ప్రావిడెన్స్ (గయానా): బ్యాటింగ్‌లో తిలక్‌వర్మ (41 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) ప్రతాపం చూపినా, బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా (3/35) నిప్పులు చెరిగినా, చహల్ (2/19) స్పిన్‌తో తిప్పినా... భారత్‌కు పరాజయం తప్పలేదు. ఆదివారం రెండో టి20లో విండీస్ 2 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 2–0తో ఆధిక్యాన్ని పెంచుకుంది. టాస్ గెలిచిన భారత్ ముందుగా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ కెరీర్‌లో తొలి అర్ధసెంచరీ సాధించాడు. అకిల్ హోసీన్, అల్జారి జోసెఫ్, షెఫర్డ్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్ 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే పాండ్యా ప్రత్యర్థిని దెబ్బ తీసినా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (40 బంతుల్లో 67; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) గెలుపుబాట వేశాడు. రేపు మూడో టి20 కూడా ఇదే వేదికపై జరుగుతుంది.
తిలక్ ఫిఫ్టీతో...
అరంగేట్రం చేసిన తొలి టి20లోనే ఆకట్టుకున్న హైదరాబాద్ యువ సంచలనం ఠాకూర్ తిలక్‌వర్మ ఈ రెండో మ్యాచ్‌లో అయితే భారత జట్టును ఆదుకున్నాడు. 18 పరుగులకే భారత్ కీలకమైన శుబ్‌మన్ గిల్ (7), సూర్యకుమార్ (1) వికెట్లను కోల్పోగా, కాసేపటికే ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ సామ్సన్ (7)లు వికెట్లను పారేసుకున్నాడు. ఈ దశలో తిలక్ తనశైలి స్కూప్, స్వీప్ షాట్లతో మైదానంతా ఫీల్డర్లను పరుగు పెట్టించాడు.
కెప్టెన్ పాండ్యాతో కలిసి స్కోరుబోర్డులో వేగం పెంచిన వర్మ 39 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. అతనితో పాటు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 24; 2 సిక్సర్లు) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో డెత్ ఓవర్లలో దంచికొట్టే బ్యాటరే కరువయ్యాడు. భారీషాట్లు బాదే అక్షర్ (14) ఆట కూడా ఎంతోసేపు నిలువలేదు. దీంతో భారత్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
పూరన్ ధనాధన్
లక్ష్యఛేదన మొదలు పెట్టగానే పాండ్యా వికెట్ల భరతం పట్టడంతో తొలి ఓవర్లోనే కింగ్ (0), చార్లెస్ (2) వికెట్లను కోల్పోయిన విండీస్ కష్టాలపాలైంది. మేయర్స్ (15)ను అర్ష్ దీప్ అవుట్ చేయడంతో భారత శిబిరంలో ఎక్కడలేని ఉత్సాహం కానీ... తర్వాత పూరన్ ఉత్పాతంలా వచ్చిపడ్డాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో బంతుల అంతరాన్ని అమాంతం తగ్గించేశాడు. 126/4 స్కోరు వద్ద గెలుపుబాటలో కనిపించింది. కానీ ఆ స్కోరువద్దే పూరన్ జోరుకు ముకేశ్ కళ్లెం వేశాడు.
ఈ దశలో చహల్ స్పిన్ మ్యాజిక్‌తో హెట్‌మైర్ (22 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్), హోల్డర్ (0)లను అవుట్ చేశాడు. 3 పరుగుల వ్యవధిలో 4 వికెట్లను కోల్పోవడంతో మ్యాచ్ ఫలితం భారత్‌వైపు మలుపు తిరిగేలా కనిపించింది. కానీ హోసీన్ (16 నాటౌట్; 2 ఫోర్లు), జోసెఫ్ (10 నాటౌట్; 1 సిక్స్) తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 26 పరుగులు జోడించి టీమిండియాకు గెలుపు అవకాశమివ్వకుండా ఇంకా 7 బంతులు మిగిలుండగానే విండీస్‌ను విజయతీరానికి చేర్చారు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (బి) షెఫర్డ్ 27; గిల్ (సి) హెట్‌మైర్ (బి) జోసెఫ్ 7; సూర్యకుమార్ (రనౌట్) 1; తిలక్ వర్మ (సి) మెకాయ్ (బి) హోసీన్ 51; సంజూ సామ్సన్ (స్టంప్డ్) పూరన్ (బి) హోసీన్ 7; పాండ్యా (బి) జోసెఫ్ 24; అక్షర్ (సి) పూరన్ (బి) షెఫర్డ్ 14; రవి బిష్ణోయ్ (నాటౌట్) 8; అర్ష్ దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152. వికెట్ల పతనం: 1–16, 2–18, 3–60, 4–76, 5–114, 6–129, 7–139. బౌలింగ్: మెకాయ్ 4–0–25–0, హోసీన్ 4–0–29–2, జోసెఫ్ 4–0–28–2, హోల్డర్ 4–0–29–0, షెఫర్డ్ 3–0–28–2, మేయర్స్ 1–0–12–0.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి) సూర్యకుమార్ (బి) పాండ్యా 0; మేయర్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్ష్ దీప్ 15; చార్లెస్ (సి) తిలక్ వర్మ (బి) పాండ్యా 2; పూరన్ (సి) సామ్సన్ (బి) ముకేశ్ 67; పావెల్ (సి) ముకేశ్ (బి) పాండ్యా 21; హెట్‌మైర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చహల్ 22; షెఫర్డ్ (రనౌట్) 0; హోల్డర్ (స్టంప్డ్) ఇషాన్ (బి) చహల్ 0; హోసీన్ (నాటౌట్) 16; జోసెఫ్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (18.5 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–32, 4–89, 5–126, 6–128, 7–128, 8–129. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 4–0–35–3 అర్ష్ దీప్ 4–0–34–1, ముకేశ్ 3.5–0–35–1, బిష్ణోయ్ 4–0–31–0, చహల్ 3–0–19–12.
Comments
Please login to add a commentAdd a comment