నెదర్లాండ్స్ చేతిలో భారత్ ఓటమి
క్వార్టర్స్‌లో మలేసియాతో పోరు
లండన్: హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది. మంగళవారం పూల్ ‘బి’లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మన్‌ప్రీత్ సేన 1–3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. ఫలితం నిరాశపరిచినప్పటికీ ఈ మ్యాచ్‌లో తమ కన్నా మెరుగైన ప్రత్యర్థికి భారత జట్టు గట్టి పోటీనిచ్చింది. ఈ పోరులో నమోదైన గోల్స్ అన్నీ తొలి రెండు క్వార్టర్స్‌లోనే వచ్చాయి. నెదర్లాండ్స్ తరఫున తియెరీ బ్రింక్‌మన్ (2వ నిమిషం), శాండెర్ బార్ట్ (12వ ని.), మైక్రో ప్రూజ్‌సెర్ (24వ ని.) తలా ఒక గోల్ చేయగా, భారత్ తరఫున ఏకైక ఫీల్డ్ గోల్‌ను ఆకాశ్‌దీప్ సింగ్ ఆట 28వ నిమిషంలో సాధించాడు. తర్వాత మూడు, నాలుగో క్వార్టర్‌లలో భారత్ ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టడి చేసింది. ఈ మ్యాచ్ ఫలితంతో పని లేకుండా ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం మలేసియా, భారత్‌ల మధ్య క్వార్టర్స్ పోరు జరగనుంది. అదేరోజు నెదర్లాండ్స్... చైనాతో తలపడనుంది.