మెల్‌బోర్న్ టెస్టులో భారత్ పరాజయం
184 పరుగులతో గెలిచిన ఆస్ట్రేలియా
యశస్వి జైస్వాల్ పోరాటం వృథా
శుక్రవారం నుంచి సిడ్నీలో చివరి టెస్టు
భారత్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యం... తొలి సెషన్‌లో 33/3 స్కోరుతో కాస్త ఆందోళన... అయితే రెండో సెషన్‌లో ఒక్క వికెట్ కూడా చేజార్చుకోలేదు... దాంతో ఓటమిని తప్పించుకోవడంపై ఆశలు... విరామం తర్వాత 121/3తో మెరుగైన స్థితి... అయితే అనూహ్యంగా 9 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడ్డాయి... పంత్ ఆడిన తప్పుడు షాట్‌తో ఈ పతనం మొదలైంది... అయినా సరే జైస్వాల్ పట్టుదలగా ఆడుతుండటం, మరో నాలుగు వికెట్లు ఉండటంతో కొంత భరోసా... మరో 21.2 ఓవర్లు నిలబడిగలిగితే చాలు... మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించవచ్చు... కానీ జైస్వాల్ అవుట్ కావడంతో అంతా మారిపోయింది... అతను వెనుదిరిగిన తర్వాత టీమిండియా ఆట ముగించేందుకు ఆసీస్‌కు 8.2 ఓవర్లు సరిపోయాయి... ఒక్క సెషన్‌లోనే 7 వికెట్లు చేజార్చుకున్న భారత్ మరో 12.5 ఓవర్లు మిగిలి ఉన్న దశలో ఓటమిని ఖరారు చేసుకుంది... వరుస మలుపులతో సాగుతూ వచ్చిన మెల్‌బోర్న్ టెస్టులో చివరకు ఆ్రస్టేలియానే గెలుపు బావుటా ఎగరవేసింది. వేర్వేరు సందర్భాల్లో పైచేయి సాధించే అవకాశాలు వచ్చినా... వాటిని సమర్థంగా ఉపయోగించుకోలేక రోహిత్ బృందం సిరీస్‌లో వెనుకబడిపోయింది. ఇప్పుడు బోర్డర్–గావస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్ చేరే అవకాశాలు మిగిలి ఉండాలంటే చివరి టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో భారత్ నిలిచింది.
మెల్‌బోర్న్: నాలుగేళ్ల క్రితం ‘గాబా’ మైదానం తరహాలో భారీ లక్ష్యాన్ని ఛేదించి మెల్‌బోర్న్‌లో భారత్ సంచలన విజయం సాధిస్తుందని ఆశించిన భారత అభిమానులకు నిరాశ తప్పలేదు. గెలుపు కాదు కదా ... ఓటమి నుంచి తప్పించుకొని ‘డ్రా’గా ముగించే చాన్స్ కూడా ఆ్రస్టేలియా ఇవ్వలేదు. ఎంసీజీలో సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ 79.1 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (208 బంతుల్లో 84; 8 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కమిన్స్, బోలండ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, లయన్‌కు 3 వికెట్లు దక్కాయి. తాజా ఫలితంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆ్రస్టేలియా 2–1తో ముందంజ వేసింది. చివరి టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది. మ్యాచ్‌లో కీలకమైన 90 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
జైస్వాల్ మినహా...
సిరీస్‌లో వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న కెపె్టన్ రోహిత్ శర్మ (9) ఈసారి చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. అయితే 40 బంతులు ఎదుర్కొన్న అతను తొలిసారి కమిన్స్ బౌలింగ్‌లో దూకుడైన షాట్ ఆడబోయి వెనుదిరిగాడు. అదే ఓవర్లో రాహుల్ (0) కూడా అవుట్ కాగా, స్టార్క్ పదునైన బంతిని డ్రైవ్ చేయబోయిన కోహ్లి (5) కూడా స్లిప్‌లో చిక్కడంతో తొలి సెషన్ ముగిసింది. లంచ్ తర్వాత జైస్వాల్, పంత్ (104 బంతుల్లో 30; 2 ఫోర్లు) సాధికారికంగా ఆడారు. 27.5 ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే టీ తర్వాత ఎట్టకేలకు పార్ట్‌టైమర్ హెడ్‌తో బౌలింగ్ చేయించిన వ్యూహం ఫలించింది. పంత్‌ను అవుట్ చేసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. అంతే... ఆ తర్వాత జట్టు పతనం వేగంగా సాగిపోయింది. 34 పరుగుల వ్యవధిలోనే జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది. జడేజా (2), నితీశ్ రెడ్డి (1) విఫలం కాగా, సిరాజ్ (0)ను లయన్ ఎల్బీగా అవుట్ చేయడంతో ఆసీస్ సంబరాల్లో మునిగిపోయింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 228/9తో ఆట కొనసాగించిన ఆసీస్ 234 పరుగులకు ఆలౌటైంది.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 474; భారత్ తొలి ఇన్నింగ్స్: 369; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 234; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) కేరీ (బి) కమిన్స్ 84; రోహిత్ (సి) మార్‡్ష (బి) కమిన్స్ 9; రాహుల్ (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; కోహ్లి (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 5; పంత్ (సి) మార్‡్ష (బి) హెడ్ 30; జడేజా (సి) కేరీ (బి) బోలండ్ 2; నితీశ్ రెడ్డి (సి) స్మిత్ (బి) లయన్ 1; సుందర్ (నాటౌట్) 5; ఆకాశ్‌దీప్ (సి) హెడ్ (బి) బోలండ్ 7; బుమ్రా (సి) స్మిత్ (బి) బోలండ్ 0; సిరాజ్ (ఎల్బీ) (బి) లయన్ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (79.1 ఓవర్లలో ఆలౌట్) 155. వికెట్ల పతనం: 1–25, 2–25, 3–33, 4–121, 5–127, 6–130, 7–140, 8–150, 9–154, 10–155. బౌలింగ్: స్టార్క్ 16– 8–25–1, కమిన్స్ 18–5–28–3, బోలండ్ 16–7 –39–3, మార్‡్ష 3–2–2–0, లయన్ 20.1–6– 37–2, హెడ్ 5–0–14–1, లబుషేన్ 1–1–0–0.
చాలా నిరాశగా ఉంది. చివరి వరకు పోరాడాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగాం కానీ అది సాధ్యం కాలేదు. ఆఖర్లో అంతా మారిపోయింది. టెస్టు మొత్తాన్ని చూస్తే మాకూ కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ మేం వాడుకోలేక పోయాం. వారి చివరి వికెట్ భాగస్వామ్యం కూడా దెబ్బ తీసింది. 340 పరుగులు ఎప్పుడైనా కష్టమే. చివరి రెండు సెషన్లలో ధాటిగా ఆడి లక్ష్యం చేరేందుకు ప్రయతి్నంచేందుకు కావాల్సిన పునాది వేయలేకపోయాం. తర్వాతి టెస్టుకు ముందు కొన్ని లోపాలు సరిదిద్దుకోవాల్సి ఉంది. గట్టిగా ప్రయతి్నంచి 2–2గా మార్చే ప్రయత్నం చేస్తాం. నా బ్యాటింగ్ గురించి చెప్పాలంటే మానసికంగా నేను సరైన స్థితిలో లేను. నేను ఏం చేయాలని ప్రయతి్నంచినా కలిసి రావడం లేదు. ఫలితం దక్కకపోవడం నిరాశ కలిగిస్తోందనేది మాత్రం వాస్తవం.
–రోహిత్ శర్మ, భారత కెప్టెన్
జైస్వాల్ అవుట్‌పై వివాదం!
చక్కటి ఇన్నింగ్స్‌తో ఓటమి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్న సమయంలో యశస్వి జైస్వాల్ అవుట్ కావడం జట్టును దెబ్బ తీసింది. కమిన్స్ బౌలింగ్‌లో లెగ్‌సైడ్ దిశగా వెళుతున్న బంతిని ఆడి కీపర్ కేరీకి అతను క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ విల్సన్ స్పందించకపోవడంతో ఆసీస్ రివ్యూ కోరింది. ఇదే చివరకు చర్చకు దారి తీసింది. వరుస రీప్లేల తర్వాత స్పష్టత రాకపోగా, ‘స్నికో’లో కూడా ఏదీ తేలలేదు.
ఇక్కడా బంతి బ్యాట్‌ను తాకినట్లుగా కనిపించలేదు. అయితే ముందు భాగంనుంచి చూసిన రీప్లేలో బంతి బ్యాట్‌ను దాటిన తర్వాత దిశను మార్చుకున్నట్లుగా కనిపించింది. దీని ఆధారంగానే అది బ్యాట్‌కు తగిలిందని చెబుతూ థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ‘అవుట్’గా ప్రకటించడంతో జైస్వాల్ నిరాశగా మైదానం వీడాడు. అయితే ‘స్నికో’ను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ప్రశి్నంచిన సునీల్ గావస్కర్... ఇక సాంకేతికత ఎందుకని, కొన్నిసార్లు బ్యాట్‌కు తగలకపోయినా బంతి దిశ మార్చుకోవడం సహజమని విమర్శించాడు.
మరోవైపు మాజీ అంపైర్ సైమన్ టఫెల్ కూడా ఇది ‘అవుట్’ అని నిర్ధారించాడు. అంపైరింగ్ ప్రొటోకాల్ ప్రకారం బంతి దిశ మార్చుకున్నట్లు కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు టెక్నాలజీ వాడాల్సిన అవసరం లేదని అన్నాడు. భారత కెపె్టన్ రోహిత్ శర్మ కూడా జైస్వాల్ బ్యాట్‌కి బంతి తాకిందని, అతను అవుట్ అని తేల్చి వివాదానికి ముగింపు పలకడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment