సమరం సమం
యాంట్‌వర్ప్ (బెల్జియం) : చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌ను ఈ రెండు జట్లు 2-2 గోల్స్‌తో సమంగా ముగించాయి. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (13వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ ఇమ్రాన్ మహ్మద్ (23వ, 37వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ను అందించాడు. ఈ ఫలితంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. ప్రస్తుతం భారత్ ఏడు పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది.
రఘునాథ్, రూపిందర్ పాల్ సింగ్ ఇంకా గాయాల నుంచి కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ భారత జట్టు పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్‌లు లేకుండానే బరిలోకి దిగింది. మ్యాచ్ మొదలైన తొలి నిమిషం నుంచే భారత ఆటగాళ్లు సమన్వయంతో కదులుతూ పాక్ గోల్‌పోస్ట్‌పై దాడులు చేశారు. ఆట 13వ నిమిషంలో గుర్మెయిల్ సింగ్ కుడి వైపు నుంచి కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియాలో రమణ్‌దీప్ సింగ్ డైవ్ చేస్తూ గోల్‌పోస్ట్‌లోనికి పంపించడంతో భారత్ ఖాతా తెరిచింది. రెండో క్వార్టర్‌లో పాక్ జట్టు తేరుకుంది. పదేపదే దాడులు చేసి భారత్‌పై ఒత్తిడి పెంచింది. 23వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్‌ను ఇమ్రాన్ గోల్‌గా మలచడంతో స్కోరు సమమైంది.
ఆ తర్వాత మూడో క్వార్టర్‌లోని 37వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఇమ్రాన్ సద్వినియోగం చేసుకోవడంతో పాక్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే పాక్‌కు ఈ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. రెండు నిమిషాల తర్వాత రమణ్‌దీప్ సింగ్ గోల్‌తో భారత్ స్కోరును 2-2తో సమం చేసింది. చివరి క్వార్టర్‌లో రెండు జట్లు మరో గోల్ కోసం తీవ్రంగా కృషి చేసినా ఫలితం లేకపోయింది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆదివారం ఆస్ట్రేలియాతో ఆడుతుంది.