
భారత్ తొలిసారిగా ఆడుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో ఫలితం ఊహించినట్టుగానే వచ్చింది. ఎలాంటి అంచనాలు లేని ఆతిథ్య జట్టు తమ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో పరాజయంతో టోర్నీని ఆరంభించింది. గత రెండేళ్లలో వివిధ దేశాల క్లబ్ జట్లతో వందకు పైగా మ్యాచ్‌లు ఆడినా ప్రత్యర్థి అటాకింగ్ ముందు భారత కుర్రాళ్లు నిలవలేకపోయారు. పలుసార్లు గోల్ చేసే అవకాశం వచ్చినా సరైన ప్రణాళిక లేకుండా ఆడి విఫలమయ్యారు. మరోవైపు ప్రతిష్టాత్మకమైన ఈ టోర్నీ తొలి మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి మాత్రం అంతగా స్పందన కనిపించలేదు. చాలా స్టాండ్స్ ఖాళీగానే కనిపించాయి.
న్యూఢిల్లీ: ఫిఫా అండర్–17 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు నిరాశపరిచారు. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం పటిష్ట అమెరికా జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయిన భారత్ 0–3తో పరాజయం పాలైంది. ఆద్యంతం అమెరికా హవా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ నుంచి అనికేత్ జాదవ్, అన్వర్ అలీ, కోమల్ తటాల్‌ల నుంచి మెరుగైన ఆట కనిపించింది. అలాగే గోల్ కీపర్ ధీరజ్ అప్రమత్తంగా ఉండటంతో అమెరికా పలు గోల్స్ అవకాశాలను పోగొట్టుకుంది. అమెరికా నుంచి సార్జెంట్ (30వ నిమిషంలో, పెనాల్టీ కిక్), డర్కిన్ (51వ నిమిషంలో), కార్ల్‌టన్ (84వ నిమిషంలో) గోల్స్ చేశారు. సోమవారం తమ తదుపరి మ్యాచ్‌లో భారత జట్టు కొలంబియాతో ఆడుతుంది.
అమెరికాదే ఆధిపత్యం...
ఆట ప్రారంభమైన నాలుగో నిమిషంలోనే అమెరికా జట్టు బోణీ చేసేలా కనిపించింది. అయితే సార్జెంట్ కొట్టిన ఈ షాట్ నేరుగా భారత గోల్ కీపర్ ధీరజ్ చేతుల్లోకి వెళ్లింది. తొలి పది నిమిషాలు పూర్తిగా అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడంతో పాటు తమలో తాము బంతిని పాస్ చేసుకుంటూ భారత ఆటగాళ్లను ఏమార్చారు. ఈ దశలో లభించిన ఫ్రీ కిక్‌ను కెప్టెన్ సార్జెంట్ సొమ్ము చేసుకోలేకపోయాడు. మ్యాచ్ ప్రారంభమైన 23 నిమిషాల వరకు భారత్... అమెరికా గోల్‌పోస్టు దరిదాపుల వరకు కూడా వెళ్లలే కపోయింది. అయితే అమెరికా అటాకింగ్ గేమ్‌ను భారత డిఫెన్స్ విభాగం మెరుగ్గానే అడ్డుకోగలిగింది. 25వ నిమిషంలో భారత్‌కు తొలి కార్నర్ అవకాశం దక్కినా ఫలితం లేకపోయింది. 30వ నిమిషంలో అమెరికా పెనాల్టీ కిక్ ద్వారా తొలి గోల్‌ను సాధించి మ్యాచ్‌లో ఆధిక్యం దక్కించుకుంది. జోష్ సార్జెంట్‌ను బాక్స్‌లో జితేంద్ర సింగ్ అడ్డుకుని కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ అవకాశాన్నిచ్చాడు. దీంతో సార్జెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టుకు తొలి గోల్‌ను అందించాడు. తొలి అర్థభాగం మరో 15 నిమిషాల్లో ముగుస్తుందనగా భారత ఆటగాళ్లు కొన్ని అవకాశాలు సృష్టించుకోగలిగారు. ముఖ్యంగా కోమల్ తటాల్ మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకోగలిగినా ఇతరుల నుంచి సహకారం కరువైంది. 42వ నిమిషంలో భారత్ నుంచి తొలిసారిగా అనికేత్ గోల్ కోసం ప్రయత్నించినా షాట్‌లో అంత పవర్ కనిపించలేదు. ఓవరాల్‌గా ఈ సగభాగం అమెరికాదే హవా నడిచింది.
చివర్లో కాస్త పోటీ...
ద్వితీయార్ధం ప్రారంభంలోనే అమెరికా దూకుడుకు భారత్‌కు మరో ఝలక్ తగిలింది. 49వ నిమిషంలో కార్ల్‌టన్ అద్భుత కిక్‌ను గోల్ కీపర్ ధీరజ్ అడ్డుకున్నాడు. కానీ 50వ నిమిషంలో అమెరికా 2–0 ఆధిక్యాన్ని సాధించగలిగింది. కార్నర్ షాట్‌ను అందుకున్న సెంటర్ బ్యాక్ ఆటగాడు క్రిస్ డర్కిన్ ఎడమ కాలితో సంధించిన హాఫ్ వ్యాలీ... అన్వల్ అలీ కాలిని తాకుతూ గోల్ పోస్టులోకి వెళ్లింది. దీంతో భారత్‌కు షాక్ తప్పలేదు. అయితే 55వ నిమిషంలో భారత్‌కు గోల్ చేసే అవకాశం చిక్కింది. కానీ కోమల్ తటాల్ అంచనా తప్పి కాస్త ఎక్కువ శక్తిని ఉపయోగించడంతో బంతి గోల్ పోస్టు పైనుంచి వెళ్లిపోయింది. ఇక 84వ నిమిషంలో అమెరికా మరోసారి విరుచుకుపడింది. కార్ల్‌టన్ పిచ్ మధ్య నుంచి బంతిని తన స్వాధీనంలో ఉంచుకుంటూ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించి చేసిన గోల్‌తో ఈ జట్టు 3–0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచి విజయాన్ని అందుకుంది.
ఘనా, పరాగ్వే విజయాలు
శుక్రవారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో రెండు సార్లు చాంపియన్‌గా నిలిచిన ఘనా జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో ముందుగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఘనా 1–0తో కొలంబియాపై గెలిచింది. గ్రూప్ ‘బి’లో న్యూజిలాండ్, టర్కీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. ఇదే గ్రూప్‌లో పరాగ్వే 3–2తో మాలిపై గెలిచింది.
శనివారం జరిగే మ్యాచుల్లో జర్మనీతో కోస్టారికా; ఇరాన్‌తో గినియా; బ్రెజిల్‌తో స్పెయిన్; ఉత్తర కొరియాతో నైజర్ తలపడతాయి.
నయీముద్దీన్‌కు సన్మానం
అమెరికాతో మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన భారత మాజీ, ప్రస్తుత ఆటగాళ్లకు సన్మానం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ నయీముద్దీన్, పీకే బెనర్జీ, ఐఎం విజయన్, బెంబేం దేవి, బైచుంగ్ భూటియా, సునీల్ చెత్రిలకు ప్రధాని శాలువా కప్పి జ్ఞాపికను అందించారు. చునీ గోస్వామి పేరు కూడా ఇందులో ఉన్నా ఆయన హాజరుకాలేదు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, ఫిఫా ప్రధాన కార్యదర్శి ఫత్మా సమౌరా, ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, ఆసియా ఫుట్‌బాల్ మండలి అధ్యక్షుడు షేక్ సల్మాన్ పాల్గొన్నారు. 1944లో హైదరాబాద్‌లో జన్మించిన నయీముద్దీన్ 1964 నుంచి 1971 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1970 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టుకు ఆయన కెప్టెన్‌గా ఉన్నారు. అనంతరం మూడుసార్లు (1986, 1997–98, 2005–06) భారత జట్టుకు కోచ్‌గా కూడా వ్యవహరించారు. క్రీడాకారుడిగా ఆయన హైదరాబాద్ సిటీ పోలీస్, ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్, మొహమ్మదన్ స్పోర్టింగ్ జట్ల తరఫున ఆడారు. భారత ఫుట్‌బాల్ చరిత్రలో అర్జున అవార్డు (1970లో)తోపాటు ద్రోణాచార్య అవార్డు (1990లో) కూడా పొందిన ఏకైక వ్యక్తి నయీముద్దీన్ కావడం విశేషం. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని బ్రదర్స్ యూనియన్ క్లబ్ జట్టుకు ఆయన కోచ్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment