రమణ్‌దీప్ గోల్ సంబరం
భువనేశ్వర్: తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు గర్జించింది. ఆసియా క్రీడల చాంపియన్ జపాన్‌ను 7–2 గోల్స్ తేడాతో ఓడించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) సిరీస్ ఫైనల్స్ హాకీ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ రెండు గోల్స్ చేయగా... హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, వరుణ్ కుమార్, వివేక్ ప్రసాద్, గురుసాహిబ్జిత్ సింగ్ ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టు తరఫున కెంజి కిటజాటో, కొటా వతనాబె గోల్స్ చేశారు. జపాన్‌పై విజయంతో భారత్ ఈ ఏడాది చివర్లో జరిగే టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌కు బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా 2–1తో అమెరికాను ఓడించి ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో అమీతుమీకి సిద్ధమైంది. భారత్‌తోపాటు దక్షిణాఫ్రికా కూడా టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీకి బెర్త్‌ను దక్కించుకుంది.
లీగ్ దశలో అజేయంగా నిలిచిన భారత్ అదే దూకుడును సెమీఫైనల్లోనూ కొనసాగించింది. తొలి క్వార్టర్‌లో జపాన్ నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించింది. ఆట రెండో నిమిషంలోనే కెంజి కిటజాటో గోల్‌తో జపాన్ ఖాతా తెరిచింది. ఈ షాక్ నుంచి భారత్ వెంటనే తేరుకుంది. ఏడో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. 14వ నిమిషంలో వరుణ్ కుమార్ మరో పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో కొటా వతనాబె గోల్‌తో జపాన్ స్కోరును 2–2తో సమం చేసింది. కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. భారత్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 4–2తో ముందంజ వేసింది. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి పది నిమిషాల వ్యవధిలో మరో మూడు గోల్స్ చేసి ఆధిక్యాన్ని 7–2కు పెంచుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment