గ్రూప్స్‌కు తొలగిన అడ్డంకులు.. త్వరలోనే నోటిఫికేషన్లు! | Route Clear To Telangana Groups Nitifications | Sakshi
Sakshi News home page

గ్రూప్స్‌కు తొలగిన అడ్డంకులు.. త్వరలోనే నోటిఫికేషన్లు!

Published Wed, Apr 21 2021 4:02 AM | Last Updated on Wed, Apr 21 2021 1:32 PM

Route Clear To Telangana Groups Nitifications - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, ఇతర కేటగిరీల్లోని దాదాపు 3 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమమైంది. కొత్త విధానం ప్రకారం ఏయే పోస్టులు ఏయే జోన్లలో వస్తాయి, ఏయే పోస్టులు మల్టీ జోన్‌ పరిధిలోకి వస్తాయన్న వివరాలు, సర్వీసు నిబంధనల మేరకు రోస్టర్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌లను ఆయా ప్రభుత్వ శాఖలు ఖరారు చేయగానే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది.

పదేళ్ల తరువాత..
రాష్ట్రంలో కీలకమైన గ్రూప్‌-1 వంటి పోస్టులు జోన్ల సమస్యల కారణంగానే ఇన్నాళ్లుగా భర్తీకి నోచుకోలేదు. 2011లో చేపట్టిన గ్రూప్‌-1 నియామకాల తర్వాత ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ చేపట్టలేదు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక వీటితోపాటు గ్రూప్‌-2, 3 వంటి పోస్టుల భర్తీకి కూడా జోన్ల సమస్య అడ్డంకిగా మారింది. అయితే 2018లో అప్పటికే ఏర్పాటుచేసిన 31 జిల్లాలతో కూడిన జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.

కానీ ప్రభుత్వం కొత్తగా మరో రెండు ములుగు, నారాయణ్‌పేట్‌ జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జోన్ల విధానంలో ఈ జిల్లాలు లేకపోవడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చినా.. న్యాయ వివాదాలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించారు. ఇదే తరుణంలో వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌ పరిధిలోకి తేవాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త అంశాలన్నీ చేరుస్తూ.. అప్పటికే 2018లో రాష్ట్రపతి ఆమోదం పొందిన ‘తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌–2018’కు సవరణలు చేసింది.

ములుగు, నారాయణపేట కొత్త జిల్లాలను చేర్చడంతోపాటు, జోగులాంబ జోన్‌లో ఉన్న వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌జోన్‌కు మార్చి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది.

పోస్టులను ఎప్పుడో గుర్తించినా..
తెలంగాణ ఏర్పాటయ్యాక తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ను (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటు చేసింది. గ్రూప్‌-1, 2, 3 పోస్టులు, మల్టీ జోనల్‌ పోస్టుల భర్తీకి కసరత్తు చేసింది. సబ్జెక్టు నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి సిలబస్‌ను రూపొందించింది. భర్తీకోసం గ్రూప్‌-1లో 142 పోస్టులను, గ్రూప్‌–2లో 60 పోస్టులను, గ్రూప్‌–3లో 400 వరకు పోస్టులను గుర్తించింది. మరికొన్ని కేటగిరీల్లోని మల్టీ జోన్, జోనల్‌ పోస్టులు కలుపుకొని 3 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.

శాఖల వారీగా పోస్టులు, రోస్టర్‌ తదితర వివరాలపై కసరత్తు కూడా జరిగింది. అయితే పాలనాపర సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం.. రాష్ట్రంలో జిల్లాలను తొలుత 31 జిల్లాలుగా విభజించింది. అప్పటివరకు ఉన్న 2 జోన్లను ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్లు మార్చింది. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభించినా.. కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటుతో మళ్లీ ఆగిపోయింది. మార్పులకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం రావడంతో పోస్టుల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది.

అప్పట్లో గుర్తించిన సుమారు 3 వేల పోస్టులతోపాటు ప్రస్తుత ఖాళీలను కలుపుకొంటే 4వేలకుపైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవేకాకుండా ప్రభుత్వం భర్తీ చేయదలచిన 50 వేల ఉద్యోగాలకు కూడా కొత్త జోనల్‌ విధానాన్ని అమలు చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement