యాంట్‌వర్ప్ (బెల్జియం) : వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత మహిళల హాకీ జట్టు మూడో మ్యాచ్‌లో తేరుకుంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. పోలండ్ జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్‌కు క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా నిలిచాయి. భారత్ తరఫున రాణి రాంపాల్ (20వ, 29వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... వందన కటారియా (53వ నిమిషంలో) ఒక గోల్ సాధించింది. పోలండ్‌కు మగ్దలీనా జగాజ్‌స్కా (50వ నిమిషంలో) ఏకైక గోల్‌ను అందించింది.
ఈనెల 27న జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. పోలండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ తొలి క్షణం నుంచే దూకుడుగా ఆడింది. 16వ నిమిషంలో భారత్‌కు వెంటవెంటనే రెండు పెనాల్టీ కార్నర్‌లు లభించినా ఈసారి రాణి వీటిని లక్ష్యానికి చేర్చలేకపోయింది. అయితే 20వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ను రాణి రాంపాల్ గోల్‌గా మలిచింది. అనంతరం 29వ నిమిషంలో కెప్టెన్ రాణి అందించిన పాస్‌ను రాణి రాంపాల్ చాకచక్యంతో గోల్ పోస్ట్‌లోనికి పంపించింది. చివరి క్వార్టర్‌లో వందన గోల్‌తో భారత్ విజయం ఖాయమైంది.
భారత్ మహిళల బోణీ
Published Thu, Jun 25 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM
Advertisement