Hockey World League semifinals
-
భారత్ పరాజయం
జొహన్నెస్‌బర్గ్: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత్‌కు రెండో పరాజయం ఎదురైంది. అర్జెంటీనాతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ ఆడుతుంది. -
అమెరికా చేతిలో భారత్ ఓటమి
జొహన్నెస్‌బర్గ్: మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో భారత్ తొలి పరాజయాన్ని చవిచూసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకున్న భారత్... సోమవారం జరిగిన గ్రూప్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్‌లో 1–4 గోల్స్ తేడాతో అమెరికా చేతిలో పరాజయం పాలైంది. భారత్‌కు 38వ నిమిషంలో లిలిమా మింజ్ ఏకైక గోల్‌ను అందించింది. తొలి క్వార్టర్లో భారత్ కాస్త మెరుగైన ప్రదర్శన కనబరచడంతో అమెరికా గోల్ చేయలేకపోయినా ఆ తర్వాత విజృంభించింది. భారత్‌కు దక్కిన రెండు పెనాల్టీ కార్నర్లు వృథా అయ్యాయి. అమెరికా తరఫున జిల్ విట్మర్ (24వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... వెస్ట్ టేలర్ (40వ నిమిషంలో), మిచెల్లి (49వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 12న చిలీతో ఆడుతుంది. -
నెదర్లాండ్స్ చేతిలో భారత్ ఓటమి
క్వార్టర్స్‌లో మలేసియాతో పోరు లండన్: హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో భారత్‌కు తొలి పరాజయం ఎదురైంది. మంగళవారం పూల్ ‘బి’లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో మన్‌ప్రీత్ సేన 1–3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. ఫలితం నిరాశపరిచినప్పటికీ ఈ మ్యాచ్‌లో తమ కన్నా మెరుగైన ప్రత్యర్థికి భారత జట్టు గట్టి పోటీనిచ్చింది. ఈ పోరులో నమోదైన గోల్స్ అన్నీ తొలి రెండు క్వార్టర్స్‌లోనే వచ్చాయి. నెదర్లాండ్స్ తరఫున తియెరీ బ్రింక్‌మన్ (2వ నిమిషం), శాండెర్ బార్ట్ (12వ ని.), మైక్రో ప్రూజ్సెర్ (24వ ని.) తలా ఒక గోల్ చేయగా, భారత్ తరఫున ఏకైక ఫీల్డ్ గోల్‌ను ఆకాశ్‌దీప్ సింగ్ ఆట 28వ నిమిషంలో సాధించాడు. తర్వాత మూడు, నాలుగో క్వార్టర్లలో భారత్ ప్రత్యర్థి ఆటగాళ్లను కట్టడి చేసింది. ఈ మ్యాచ్ ఫలితంతో పని లేకుండా ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం మలేసియా, భారత్‌ల మధ్య క్వార్టర్స్ పోరు జరగనుంది. అదేరోజు నెదర్లాండ్స్... చైనాతో తలపడనుంది. -
చక్ దే ఇండియా
హాకీ వరల్డ్ లీగ్ సెమీస్‌లో భారత్ క్వార్టర్స్‌లో బ్రిటన్‌పై 2-1తో విజయం 30 సంవత్సరాల తర్వాత బ్రిటన్ను ఓడించిన భారత్ రాయ్‌పూర్: ఆట అంటే ఇది.. పోరాటం అంటే ఇలా చేయాలి. లీగ్ దశలో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవని భారత్... హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) టోర్నీ నాకౌట్ దశలో మాత్రం సంచలనం సృష్టించింది. టోర్నీలో ఓటమన్నదే లేకుండా దూసుకుపోతోన్న ప్రపంచ 4వ ర్యాంకర్ గ్రేట్ బ్రిటన్‌కు అద్భుతంగా చెక్ పెట్టింది. దీంతో గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత్ 2-1తో బ్రిటన్ను ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది. 30 ఏళ్ల తర్వాత (1985) బ్రిటన్‌పై టీమిండియా గెలవడం విశేషం. లీగ్ దశలో ఒకే ఒక్క పాయింట్‌తో భారత్ పూల్-బిలో చివరి స్థానంతో సరిపెట్టుకోగా, పూల్-ఎలో బ్రిటన్ రెండు విజయాలు, రెండు డ్రాలతో అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కు లభించిన ఏకైక పెనాల్టీని వీఆర్ రఘునాథ్ (19వ నిమిషంలో) గోల్‌గా మలిస్తే, తల్విందర్ సింగ్ (39వ నిమిషం) స్కోరును డబుల్ చేశాడు. సిమోన్ మాంటెల్ (52వ ని.) బ్రిటన్‌కు ఏకైక గోల్ అందించాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు కీలక సమయంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. బ్రిటన్ బంతిని ఎక్కువ శాతం ఆధీనంలో ఉంచుకున్నా గోల్స్ చేయడంలో విఫలమైంది. ఆరు పెనాల్టీ కార్నర్లలో ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఆరంభంలో రెండు క్వార్టర్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసినా చివరి 10 నిమిషాల్లో ఆడిన ఆట మ్యాచ్‌కే హైలెట్. ఆఖరి రెండు నిమిషాల్లో బ్రిటన్ రెండు పెనాల్టీలు సాధించినా.. భారత డిఫెన్స్ ముందు అవి వృథా అయ్యాయి. శనివారం జరిగే సెమీస్‌లో భారత్.. బెల్జియంతో తలపడుతుంది. -
భారత్‌కు చుక్కెదురు
సెమీస్‌లో బెల్జియం చేతిలో ఓటమి ఫ్లోరెంట్ ‘హ్యాట్రిక్’ హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ యాంట్వార్ప్: ఊహించినట్లుగానే బెల్జియం స్ట్రయికర్ల దాడుల ముందు భారత డిఫెన్స్ మూగబోయింది. ఆరంభంలో చూపిన అలసత్వం నుంచి తేరుకునేలోపే ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌ను ఎగురేసుకుపోయింది. దీంతో హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత్‌కు ఫైనల్ బెర్త్ దూరమైంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బెల్జియం 4-0తో భారత్‌పై నెగ్గి తుది పోరుకు అర్హత సాధించింది. వాన్ అబెల్ ఫ్లోరెంట్ (2వ, 41వ, 53వ ని.లో) ‘హ్యాట్రిక్’ గోల్స్ చేయగా, కొసిన్స్ టాంగే (8వ ని.లో) ఒక గోల్ సాధించాడు. భారత డిఫెన్స్ బలహీనంగా ఉండటంతో తొలి క్వార్టర్లో బెల్జియం ఆటగాళ్లు మెరుపు వేగంతో ఆడారు. షార్ట్ పాస్‌లతో బంతిని ఎక్కువసేపు ఆధీనంలో ఉంచుకుని అదను చూసి దెబ్బకొట్టారు. వాళ్ల వేగాన్ని అందుకోవడంలో విఫలమైన భారత్ 8 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సమర్పించుకుంది. లెఫ్ట్ ఫ్లాంక్లో టామ్ బూన్ అందించిన బంతిని డి-సర్కిల్లో ఫ్లోరెంట్ రివర్స్ షాట్‌తో గోల్‌గా మల్చాడు. తర్వాత జస్జీత్ కాలికి బంతి తగలడంతో లభించిన తొలి పెనాల్టీని స్ట్రయికర్ టాంగే నేర్పుగా గోల్‌గా మల్చాడు. ఇక స్కోరును సమం చేసేందుకు భారత్ చేసిన కౌంటర్ అటాక్‌ను ప్రత్యర్థి గోలీ సమర్థంగా తిప్పికొట్టాడు. మూడో క్వార్టర్లో భారత్‌కు రెండు పెనాల్టీలు లభించినా... రూపిందర్ వృథా చేశాడు, రెండుసార్లు బంతిని వైడ్‌గా కొట్టడంతో భారత్ ఆశలు సన్నగిల్లాయి. ఇక నాలుగో క్వార్టర్లో భారత్ ఎదురుదాడులు ప్రారంభించినా ప్రయోజనం లేకపోయింది. 48వ నిమిషంలో బెల్జియంకు మూడో పెనాల్టీ లభించినా వృథా అయ్యింది. 52వ నిమిషంలో నాలుగో పెనాల్టీ కార్నర్‌ను ఫోర్లెంట్ గోల్‌గా మల్చడంతో బెల్జియం 4-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 5-8 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో ఐర్లాండ్ 1-0తో పాక్‌పై నెగ్గింది. దీంతో పాక్ జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయింది. -
సమరం సమం
యాంట్‌వర్ప్ (బెల్జియం) : చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌ను ఈ రెండు జట్లు 2-2 గోల్స్‌తో సమంగా ముగించాయి. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (13వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ ఇమ్రాన్ మహ్మద్ (23వ, 37వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ను అందించాడు. ఈ ఫలితంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. ప్రస్తుతం భారత్ ఏడు పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్ ఇంకా గాయాల నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ భారత జట్టు పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్‌లు లేకుండానే బరిలోకి దిగింది. మ్యాచ్ మొదలైన తొలి నిమిషం నుంచే భారత ఆటగాళ్లు సమన్వయంతో కదులుతూ పాక్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. ఆట 13వ నిమిషంలో గుర్మెయిల్ సింగ్ కుడి వైపు నుంచి కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియాలో రమణ్‌దీప్ సింగ్ డైవ్ చేస్తూ గోల్‌పోస్ట్‌లోనికి పంపించడంతో భారత్ ఖాతా తెరిచింది. రెండో క్వార్టర్లో పాక్ జట్టు తేరుకుంది. పదేపదే దాడులు చేసి భారత్‌పై ఒత్తిడి పెంచింది. 23వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను ఇమ్రాన్ గోల్‌గా మలచడంతో స్కోరు సమమైంది. ఆ తర్వాత మూడో క్వార్టర్లోని 37వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఇమ్రాన్ సద్వినియోగం చేసుకోవడంతో పాక్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే పాక్‌కు ఈ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. రెండు నిమిషాల తర్వాత రమణ్‌దీప్ సింగ్ గోల్‌తో భారత్ స్కోరును 2-2తో సమం చేసింది. చివరి క్వార్టర్లో రెండు జట్లు మరో గోల్ కోసం తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడుతుంది. -
భారత్ X పాకిస్తాన్
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో నేడు అమీతుమీ యాంట్‌వర్ప్ (బెల్జియం): వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం... ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందున ధీమా... వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్‌లో భారత్ ఆటతీరు ఇది. ఇలాంటి ఉత్సాహంతో భారత హాకీ జట్టు మరో కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు జరిగే పూల్ ‘ఎ’ మ్యాచ్‌లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో సర్దార్‌సింగ్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు పాక్ ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్కటి గెలిచింది. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే క్వార్టర్స్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నట్లే. ఈ రెండు జట్ల మధ్య చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ భారత్‌లోనే జరిగింది. అందులో గెలిచిన పాక్ ఆటగాళ్లు మ్యాచ్ తర్వాత ప్రేక్షకులను ఉద్దేశించి అసభ్యంగా సంజ్ఞలు చేశారు. దీంతో అప్పట్లో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత మళ్లీ భారత్, పాక్ మ్యాచ్ జరగనుండటం ఇప్పుడే. దీంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి బాగా పెరిగింది. -
భారత్ మహిళల బోణీ
యాంట్‌వర్ప్ (బెల్జియం) : వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత మహిళల హాకీ జట్టు మూడో మ్యాచ్‌లో తేరుకుంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. పోలండ్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్‌కు క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా నిలిచాయి. భారత్ తరఫున రాణి రాంపాల్ (20వ, 29వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... వందన కటారియా (53వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది. పోలండ్‌కు మగ్దలీనా జగాజ్‌స్కా (50వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించింది. ఈనెల 27న జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. పోలండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలి క్షణం నుంచే దూకుడుగా ఆడింది. 16వ నిమిషంలో భారత్‌కు వెంటవెంటనే రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా ఈసారి రాణి వీటిని లక్ష్యానికి చేర్చలేకపోయింది. అయితే 20వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను రాణి రాంపాల్ గోల్‌గా మలిచింది. అనంతరం 29వ నిమిషంలో కెప్టెన్ రాణి అందించిన పాస్‌ను రాణి రాంపాల్ చాకచక్యంతో గోల్ పోస్ట్‌లోనికి పంపించింది. చివరి క్వార్టర్లో వందన గోల్‌తో భారత్ విజయం ఖాయమైంది. -
భారత్ ‘తీన్మార్’
* పోలండ్పై 3-0తో గెలుపు * హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ యాంట్‌వర్ప్ (బెల్జియం): తొలి మ్యాచ్‌లో అతికష్టమ్మీద గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు రెండో మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరును కనబరిచింది. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆద్యంతం దూకుడుగా ఆడింది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో జమచేసుకుంది. పోలండ్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది. టీమిండియాకు యువరాజ్ వాల్మీకి (23వ నిమిషంలో), కెప్టెన్ సర్దార్ సింగ్ (42వ నిమిషంలో), దేవేందర్ వాల్మీకి (52వ నిమిషంలో) ఒక్కో గోల్‌ను అందించారు. ఈ మూడూ ఫీల్డ్ గోల్స్ కావడం విశేషం. భారత్‌కు లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్లు వృథా అయ్యాయి. లేదంటే సర్దార్ సింగ్ బృందం మరింత ఆధిక్యంతో గెలిచేది. ఫ్రాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రక్షణపంక్తిలో కనిపించిన లోపాలను సరిచేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి క్వార్టర్లో గోల్ చేయలేకపోయిన భారత్ ఆ తర్వాత మూడు క్వార్టర్స్‌లో ఒక్కో గోల్ సాధించింది. ప్రస్తుతం భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. శుక్రవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. మహిళల జట్టుకు భారీ ఓటమి ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో భారత్ 0-5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. కివీస్ తరఫున జెమ్మా ఫ్లిన్, కిర్‌స్టెన్ పియర్స్ రెండేసి గోల్స్ చేయగా... ఒలివియా మెర్రీ ఒక గోల్ సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత క్రీడాకారిణి సుశీలా చాను (మణిపూర్) తన కెరీర్లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. బుధవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో పోలండ్‌తో భారత్ ఆడుతుంది. -
భారత్ శుభారంభం
ఫ్రాన్స్‌పై 3-2తో గెలుపు హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ యాంట్‌వర్ప్ (బెల్జియం): చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్లో విజయంతో శుభారంభం చేసింది. శనివారం జరిగిన పురుషుల విభాగం గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 3-2 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ జట్టును ఓడించింది. పలు మలుపులు తిరిగిన ఈ పోటీలో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా రమణ్‌దీప్ సింగ్ ఫీల్డ్ గోల్‌తో భారత్ విజయాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు ఆట మూడో నిమిషంలోనే శాంచెజ్ గోల్‌తో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. అయితే రెండో క్వార్టర్లో భారత్ అనూహ్యంగా పుంజుకుంది. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసింది. 26వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను మన్‌ప్రీత్ సింగ్ లక్ష్యానికి చేర్చగా... 29వ నిమిషంలో దేవేందర్ వాల్మీకి ఫీల్డ్ గోల్‌తో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మిడ్ ఫీల్డ్ నుంచి బంతిని తీసుకెళ్లిన సర్దార్ సింగ్ సర్కిల్లో ఉన్న ధరమ్వీర్ సింగ్‌కు పాస్ అందించాడు. ధరమ్వీర్ నుంచి బంతిని అందుకున్న దేవేందర్ వాల్మీకి కళ్లు చెదిరే షాట్‌తో ఫ్రాన్స్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించాడు. మూడో క్వార్టర్లో 43వ నిమిషంలో మార్టిన్ గోల్‌తో ఫ్రాన్స్ స్కోరును సమం చేసింది. దాంతో నిర్ణాయక నాలుగో క్వార్టర్ కీలకంగా మారింది. ఈ క్వార్టర్లో రెండు జట్ల ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. మ్యాచ్ రెండు నిమిషాల్లో ముగుస్తుందనగా రమణ్‌దీప్ సింగ్ గోల్ చేసి భారత్‌ను గెలిపించాడు. మ్యాచ్ మొత్తంలో భారత్‌కు మూడు పెనాల్టీ కార్నర్లు రాగా దాంట్లో ఒక దానిని సద్వినియోగం చేసుకుంది. కెప్టెన్ సర్దార్ సింగ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన, గోల్‌కీపర్ శ్రీజేష్ అప్రమత్తత కూడా భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాయి. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో పోలండ్‌తో భారత్ తలపడుతుంది. మహిళల జట్టు ఓటమి: అయితే భారత మహిళల జట్టుకు మాత్రం తొలి మ్యాచ్‌లో నిరాశ ఎదురైంది. ఆతిథ్య బెల్జియం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 0-1 తేడాతో ఓటమి పాలైంది. గోల్స్ చేసేందుకు పలుమార్లు అవకాశాలు వచ్చినా భారత క్రీడాకారిణులు సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. అంతకుముందు ఆట 35వ నిమిషంలో బెల్జియం కెప్టెన్ లీసెలోట్టి వాన్ లిండ్ట్ గోల్ చేసి తమ జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత భారత్ స్కోరును సమం చేసేందుకు కృషి చేసినా ఫలితం లేకపోయింది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడుతుంది.