రెండు రోజులుగా కురిసిన వర్షాలతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం... తీరా మ్యాచ్ సమయానికి వరుణుడు కూడా కరుణించడంతో ... నిర్ణీత సమయానికే ఆట ప్రారంభం... ఇక పరుగుల విందు ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తుండగా... పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకున్న ఆసీస్ పేస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, నాథన్ ఎలిస్ నిప్పులు చెరిగే బంతులతో భారత బ్యాటర్లను బెంబేలెత్తించారు.
స్టార్క్ స్వింగ్ బౌలింగ్‌కు భారత స్టార్ బ్యాటర్లు గిల్, రోహిత్, రాహుల్, సూర్యకుమార్ ఇలా వచ్చి అలా వెళ్లారు. దాంతో టీమిండియా 117 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారత బ్యాటర్లు చేతులెత్తేసిన పిచ్‌పై ఆసీస్ ఓపెనర్లు అదరగొట్టి 11 ఓవర్లలోనే తమ జట్టుకు విజయాన్ని అందించారు.
సాక్షి, విశాఖపట్నం: సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది.
టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 26 ఓవర్లలో కేవలం 117 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్ (5/53), సీన్ అబాట్ (3/23), నాథన్ ఎలిస్ (2/13) తమ స్వింగ్ బౌలింగ్‌తో భారత్‌ను దెబ్బ కొట్టారు.
భారత ఇన్నింగ్స్‌లో కోహ్లి (35 బంతుల్లో 31; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌కాగా... రోహిత్ శర్మ (15 బంతుల్లో 13; 2 ఫోర్లు), రవీంద్ర జడేజా (39 బంతుల్లో 16; 1 ఫోర్), అక్షర్ పటేల్ (29 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. అనంతరం ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.
11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు సాధించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 51 నాటౌట్; 10 ఫోర్లు), మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) అలరించారు. స్టార్క్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉండగా... సిరీస్‌లోని చివరిదైన మూడో వన్డే ఈనెల 22న చెన్నైలో జరుగుతుంది.
సూర్యకుమార్ మళ్లీ విఫలం...
బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న విశాఖ పిచ్‌పై భారత బ్యాటర్లు తడబడ్డారు. పిచ్‌పై ఉన్న తేమను ఆసీస్ పేసర్ స్టార్క్ సద్వినియోగం చేసుకున్నాడు. స్వింగ్‌తోపాటు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. స్టార్క్ బౌలింగ్‌లో గిల్, రోహిత్ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతులను ఆడి అవుటయ్యారు.
సూర్యకుమార్ యాదవ్ వరుసగా రెండో వన్డేలోనూ స్టార్క్ బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తర్వాత రాహుల్, హార్దిక్, కోహ్లి, జడేజా కూడా ఎక్కువసేపు క్రీజులో నిలువ లేకపోయారు. అబాట్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో హార్దిక్ పాండ్యా (1) షాట్ ఆడతా... స్టీవ్ స్మిత్ స్లిప్‌లో తన కుడి వైపునకు గాల్లో అమాంతం డైవ్ చేస్తూ తీసుకున్న క్యాచ్ హైలైట్‌గా నిలిచింది.
ధనాధన్ ఆట...
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు హెడ్, మార్ష్ శుభారంభం ఇచ్చారు. వీరిద్దరు భారత బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ముఖ్యంగా మార్ష్ చెలరేగిపోయాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో మార్ష్ 2 సిక్స్‌లు, 1 ఫోర్ కొట్టగా... సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో హెడ్ వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు. అనంతరం హార్దిక్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో మార్ష్ 3 సిక్స్‌లతో అలరించాడు. దాంతో ఆసీస్ 8 ఓవర్లలో 90 పరుగులు సాధించింది. ఆ తర్వాతా ఇదే జోరు కొనసాగించి ఆసీస్ 11 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) స్మిత్ (బి) స్టార్క్ 13; శుబ్‌మన్ గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 0; విరాట్ కోహ్లి (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎలిస్ 31; సూర్యకుమార్ యాదవ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 0; కేఎల్ రాహుల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) స్టార్క్ 9; హార్దిక్ పాండ్యా (సి) స్మిత్ (బి) అబాట్ 1; రవీంద్ర జడేజా (సి) క్యారీ (బి) ఎలిస్ 16; అక్షర్ పటేల్ (నాటౌట్) 29; కుల్దీప్ యాదవ్ (సి) హెడ్ (బి) అబాట్ 4; షమీ (సి) క్యారీ (బి) అబాట్ 0; సిరాజ్ (బి) స్టార్క్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (26 ఓవర్లలో ఆలౌట్) 117.
వికెట్ల పతనం: 1–3, 2–32, 3–32, 4–48, 5–49, 6–71, 7–91, 8–103, 9–103, 10–117.
బౌలింగ్: మిచెల్ స్టార్క్ 8–1–53–5, కామెరాన్ గ్రీన్ 5–0–20–0, సీన్ అబాట్ 6–0–23–3, నాథన్ ఎలిస్ 5–0–13–2, ఆడమ్ జంపా 2–0–6–0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ట్రావిస్ హెడ్ (నాటౌట్) 51; మిచెల్ మార్‡్ష (నాటౌట్) 66; ఎక్స్‌ట్రాలు 4, మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 121.
బౌలింగ్: షమీ 3–0–29–0, సిరాజ్ 3–0–37–0, అక్షర్ పటేల్ 3–0–25–0, హార్దిక్ పాండ్యా 1–0–18–0, కుల్దీప్ యాదవ్ 1–0–12–0.
Comments
Please login to add a commentAdd a comment