నిర్లక్ష్యం... ఓ పరాజయం | All-round England beat India by 8 wickets in T20I series | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం... ఓ పరాజయం

Published Sat, Mar 13 2021 4:35 AM | Last Updated on Sat, Mar 13 2021 8:29 AM

All-round England beat India by 8 wickets in T20I series - Sakshi

ధావన్‌ బౌల్డ్‌, రాహుల్‌ బౌల్డ్‌

అహ్మదాబాద్‌ పిచ్‌పై టెస్టు విజయాలందుకున్న భారత్‌ పొట్టి ఫార్మాట్‌లో కూడా స్పిన్‌ ఉచ్చునే బిగిద్దామనుకుంది. ఏకంగా తుదిజట్టులో ముగ్గురు స్పిన్నర్లను రంగంలోకి దించింది. జట్టు కూర్పుపై... ప్రత్యేకించి స్పిన్‌ బౌలింగ్‌పై కనబరిచిన శ్రద్ధ బ్యాటింగ్‌పై మరచినట్లుంది. అందుకే టీమిండియా టాపార్డర్‌ వికెట్లను నిర్లక్ష్యంగా పడేసుకొని భారీ మూల్యమే చెల్లించుకుంది. ఓటమితో టి20 సిరీస్‌ను మొదలుపెట్టింది. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో శుభారంభం చేసింది.

అహ్మదాబాద్‌: టెస్టుల్లో తమను ఓడించి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు (డబ్ల్యూటీసీ) అర్హత సాధించిన భారత్‌కు టి20ల్లో ‘నంబర్‌వన్‌’ ఇంగ్లండ్‌ తడాఖా చూపింది. స్పిన్‌ పిచ్‌పై స్పిన్నర్లను చితగ్గొట్టి మరీ పొట్టి ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌ గట్టి దెబ్బ తీసింది. శుక్రవారం తొలి టి20లో 8 వికెట్ల తేడాతో భారత్‌ను మట్టికరిపించిన మోర్గాన్‌ బృందం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శుభారంభం చేసింది.

స్పిన్నర్లపై బ్యాట్‌ ఝుళిపించిన జేసన్‌ రాయ్‌ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సునాయాస విజయా న్నందించాడు. ముందుగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (48 బంతుల్లో 67; 8 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆర్చర్‌ 23 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్‌ 15.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. తొలి రెండు మ్యాచ్‌లకు రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో రాహుల్‌కు జతగా ధావన్‌ ఓపెనింగ్‌ చేశాడు. ఆదివారం రెండో టి20 ఇక్కడే జరుగుతుంది.

చెత్త షాట్లతో బోల్తా
టాస్‌ నెగ్గిన ఇంగ్లండ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ చెత్తషాట్లతో టాపార్డర్‌ను కోల్పోయింది. ఆర్చర్‌ వేసిన రెండో ఓవర్లోనే రాహుల్‌ (1) వికెట్లపై ఆడుకొని పెవిలియన్‌ చేరాడు. వచ్చీరాగానే స్పిన్నర్‌ రషీద్‌ బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా వికెట్లను విడిచి మరీ షాట్‌కు ప్రయత్నించిన కెప్టెన్‌ కోహ్లి (0) మిడాఫ్‌లో జోర్డాన్‌ చేతికి చిక్కాడు.

అప్పటికి జట్టు స్కోరు 3 పరుగులే కానీ 2 వికెట్లను కోల్పోయింది. ఆర్చర్‌ నాలుగో ఓవర్లో రిషభ్‌ పంత్‌ 6, 4 బాదాడు. ఇక మెరుపులు మొదలయ్యాయనుకునే లోపే ధావన్‌ (4) రూపంలో మరో దెబ్బ! ఐదో ఓవర్లో ధావన్‌ హుక్‌ షాట్‌ ఆడబోయి క్లీన్‌బౌల్డయ్యాడు. 20 పరుగులకే భారత్‌ టాప్‌–3 వికెట్లను కోల్పోయింది. దీంతో పంత్, శ్రేయస్‌ అయ్యర్‌ జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ పదో ఓవర్లో స్టోక్స్‌ యువ హిట్టర్‌ పంత్‌ వికెట్‌ను పడేశాడు. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 48/4. ఈ దశలో అయ్యర్‌కు హార్దిక్‌ పాండ్యా జతయ్యాడు.  

