
టెస్టు, వన్డే సిరీస్ తర్వాత భారత్, వెస్టిండీస్ మధ్య టి20 పోరుకు రంగం సిద్ధమైంది. ఆఖరి వన్డే జరిగిన వేదికపైనే నేడు తొలి పోరు జరగనుంది. రాబోయే రోజుల్లో వరల్డ్ కప్ వరకు పూర్తిగా వన్డేలపైనే భారత్ దృష్టి పెట్టనున్న నేపథ్యంలో టి20 ఫార్మాట్‌లో తమ స్థానం పటిష్టం చేసుకోవాలనుకునే యువ ఆటగాళ్లకు ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కీలకం కానుంది. రోహిత్, కోహ్లిలకు ముందే విశ్రాంతినివ్వడంతో ఈ సిరీస్‌లోనూ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో భారత్ బరిలోకి దిగుతోంది.
తుది జట్టు కూర్పును చూస్తే ప్రధాన బ్యాటర్లుగా ఇషాన్ కిషన్, యశస్వి, గిల్, సామ్సన్, సూర్యకుమార్ బరిలోకి దిగడం ఖాయం. ఇద్దరు ఆల్‌రౌండర్లుగా హార్దిక్, అక్షర్‌లకు కూడా చోటు తప్పనిసరి. అయితే వీరిద్దరు పూర్తి స్థాయి కోటా బౌలింగ్ చేయగలరు కాబట్టి భారత్ నలుగురు రెగ్యులర్ బౌలర్లను ఆడిస్తుందా లేక ముగ్గురు బౌలర్లనే ఆడించి మరో బ్యాటర్‌తో ఆరో స్థానాన్ని భర్తీ చేస్తుందా చూడాలి.
అదే జరిగితే హైదరాబాదీ బ్యాటర్ ఠాకూర్ తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయవచ్చు. బౌలింగ్ దళంలో నలుగురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. మరోవైపు విండీస్ ఈ ఫార్మాట్‌లోనైనా కొంత మెరుగైన ఆటతీరు కనబర్చాలని కోరుకుంటోంది. హెట్‌మైర్, పావెల్, పూరన్, చార్లెస్, మేయర్స్ ఎలాంటి మెరుపు ప్రదర్శన చూపిస్తారనేది ఆసక్తికరం.
Comments
Please login to add a commentAdd a comment