భారత్ ‘తీన్‌మార్’
* పోలండ్‌పై 3-0తో గెలుపు
* హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్
యాంట్‌వర్ప్ (బెల్జియం): తొలి మ్యాచ్‌లో అతికష్టమ్మీద గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు రెండో మ్యాచ్‌లో మెరుగైన ఆటతీరును కనబరిచింది. ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఆద్యంతం దూకుడుగా ఆడింది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో జమచేసుకుంది. పోలండ్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది.
టీమిండియాకు యువరాజ్ వాల్మీకి (23వ నిమిషంలో), కెప్టెన్ సర్దార్ సింగ్ (42వ నిమిషంలో), దేవేందర్ వాల్మీకి (52వ నిమిషంలో) ఒక్కో గోల్‌ను అందించారు. ఈ మూడూ ఫీల్డ్ గోల్స్ కావడం విశేషం. భారత్‌కు లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్‌లు వృథా అయ్యాయి. లేదంటే సర్దార్ సింగ్ బృందం మరింత ఆధిక్యంతో గెలిచేది. ఫ్రాన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రక్షణపంక్తిలో కనిపించిన లోపాలను సరిచేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి క్వార్టర్‌లో గోల్ చేయలేకపోయిన భారత్ ఆ తర్వాత మూడు క్వార్టర్స్‌లో ఒక్కో గోల్ సాధించింది. ప్రస్తుతం భారత్ ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. శుక్రవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది.
మహిళల జట్టుకు భారీ ఓటమి
ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో భారత్ 0-5 గోల్స్ తేడాతో ఓడిపోయింది. కివీస్ తరఫున జెమ్మా ఫ్లిన్, కిర్‌స్టెన్ పియర్స్ రెండేసి గోల్స్ చేయగా... ఒలివియా మెర్రీ ఒక గోల్ సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత క్రీడాకారిణి సుశీలా చాను (మణిపూర్) తన కెరీర్‌లో 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. బుధవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్‌లో పోలండ్‌తో భారత్ ఆడుతుంది.