ఆదుకున్న అయ్యర్‌
ఆది నుంచి కష్టాల పాలైన భారత్‌ స్కోరు 50 చేరేందుకు 11 ఓవర్లు పట్టాయి. మందకొడిగా సాగుతున్న ఇన్నింగ్స్‌కు 15వ ఓవర్‌ కాస్త ఊపిరి పోసింది. స్టోక్స్‌ వేసిన ఆ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా సిక్స్, బౌండరీ బాదడంతో మొత్తం 12 పరుగులొచ్చాయి. ఆర్చర్‌ వేసిన తదుపరి ఓవర్లో అయ్యర్‌ రెండు ఫోర్లు కొట్టాడు. 36 బంతుల్లో 7 ఫోర్లతో అర్ధసెంచరీ సాధించిన అయ్యర్‌... జోర్డాన్‌ బౌలింగ్‌లో దూసుకొచ్చిన బౌన్సర్‌ను స్క్వేర్‌ వైపు కొట్టిన సిక్సర్‌ మెరుపునే తలపించింది. దీంతోనే జట్టు స్కోరు వందకు చేరింది. కానీ ఆ తర్వాత ఓవర్లోనే ఆర్చర్‌ బ్యాట్స్‌మెన్‌ జోరుకు, భారత్‌ స్కోరుకు అడ్డుకట్ట వేశాడు. ఐదో వికెట్‌కు 54 పరుగులు జోడించాక వరుస బంతుల్లో పాండ్యా (19; 1 ఫోర్, 1 సిక్స్‌), శార్దుల్‌ (0)లను ఔట్‌ చేశాడు. ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచిన అయ్యర్‌ ఆఖరి ఓవర్లో ఔటయ్యాడు.  

రఫ్పాడించిన రాయ్‌

ఫార్మాట్‌ మారింది. అయినా సరే స్పిన్‌తోనే చుట్టేద్దామనుకునే ఆతిథ్య ఎత్తుగడను ఇంగ్లండ్‌ ఓపెనర్లు జేసన్‌ రాయ్, బట్లర్‌ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌) తిప్పికొట్టారు. చహల్‌ తొలి ఓవర్లో రాయ్‌ 6, 4లతో 11 పరుగులు పిండుకున్నాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్లో బట్లర్‌ దాన్ని రిపీట్‌ చేశాడు. దీంతో మరో 13 పరుగులొచ్చాయి. పవర్‌ ప్లేలోనే ఇంగ్లండ్‌ 50 పరుగులు చేసింది. రాయ్‌ స్పిన్నర్లే లక్ష్యంగా చెలరేగాడు. అక్షర్‌ వేసినా... చహల్‌ తిప్పేసిన తను మాత్రంలో ఫోర్లు, సిక్సర్లతో దంచేశాడు. ఎట్టకేలకు బట్లర్‌ను చహల్‌ ఔట్‌ చేశాడు. ఈ వికెట్‌తో బుమ్రా (59 వికెట్లు)ను దాటేసి చహల్‌ (60 వికెట్లు) టి20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బట్లర్‌ అవుటయ్యే సమయానికి ఇంగ్లండ్‌ స్కోరు 72 పరుగులకే చేరింది. చకచకా బాదుతున్న రాయ్‌... సుందర్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి అర్ధసెంచరీ చేజార్చుకున్నాడు. తర్వాత మలాన్‌ (24 నాటౌట్‌; 2 ఫోర్లు, 1సిక్స్‌), బెయిర్‌స్టో (26 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి లాంఛనాన్ని పూర్తి చేశారు.

రాయ్, బట్లర్‌

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: ధావన్‌ (బి) వుడ్‌ 4; రాహుల్‌ (బి) ఆర్చర్‌ 1; కోహ్లి (సి) జోర్డాన్‌ (బి) రషీద్‌ 0; పంత్‌ (సి) బెయిర్‌స్టో (బి) స్టోక్స్‌ 21; అయ్యర్‌ (సి) మలాన్‌ (బి) జోర్డాన్‌ 67; పాండ్యా (సి) జోర్డాన్‌ (బి) ఆర్చర్‌ 19; శార్దుల్‌ (సి) మలాన్‌ (బి) ఆర్చర్‌ 0; సుందర్‌ (నాటౌట్‌) 3; అక్షర్‌ పటేల్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 124.
వికెట్ల పతనం: 1–2, 2–3, 3–20, 4–48, 5–102, 6–102, 7–117.
బౌలింగ్‌: రషీద్‌ 3–0–14–1; జోఫ్రా ఆర్చర్‌ 4–1–23–3; వుడ్‌ 4–0–20–1; జోర్డాన్‌ 4–0–27–1; స్టోక్స్‌ 3–0–25–1; సామ్‌ కరన్‌ 2–0–15–0.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (ఎల్బీ) (బి) సుందర్‌ 49; బట్లర్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 28; మలాన్‌ (నాటౌట్‌) 24; బెయిర్‌స్టో (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (15.3 ఓవర్లలో 2 వికెట్లకు) 130.
వికెట్ల పతనం: 1–72, 2–89.
బౌలింగ్‌: అక్షర్‌ పటేల్‌ 3–0–24–0; భువనేశ్వర్‌ 2–0–15–0; చహల్‌ 4–0–44–1; శార్దుల్‌ ఠాకూర్‌ 2–0–16–0; హార్దిక్‌ పాండ్యా 2–0– 13–0; వాషింగ్టన్‌ సుందర్‌ 2.3–0–18–1.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement