Group-3
-
గ్రూప్స్‌కు తొలగిన అడ్డంకులు.. త్వరలోనే నోటిఫికేషన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, ఇతర కేటగిరీల్లోని దాదాపు 3 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమమైంది. కొత్త విధానం ప్రకారం ఏయే పోస్టులు ఏయే జోన్లలో వస్తాయి, ఏయే పోస్టులు మల్టీ జోన్ పరిధిలోకి వస్తాయన్న వివరాలు, సర్వీసు నిబంధనల మేరకు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఆయా ప్రభుత్వ శాఖలు ఖరారు చేయగానే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. పదేళ్ల తరువాత.. రాష్ట్రంలో కీలకమైన గ్రూప్-1 వంటి పోస్టులు జోన్ల సమస్యల కారణంగానే ఇన్నాళ్లుగా భర్తీకి నోచుకోలేదు. 2011లో చేపట్టిన గ్రూప్-1 నియామకాల తర్వాత ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ చేపట్టలేదు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక వీటితోపాటు గ్రూప్-2, 3 వంటి పోస్టుల భర్తీకి కూడా జోన్ల సమస్య అడ్డంకిగా మారింది. అయితే 2018లో అప్పటికే ఏర్పాటుచేసిన 31 జిల్లాలతో కూడిన జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కానీ ప్రభుత్వం కొత్తగా మరో రెండు ములుగు, నారాయణ్‌పేట్ జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జోన్ల విధానంలో ఈ జిల్లాలు లేకపోవడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చినా.. న్యాయ వివాదాలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించారు. ఇదే తరుణంలో వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త అంశాలన్నీ చేరుస్తూ.. అప్పటికే 2018లో రాష్ట్రపతి ఆమోదం పొందిన ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్–2018’కు సవరణలు చేసింది. ములుగు, నారాయణపేట కొత్త జిల్లాలను చేర్చడంతోపాటు, జోగులాంబ జోన్లో ఉన్న వికారాబాద్ జిల్లాను చార్మినార్‌జోన్‌కు మార్చి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. పోస్టులను ఎప్పుడో గుర్తించినా.. తెలంగాణ ఏర్పాటయ్యాక తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను (టీఎస్పీఎస్సీ) ఏర్పాటు చేసింది. గ్రూప్-1, 2, 3 పోస్టులు, మల్టీ జోనల్ పోస్టుల భర్తీకి కసరత్తు చేసింది. సబ్జెక్టు నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి సిలబస్‌ను రూపొందించింది. భర్తీకోసం గ్రూప్-1లో 142 పోస్టులను, గ్రూప్–2లో 60 పోస్టులను, గ్రూప్–3లో 400 వరకు పోస్టులను గుర్తించింది. మరికొన్ని కేటగిరీల్లోని మల్టీ జోన్, జోనల్ పోస్టులు కలుపుకొని 3 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. శాఖల వారీగా పోస్టులు, రోస్టర్ తదితర వివరాలపై కసరత్తు కూడా జరిగింది. అయితే పాలనాపర సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం.. రాష్ట్రంలో జిల్లాలను తొలుత 31 జిల్లాలుగా విభజించింది. అప్పటివరకు ఉన్న 2 జోన్లను ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్లు మార్చింది. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభించినా.. కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటుతో మళ్లీ ఆగిపోయింది. మార్పులకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం రావడంతో పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. అప్పట్లో గుర్తించిన సుమారు 3 వేల పోస్టులతోపాటు ప్రస్తుత ఖాళీలను కలుపుకొంటే 4వేలకుపైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవేకాకుండా ప్రభుత్వం భర్తీ చేయదలచిన 50 వేల ఉద్యోగాలకు కూడా కొత్త జోనల్ విధానాన్ని అమలు చేయనున్నారు. -
వీళ్లెక్కడ ‘లోకల్’?
సాక్షి, గుంటూరు: ప్రకాశం జిల్లాకు చెందిన అల్లూర్‌రెడ్డి 2016 పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్లో ఒకే ఒక్క మార్కు తేడాతో ఉద్యోగానికి దూరమయ్యాడు. గతేడాది ఏపీపీఎస్సీ 1051 పంచాయతీ సెక్రటరీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిలో ప్రకాశం జిల్లాలో ఎక్కువ పోస్టులుండటంతో ఈసారి ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకంతో మరింత కష్టపడి చదివి స్క్రీనింగ్ టెస్ట్‌లో మంచి మార్కులు సాధించాడు. అయితే కోచింగ్ తీసుకుంటున్న గుంటూరు జిల్లాలోనే పరీక్షలు రాయడానికి సౌకర్యంగా ఉంటుందని ఆ జిల్లాను ఎగ్జామినేషన్ సెంటర్‌గా ఎంపిక చేసుకున్నాడు. అయితే ఏపీపీఎస్సీ అల్లూర్రెడ్డిని గుంటూరు జిల్లా నాన్‌లోకల్ అభ్యర్థిగా పరిగణించింది. దీంతో సొంత జిల్లాలో ఎక్కువ పోస్టులున్నా అక్కడా అవకాశాన్ని కోల్పోయి తీవ్రంగా నష్టపోయానని ఆందోళన వ్యక్తంచేస్తున్నాడు. ఇది అల్లూర్‌రెడ్డి ఒక్కడి సమస్యే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది గ్రూప్–3 అభ్యర్థులది. – ఓపెన్ కేటగిరిలో నాన్‌లోకల్‌గా.. ఏపీపీఎస్సీ 2018–19 పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో చాలా వరకూ అభ్యర్థులు లోకల్ జిల్లాగా తమ సొంత జిల్లాను, ఎగ్జామినేషన్ సెంటర్ కింద కోచింగ్ తీసుకుంటున్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్ కింద ఎంపిక చేసుకున్న జిల్లానే పోస్ట్ ప్రిఫరెన్స్ జిల్లాగా ఏపీపీఎస్సీ పరిగణించడంతో చాలామంది ఆయా జిల్లాల్లో నాన్‌లోకల్ అభ్యర్థులుగా మారి.. నాన్‌లోకల్ కింద 20 శాతం పోస్టులకే అర్హులవుతున్నారు. సొంత జిల్లాల్లో ఎక్కువ పోస్టులున్నా వాటికి అర్హత కోల్పోయారు. ఎగ్జామినేషన్ సెంటర్ కోసం ఎంపిక చేసుకున్న జిల్లానే పోస్ట్ ప్రిఫరెన్స్ కింద పరిగణిస్తామని నోటిఫికేషన్లోనే పేర్కొన్నట్టు ఏపీపీఎస్సీ అధికారులు చెబుతున్నారు. అయితే మార్చి 18 నుంచి 24 మధ్య ఎగ్జామినేషన్స్ సెంటర్స్ మార్చుకునే అవకాశం కల్పించినా ప్రిపరేషన్ హడావుడిలో అభ్యర్థులు పట్టించుకోలేదు. తీరా స్క్రీనింగ్ పరీక్ష పూర్తయ్యాక పొరపాటును గ్రహించి లబోదిబోమంటున్నారు. ఈ తరహా పొరపాటు చేసిన వారిలో అధిక శాతం అభ్యర్థులు ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వారే. ప్రకాశం జిల్లాకు చెందిన అభ్యర్థులు గుంటూరులో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు విశాఖపట్టణంలో ఎక్కువ శాతం కోచింగ్‌లు తీసుకుంటుంటారు. దీంతో ఆయా జిల్లాల అభ్యర్థులు తాము కోచింగ్ తీసుకుంటున్న ప్రాంతాలనే ఎగ్జామినేషన్ సెంటర్ల కింద ఎంపిక చేసుకున్నారు. – నోటిఫికేషన్లోనే చెప్పాం.. మా తప్పేం లేదు! కోచింగ్ తీసుకుంటున్న జిల్లాల్లో పరీక్ష సెంటర్లను ఎంపిక చేసుకుని నాన్‌లోకల్ అభ్యర్థులుగా పరిగణించబడుతున్నవారు ఇప్పటికే పలుమార్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కలిసి వినతిపత్రాలిచ్చారు. దరఖాస్తులో లోకల్ జిల్లా కాలమ్‌లో ఎంపిక చేసుకున్న జిల్లానే తమ పోస్ట్ ప్రిఫరెన్స్ జిల్లాగా పరిగణించాలని విన్నవించుకున్నారు. 2016–17 గ్రూప్–3 నోటిఫికేషన్ సైతం ఈ తరహా సమస్య తలెత్తగా అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెయిన్స్‌ను తమ సొంత జిల్లాల్లో రాసుకునేలా వెసులుబాటు కల్పించి, అభ్యర్థుల సొంత జిల్లాలనే పోస్ట్ ప్రిఫరెన్స్ జిల్లాలుగా పరిగణించారు. అయితే ప్రస్తుత నోటిఫికేషన్లో అభ్యర్థులు పలుమార్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ను కలిసి సమస్య తెలియజేసినా.. ‘మేం నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పాం.. మా తప్పేం లేదు’.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. -
గ్రూప్-1, గ్రూప్-3 నోటిఫికేషన్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) శనివారం పది వేర్వేరు నియామక ప్రకటనలు విడుదల చేసింది. వీటి ద్వారా మొత్తం 1300 పోస్టుల భర్తీ జరగనుంది. అందులో గ్రూపు-1 పోస్టులు సుమారు 78 ఉండగా, 1055 వరకూ గ్రూపు-3 పోస్టులున్నాయి. వీటితో పాటు గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖాధికారులు, వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. త్వరలో మూడు వేలకు పైగా మెడికల్ ఆపీసర్ల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. -
గ్రూప్–3 పోస్టుల భర్తీపై నేడు ప్రకటన
హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రూప్–3 కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) శనివారం ప్రకటన విడుదల చేయనుంది. కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, ఇతర సభ్యులు శనివారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. అనంతరం ఏపీపీఎస్సీ గ్రూప్–3 నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. మొత్తం 1,055 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. -
నేడో రేపో గ్రూప్–3
504 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ వివిధ శాఖల్లో 611 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ల పోస్టులు సహా వివిధ శాఖలకు చెందిన 611 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఒకటి రెండు రోజుల్లో గ్రూప్–3 నోటిఫికేషన్ కూడా వెలువరించనుంది. బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన పోస్టులకు గురువారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి ఒక ప్రకటనలో తెలిపారు. 2017 జనవరి 28వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుందన్నారు. ఈ పోస్టులకు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్‌ను కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తాజా నోటిఫికేషన్లతో పాటే గ్రూప్–3 నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలని ఏపీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసినా, చివరి నిమిషంలో నిలిచిపోయింది. గ్రూప్–3 కింద 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అత్యధిక సంఖ్యలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చే అవకాశమున్నందున వడపోతలో కొత్త విధానాన్ని పాటించాలని ఏపీపీఎస్సీ భావించింది. యూపీఎస్సీ తదితర సంస్థల తరహాలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు రిజర్వేషన్లు పాటిస్తూ 1:12 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేయడానికి తమకు అనుమతించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తుందని కొంత కాలంగా ఏపీపీఎస్సీ ఎదురు చూస్తోంది. బుధవారం వరకు ఎదురు చూసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాక పోవడంతో గ్రూప్–3ని మినహాయించి తక్కిన వాటికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేడు, రేపు ఏఈఈ మెయిన్స్ ఇదిలా ఉండగా వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు మెయిన్స్ పరీక్ష గురు, శుక్రవారాల్లో జరుగుతుందని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీసాయి తెలిపారు. ఏపీలోని 13 జిల్లాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈ పరీక్షల కోసం మొత్తం 131 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. -
కొత్తగా గ్రూప్-3
* ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం * గ్రూప్-2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు గ్రూప్-3లోకి బదిలీ * ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష.. ఇంటర్వ్యూల విధానం * గ్రూప్-1 మెయిన్స్‌లో తెలంగాణ చరిత్రపై కొత్తగా ఆరో పేపర్ * మెరిట్ ఆధారంగా గ్రూప్-4 నియామకాలు * వయోపరిమితి సడలింపు ఐదేళ్లకే పరిమితం * హరగోపాల్ కమిటీ ప్రతిపాదనలకు ఉప సంఘం ఆమోదం * నేడో రేపో సీఎం కేసీఆర్‌కు.. కేబినెట్ ఆమోదానికి.. ఉపసంఘం సిఫారసులు ⇒ కొత్తగా గ్రూప్-3 కేడర్‌ను సృష్టించాలి. గ్రూప్-2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-3లో చేర్చాలి. ⇒ గతంలో ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఉన్న పోస్టులను మాత్రమే ఇకపై గ్రూప్-2 కేడర్ కింద భర్తీ చేయాలి. ⇒ ఇప్పటివరకు గ్రూప్-2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూ విధానం లేదు. కానీ ఇకపై గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులన్నింటికీ ఇంటర్వ్యూ ఉంటుంది. ⇒ ఈ రెండింటి పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ⇒ గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్చుతూ 2013లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 622ను అమలు చేయవద్దు. గ్రూప్-1 