
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్లో తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ భారత్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచింది. 49.3 ఓవర్లలో ఆ జట్టు 264 పరుగులకు ఆలౌటైంది.
ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఛేదనలో భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 8, రోహిత్ శర్మ 28 పరుగులు చేసి ఔటయ్యారు. విరాట్ కోహ్లి (26 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 19 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 93/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 31 ఓవర్లలో 172 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు దక్కింది.
97 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..!
ఈ మ్యాచ్‌లో భారత్ ఆసక్తికర రీతిలో జట్టును సమీకరించింది. కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో (మహ్మద్ షమీ) బరిలోకి దిగింది. 97 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్ ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఇలా ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి.
మొత్తంగా ఐసీసీ వన్డే సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఓ జట్టు ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగడం ఇదే నాలుగో సారి మాత్రమే. తొలి రెండు సందర్భాలు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి రెండు ఎడిషన్లలో (1998, 2000) చోటు చేసుకోవడం విశేషం. 1998 ఎడిషన్ ఫైనల్లో సౌతాఫ్రికా, 2000 ఎడిషన్ సెమీస్‌లో పాకిస్తాన్ జట్లు ఇలానే ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాయి.
మూడో సందర్భం 2011 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో చోటు చేసుకుంది. నాడు శ్రీలంక న్యూజిలాండ్‌పై ఒకే ఒక పేసర్‌ను బరిలోకి దించి విజయం సాధించింది. 14 ఏళ్ల అనంతరం భారత్ తిరిగి ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్‌లో ఒకే ఒక పేసర్‌ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది.
ఐసీసీ ఈవెంట్ల సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగిన జట్లు..
సౌతాఫ్రికా (1998 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్)- వెస్టిండీస్‌పై గెలుపు
పాకిస్తాన్ (2000 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్)- న్యూజిలాండ్ చేతిలో ఓటమి
శ్రీలంక (2011 వన్డే వరల్డ్‌కప్ సెమీస్)- న్యూజిలాండ్‌పై గెలుపు
భారత్ (2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్)
Comments
Please login to add a commentAdd a comment