
బాంబులతో గది తలుపు పేల్చేసి మరీ దోచేసిన వైనం
ఎస్సెన్ (నెదర్లాండ్స్): నెదర్లాండ్స్‌లో దొంగలు ఏకంగా వేల ఏళ్లనాటి బంగారు హెల్మెట్‌పైనే కన్నేశారు. ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నారు. చివరికి అనుకున్నది సాధించారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను బాంబులతో బద్ధలుకొట్టి మరీ దోచుకెళ్లిపోయారు. అది ఏకంగా 2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్! దాంతో ఈ దొంగతనం సంచలనం సృష్టించింది.
ప్రాచీన వస్తు ప్రదర్శన కోసం తమ దేశం నుంచి నెదర్లాండ్స్ పట్టుకుపోయిన అత్యంత విలువైన వస్తువులు చోరశిఖామణుల పాలబడటంతో రొమేనియా సైతం దిగ్భ్రాంతికి గురైంది. నెదర్లాండ్స్‌లోని ఎస్సెన్ నగరంలోని డ్రెంట్స్ పురాతన వస్తుప్రదర్శనశాలలో ఈ భారీ చోరీ జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన దొంగలు మ్యూజియం వద్దకొచ్చి బయటివైపు ఉన్న భారీ తలుపును రంధ్రాలు పెట్టే మెషీన్, ఇనుప రాడ్లతో ఎలాగోలా తెరిచారు.
అక్కడే లోపలివైపు ఇంకో భారీ తలుపు ఉంది. అత్యంత పటిష్టంగా ఉన్న దీనిని మామూలుగా తెరవడం సాధ్యంకాదని దొంగలకు తెలుసో ఏమో, ముందుజాగ్రత్తగా పెద్ద బాంబును వెంట తెచ్చుకున్నారు. తలుపుకు బాంబు అమర్చి పేల్చేశారు. తునాతునకలైన ద్వారం గుండా ఎంచక్కా లోపలికి వెళ్లి అక్కడ అత్యంత ప్రాచీనమైన నాలుగు వస్తువులను తీసుకుని ఉడాయించారు.
వెలకట్టలేని హెల్మెట్
చోరీకి గురైన వాటిల్లో 2,500 ఏళ్ల క్రితం నాటి పుత్తడితో చేసిన హెల్మెట్ ఉంది. క్రీస్తుపూర్వం 50వ సంవత్సరంలో దీనిని తయారు చేశారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 907 గ్రాముల బరువైన ఈ హెల్మెట్‌ను రొమేనియాలో వంద సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో కనుగొన్నారు. ‘హెల్మెట్ ఆఫ్ కోటోఫెనెస్టీ’గా పిలుచుకునే దీనిని పూర్వకాలంలో ఉత్సవాలు, సంబరాల్లో ఉపయోగించేవారు. హెల్మెట్ ముందుభాగంలో పెద్ద కళ్లను చెక్కారు.
దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడుతుందని ఆనాటి జనం విశ్వసించేవారు. జంతు వధ చేస్తున్నట్లుగా హెల్మెట్ వెనుకవైపు చెక్కారు. రొమేనియా సంస్కృతి సంబంధించి ఇది వెలకట్టలేని ప్రాచీన కళాఖండమని చోరీ తర్వాత రొమేనియా ప్రభుత్వం ఆవేదన వ్యక్తంచేసింది. దీంతోపాటు డేసియన్ల రాజ్యానికి చెందిన అలనాటి రాయల్ బ్రేస్‌లెట్‌సహా మూడు వస్తువులనూ దొంగలు పట్టుకెళ్లిపోయారు.
రోమన్లు రొమేనియాను పాలించడానికి ముందు రాజ్యమేలిన డేసియన్ల సంస్కృతిని కళ్లకుకట్టేందుకు ఆనాటి వస్తువులను ఒక దగ్గరకు చేర్చి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక ప్రదర్శనను ఏర్పాటుచేసింది. గత ఏడాది జూలై నుంచి ఈ ప్రదర్శన కొనసాగుతోంది. కీలకమైన హెల్మెట్‌ను సైతం రొమేనియా నుంచి తెప్పించిమరీ ప్రదర్శనకు ఉంచగా అది కాస్తా ఇప్పుడు దొంగలపరమైంది.
చోరుల కోసం వేట మొదలు
మళ్లీ అప్పజెప్తామని చెప్పి బుకారెస్ట్ నగరంలోని ‘నేషనల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ రొమేనియా’ నుంచి తీసుకొచ్చిన ప్రాచీన వస్తువులు పోవడంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ చోరీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారం క్రితం చోరీకి గురైన ఒక కారు ఈ మ్యూజియం దగ్గర కాలిపోయిన స్థితిలో ఉండటం చూసి ఈ రెండు చోరీలకు ఏమైనా సంబంధం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.
కొట్టుకొచ్చిన కారులో ఇక్కడికొచ్చిన దొంగలు ఆ తర్వాత పారిపోతూ నాలుగు మైళ్ల దూరంలో కారును వదిలేసి తగలబెట్టిపోయారని పోలీసులు భావిస్తున్నారు. కొట్టేసిన కారుకు నకిలీ నంబర్ ప్లేట ఉండటం చూస్తుంటే ఇదేదో ఆరితేరిన దొంగలముఠా పనిగా అనుమానిస్తున్నారు. ‘‘ మా మ్యూజియం 170 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి చోరీ ఘటన చూడలేదు. నిజంగా ఇది దురదృష్టకరం’’ అని ఎస్సెన్‌లోని డ్రెంట్స్ మ్యూజియం డైరెక్టర్ హ్యారీ ట్యూపన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment