తెలంగాణ తెచ్చుకుందే జాబ్స్‌ కోసం.. గ్రూప్స్‌ అభ్యర్థులతో భట్టి విక్రమార్క | Deputy CM Bhatti Vikramarka Key Comments Over Group 2 Exam | Sakshi
Sakshi News home page

తెలంగాణ తెచ్చుకుందే ఉద్యోగాల కోసం.. గ్రూప్స్‌ అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి

Published Fri, Jul 19 2024 5:55 PM | Last Updated on Fri, Jul 19 2024 6:18 PM

Deputy CM Bhatti Vikramarka Key Comments Over Group 2 Exam

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిసెంబర్‌లో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తున్నట్టు భట్టి చెప్పుకొచ్చారు. నిరుద్యోగులు చెప్పిన ప్రతీ విషయాన్ని సీరియస్‌గా ఆలోచిస్తామని హామీ ఇచ్చారు.

కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో నేడు గ్రూప్‌-2 అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్‌-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ను ఆదేశించాం. మూడు నెలల కాలంలోనే 54వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించాం. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం. ఓవర్‌ ల్యాపింగ్‌ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం.

గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవి. సీఎల్పీ నేతగా నేను, పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే మా పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నాం.  సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. తెలంగాణ బిడ్డలకు ఎంత తొందరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిది. ఎన్నికల్లో హామీ ఇచ్చాం మనస్సాక్షికి సమాధానం చెప్పాలన్నారు.  

ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుంది. మేము అలా ఆలోచించడం లేదు మా బిడ్డలు స్థిరపడాలి. వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం.  విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నాం. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కేసుల పాలైతే మీరే నష్టపోతారు. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడవద్దు.  కొద్ది రోజుల్లోనే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం.  

అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తాం. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తారు. ప్రిపేర్ అయ్యేవారు ఆయా కేంద్రాల నుంచి ఆన్‌లైన్‌లోనే ప్రశ్నలు వేయవచ్చు.. అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఇక నుంచి అశోక్ నగర్‌లో ఐదు రూపాయల భోజనంతో ఇబ్బంది పడాల్సిన పనిలేదు.  

నిరుద్యోగులు చెప్పిన ప్రతీ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తాం. మీరు మా బిడ్డలు.. రాష్ట్ర సంపద.. మీ మేధస్సు నిరుపయోగం కావద్దనేదే ప్రభుత్వం ఆలోచన. ఇందిరమ్మ ప్రభుత్వం నూటికి నూరు శాతం మీ సమస్యలు వింటుంది, పరిష్కరిస్తుంది. గ్రూప్-2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వారి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం’ అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement