INDW VS AUSW 2nd ODI: ఆసీస్‌ వెన్ను విరిచిన దీప్తి శర్మ | INDW vs AUSW, 2nd ODI: Deepti Sharma Bags 5 Wickets | Sakshi
Sakshi News home page

INDW VS AUSW 2nd ODI: ఆసీస్‌ వెన్ను విరిచిన దీప్తి శర్మ

Published Sat, Dec 30 2023 5:08 PM | Last Updated on Sat, Dec 30 2023 5:52 PM

INDW VS AUSW 2nd ODI: Deepti Sharma Bags 5 Wickets - Sakshi

మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ముంబై వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియాతో (మహిళల జట్టు) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బౌలింగ్‌ చేయగా.. దీప్తి శర్మ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్‌ వెన్ను విరిచింది. తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసిన దీప్తి కేవలం 38 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు కీలక వికెట్లు పడగొట్టింది.

దీప్తితో పాటు పూజా వస్త్రాకర్‌, స్నేహ్‌ రాణా, శ్రేయాంక పాటిల్‌ తలో వికెట్‌ పడగొట్టడంతో ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో వస్త్రాకర్‌ 18 పరుగులు సమర్పించుకోవడంతో ఆసీస్‌ 250 పరుగుల మార్కును దాటగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచడం విశేషం.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ లిచ్‌ఫీల్డ్‌ (63), ఎల్లైస్‌ పెర్రీ (50) అర్ధసెంచరీలతో రాణించగా.. తహిళ మెక్‌గ్రాత్‌ (24), సదర్‌ల్యాండ్‌ (23), జార్జ్‌ వేర్హమ్‌ (22), అలానా కింగ్‌ (28 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఈ సిరీస్లో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. అంతకుముందు ఇదే సిరీస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్‌ ఆసీస్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వన్డే సిరీస్‌ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కూడా జరుగనుంది. 

చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ..
ఆసీస్‌పై రెండో వన్డేలో ఐదు వికెట్ల ప్రదర్శనతో దీప్తి శర్మ ఓ అరుదైన ఘనత సాధించింది. ఆసీస్‌పై వన్డేల్లో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత మహిళా బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement