
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్ భారత అంచె పోటీలను భారత మహిళల, పురుషుల జట్లు విజయంతో ముగించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌ల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 2–1 గోల్స్ తేడాతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ నెదర్లాండ్స్ జట్టు ను బోల్తా కొట్టించగా... హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని భారత పురుషుల జట్టు 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టుపై గెలిచింది.
నెదర్లాండ్స్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రెండు క్వార్టర్‌లు ముగిసేసరికి భారత జట్టు 0–2తో వెనుకబడింది. ఆ తర్వాత ఎనిమిది నిమిషాల వ్యవధిలో టీమిండియా రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. భారత్ తరఫున దీపిక (35వ నిమిషంలో), బల్జీత్ కౌర్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు పియెన్ సాండర్స్ (17వ నిమిషంలో), వాన్‌డెర్ ఫే (28వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు.
నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత గోల్‌కీపర్ సవితా పూనియా అడ్డుగోడలా నిలబడి నలుగురు నెదర్లాండ్స్ క్రీడాకారిణుల షాట్‌లను నిలువరించింది. నెదర్లాండ్స్ తరఫున మరీన్ వీన్ మాత్రమే సఫలమైంది. భారత్ తరఫున దీపిక, ముంతాజ్ సఫలమవ్వగా... బ్యూటీ డుంగ్‌డుంగ్, బల్జీత్ కౌర్ విఫలమయ్యారు.
నెదర్లాండ్స్ ఐదో షాట్ తర్వాత భారత విజయం ఖరారు కావడంతో టీమిండియా ఐదో షాట్‌ను తీసుకోలేదు. ఇంగ్లండ్ తో పోరులో భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ (26వ, 32వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment