ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా యువ బ్యాటర్ రిచా ఘోష్ వీరోచిత పోరాటం (117 బంతుల్లో 96; 13 ఫోర్లు) వృధా అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. రిచా ఘోష్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో రాణించినప్పటికీ ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. తద్వారా భారత్ సిరీస్‌ను సైతం 0-2తో కోల్పోయింది.
రిచాకు జెమీమా రోడ్రిగెజ్ (44), స్మృతి మంధన (34) సహకరించినప్పటికీ.. ఆఖర్లో భారత బ్యాటర్లు ఒక్కో పరుగు చేసేందుకు కూడా ఇబ్బంది పడి వికెట్లు సమర్పించుకున్నారు. దీప్తి శర్మ (24 నాటౌట్) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేసింది. భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది (255/8). గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలు కావడంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. సదర్‌ల్యాండ్ (3/47), వేర్హమ్ (2/39) టీమిండియాను దెబ్బకొట్టారు.
అంతకుముందు దీప్తి శర్మ (10-0-38-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో విజృంభించడంతో టీమిండియా.. ఆసీస్‌ను 258 పరుగులకు (8 వికెట్ల నస్టానికి) పరిమితం చేయగలిగింది. దీప్తితో పాటు పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచడం విశేషం.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ లిచ్‌ఫీల్డ్ (63), ఎల్లైస్ పెర్రీ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. తహిళ మెక్‌గ్రాత్ (24), సదర్‌ల్యాండ్ (23), జార్జ్ వేర్హమ్ (22), అలానా కింగ్ (28 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ సిరీస్లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇదే సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ..
ఆసీస్‌పై రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దీప్తి శర్మ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆసీస్‌పై వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment