సాక్షి, విశాఖపట్నం: ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్‌లో ఓడించిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌లో కూడా పడగొట్టేందుకు మరో మ్యాచ్ దూరంలో ఉంది. ఇరు జట్ల నేడు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో వన్డే జరుగుతుంది. ఈ పోరులో గెలిస్తే సిరీస్ భారత్ ఖాతాలో చేరుతుంది. మరోవైపు సిరీస్‌ను సజీవంగా ఉంచేందుకు ఆసీస్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డే నుంచి తప్పుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో సారథిగా బాధ్యతలు తీసుకుంటాడు.
మూడో స్పిన్నర్‌కు చోటు...
తొలి వన్డేలో భారత పేసర్లు షమీ, సిరాజ్ చక్కగా రాణించారు. స్పిన్ విభాగంలో జడేజా రాణించగా, కుల్దీప్ మాత్రమే కొన్ని పరుగులిచ్చాడు. అయితే ముంబైతో పోలిస్తే వైజాగ్ పిచ్ స్పిన్‌కు మరింత అనుకూలంగా ఉండటంతో రెండో రెగ్యులర్ స్పిన్నర్ ఉంటే బాగుంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అదే జరిగితే శార్దుల్ ఠాకూర్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం దక్కవచ్చు. మూడో పేసర్ పాత్రను హార్దిక్ సమర్థంగా నిర్వహిస్తుండటంతో శార్దుల్ అవసరం ఇప్పుడు జట్టుకు కనిపించడం లేదు. బ్యాటింగ్‌లో ఊహించినట్లుగానే మిడిలార్డర్‌లో శ్రేయస్ లేని లోటు కనిపిస్తోంది. సూర్యకుమార్ మరోసారి వన్డేల్లో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా ఆడకపోతే అతను వన్డే కెరీర్ ఇబ్బందుల్లో పడటం ఖాయం. రోహిత్ రాకతో ఓపెనింగ్‌లో జట్టు బలం పెరిగింది. గత మ్యాచ్‌లో విఫలమైన కోహ్లి తన స్థాయికి తగ్గట్లు ఆడితే భారీ స్కోరు ఖాయం.
వార్నర్ ఆడితే...
మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బరిలోకి దిగుతోంది. అయితే ఆ జట్టు బ్యాటింగ్ బలహీనత తొలి వన్డేలో స్పష్టంగా కనిపించింది. గాయం నుంచి కోలుకున్న వార్నర్ ఆడితే జట్టులో ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరం. పైగా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు జరుగుతాయి. కీపర్ ఇన్‌గ్లిస్ స్థానంలో క్యారీ వస్తాడు. హెడ్, లబుషేన్ రాణించడం కీలకం. అయితే అన్నింటికి మించి స్టీవ్ స్మిత్ ఫామ్ ఆసీస్‌ను ఆందోళన పరుస్తోంది. భారత్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి అతను కనీసం ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇప్పటికైనా అతను ఆ లోటును తీర్చుకుంటాడా చూడాలి. స్టార్క్ తన బౌలింగ్ పదును భారత్‌కు చూపించగా... తొలి వన్డేలో ఒక బౌలర్‌ను తక్కువగా ఆడించి ఇబ్బంది పడిన కంగారూలు ఈసారి ఎలా వ్యూహం మారుస్తారో చూడాలి.
వాన గండం...
విశాఖ పిచ్ మొదటి నుంచి బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. దాదాపు అన్ని మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఈసారి కూడా అలాంటి పిచ్ ఎదురు కావచ్చు. అయితే వర్షం ఆటకు ఇబ్బందిగా మారవచ్చని తెలుస్తోంది. స్థానిక వాతావరణ సూచన ప్రకారం ఆదివారం వాన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, సూర్యకుమార్, రాహుల్, పాండ్యా, జడేజా, సుందర్, కుల్దీప్, షమీ, సిరాజ్.
ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), మార్‡్ష, హెడ్, లబుషేన్, క్యారీ, గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, అబాట్, స్టార్క్, జంపా.
7:విశాఖపట్నంలో భారత్ 9 వన్డేలు ఆడగా...7 గెలిచింది. ఒక మ్యాచ్‌లో ఓడిపోగా, మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. ఈ వేదికపై ఆడిన ఆరు వన్డేల్లో కోహ్లి 118, 117, 99, 65, 157 నాటౌట్, 0 స్కోర్లు నమోదు చేశాడు.
వైజాగ్‌లో సిరీస్ సాధిస్తారా!
Published Sun, Mar 19 2023 4:24 AM | Last Updated on Sun, Mar 19 2023 4:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment