరగా గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా న్యూయార్క్‌లో ముఖాముఖి తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన బాబర్ ఆజం బృందాన్ని ఓడించడమే కాకుండా.. లీగ్ దశ ఆసాంతం దుమ్ములేపడంతో పాటు చాంపియన్‌గా నిలిచింది.
ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) సందర్భంగా మరోసారి దాయాదుల సమరం జరుగనుంది. ఈ ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ సంపాదించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం అక్కడకు వెళ్లడం లేదు.
తటస్థ వేదికైన యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో రోహిత్ సేన తమ మ్యాచ్‌లు ఆడనుంది. ఫిబ్రవరి 19న ఈ వన్డే ఫార్మాట్ టోర్నీ మొదలుకానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
అనంతరం.. ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇందుకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్ సేల్ ద్వారా టికెట్లు అందుబాటులో లేవు.
ఇందుకోసం ముందుగా ఐసీసీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. అప్పుడే టికెట్లు ఎప్పుడు, ఎక్కడ అందుబాటులోకి వస్తాయన్న విషయం ఐసీసీ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు.
ఆ ప్రక్రియ ఎలా ఉంటుందంటే..
తొలుత ఐసీసీ అధికారిక రిజిస్ట్రేషన్ పేజీలోకి వెళ్లి.. ఈ కింది వివరాలు పూర్తి చేయాలి.
👉పూర్తి పేరు:
👉ఈ-మెయిల్ అడ్రస్:
👉ఫోన్ నంబర్:
👉పుట్టిన తేది:
👉ఏ దేశంలో నివాసం ఉంటున్నారు:
👉ఏ జట్టుకు మీ మొదటి ప్రాధాన్యం:
👉షరతులకు అంగీకరిస్తున్నారా?!:
👉అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయనుకుంటే.. సబ్‌మిట్ చేయండి.
ధరల సంగతేంటి?
ఇక జనవరి 16, 2025 నాటికి ఎక్స్‌ఛేంజ్‌టికెట్స్(xchangetickets) వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. భారత్- పాక్ మ్యాచ్‌ల టికెట్ల రేట్లు చుక్కల్ని తాకుతున్నాయి.
👉జనరల్ స్టాండ్- 2386.00 AED(అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్- భారత కరెన్సీలో దాదాపు రూ. 56,170)
👉ప్రీమియమ్ టికెట్ల ధర- 5032 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 1,18, 461)
👉గ్రాండ్ లాంజ్- 12240 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 2,88,150)
👉ప్లాటినమ్ టికెట్ల ధర- 17680 AED(భారత కరెన్సీలో దాదాపు రూ. 2,24, 116).
పాక్‌లో టికెట్ల ధరలు ఇలా
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 లీగ్ దశ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇక కరాచీ, లాహోర్, రావల్పిండిలో జనరల్ ఎన్‌క్లోజర్ టికెట్ల ధర 1000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో కేవలం రూ. 310). ఇక పాకిస్తాన్‌లో అత్యధిక ప్రీమియమ్ సీటింగ్ టికెట్ల ధర(లాహోర్ సెమీ ఫైనల్ మ్యాచ్)- 25,000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో దాదాపు రూ. 7764).
మరోవైపు.. వీవీఐపీ టికెట్ల ధర 12,000 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో దాదాపు రూ. 3726). అయితే, రావల్పిండిలో పాకిస్తాన్- బంగ్లాదేశ్ జనరల్ ఎన్‌క్లోజర్ టికెట్ రేట్లను మాత్రం 2500 పాకిస్తానీ రూపీస్(భారత కరెన్సీలో రూ. 776)కు పెంచినట్లు సమాచారం.
చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే
Comments
Please login to add a commentAdd a comment