పరీక్షల్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-3 పేరిట కొత్త కేడర్‌ను సృష్టించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. గ్రూప్-2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను తీసి గ్రూప్-3లో చేర్చాలని.. వీటి భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో ‘తెలంగాణ చరిత్ర’పై కొత్తగా ఆరో పేపర్‌ను నిర్వహించాలని భావిస్తోంది. దాంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపును ఐదేళ్లకే పరిమితం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీచేయనున్న వివిధ ఉద్యోగ పరీక్షల విధానాన్ని (స్కీం) కొన్ని మార్పులు, చేర్పులతో మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించింది. పోటీ పరీక్షల విధానం, సిలబస్‌పై ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ గత ఫిబ్రవరిలో అందజేసిన నివేదికను టీఎస్పీఎస్సీ ప్రభుత్వ ఆమోదం కోసం పంపిన విషయం తెలిసిందే. ఆ నివేదికను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు చేయడం కోసం ప్రభుత్వం గత నెలలో ముగ్గురు మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన ఉపసంఘం సభ్యులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అధికారులు.. బుధవారం సచివాలయంలో చివరిగా మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక సిఫారసులను రూపొందించారు. ఈ సిఫారసులతో కూడిన నివేదికను ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌కు పంపనున్నారు. సీఎం ఆమోదం తరువాత కేబినెట్ ఆమోదం తీసుకొని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనుంది. రెండు మార్పులతో.. గ్రూప్-1 మెయిన్స్ విషయంలో హరగోపాల్ కమిటీ చేసిన సిఫారసులను మంత్రివర్గ ఉపసంఘం యథాతథంగా ఆమోదించింది. దాని ప్రకారం గ్రూప్-1లో కొత్తగా ఆరో పేపర్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రపై 150 మార్కులతో ఈ పేపర్ ఉంటుంది. దీంతో ఇదివరకు మొత్తం మార్కులు 825 (750 రాతపరీక్ష, 75 ఇంటర్వ్యూ)గా ఉండగా.. ఇప్పుడు 1000 మార్కుల (900 రాత పరీక్ష, 100 ఇంటర్వ్యూ)కు పెరగనున్నాయి. అలాగే డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్ పేరుతో 150 మార్కులకు ఐదో పేపర్ ఉంది. ఇప్పుడు దాని స్థానంలో కొంత గణితంతో పాటు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌ను ప్రవేశపెడతారు. గణితం ప్రాధాన్యం తగ్గుతుంది. దీంతో ఇంగ్లిష్ మీడియం, గణితం చదువుకున్న వారే కాకుండా తెలుగు మీడియం, సోషల్ సెన్సైస్ చదువుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఈ పేపర్ అనుకూలంగా ఉంటుంది. పెంపు ఐదేళ్లే! ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి సడలింపును ఐదేళ్లకే పరిమితం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. సాధారణంగా ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో పదేళ్లు జాప్యం జరిగినప్పుడు వయోపరిమితిని పదేళ్లు సడలిస్తారని... ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడక నాలుగేళ్లే అయినందున ఐదేళ్లు పెంచితే చాలని భావిస్తోంది. పైగా వయోపరిమితిని పదేళ్లు సడలిస్తే కొన్ని కేటగిరీల్లో 49 ఏళ్లకు ఉద్యోగంలో చేరుతారని, వారు ఇక సర్వీసు చేసే అవకాశం పెద్దగా ఉండదనే యోచనతో సడలింపును ఐదేళ్లకే పరిమితం చేయాలని నిర్ణయించింది. లెక్చరర్ పోస్టులకు డిస్క్రిప్టివ్ విధానం? లెక్చరర్ పోస్టుల భర్తీలో ఆబ్జెక్టివ్ విధానంతోపాటు డిస్క్రిప్టివ్ (రాత పరీక్ష) విధానాన్ని అమలు చే యాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసినట్లు తెలిసింది. అలాగే అధ్యాపకుల నియామకాలకు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం లెక్చరర్ పోస్టుల భర్తీలో పేపర్-1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ సిలబస్‌లో సమకాలీన అంశాలు, చరిత్ర, అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియాగ్రఫీ, రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. ఇకపై లెక్చరర్ పోస్టుల భర్తీలో ఇచ్చే జనరల్ స్టడీస్ పేపర్-1లో విద్యా విధానం, మౌలిక సూత్రాలు, విద్య ప్రాధాన్యం, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ విధానం ఉండాలన్న అంశంపైనా సిఫారసు చేసినట్లు సమాచారం.