కొత్తగా గ్రూప్-3 | Home ministry decides to create New cader for Group-3 | Sakshi
Sakshi News home page

కొత్తగా గ్రూప్-3

Published Thu, Jul 9 2015 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

కొత్తగా గ్రూప్-3

కొత్తగా గ్రూప్-3

* ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
* గ్రూప్-2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు గ్రూప్-3లోకి బదిలీ
* ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష.. ఇంటర్వ్యూల విధానం
* గ్రూప్-1 మెయిన్స్‌లో తెలంగాణ చరిత్రపై కొత్తగా ఆరో పేపర్

* మెరిట్ ఆధారంగా గ్రూప్-4 నియామకాలు
* వయోపరిమితి సడలింపు ఐదేళ్లకే పరిమితం
* హరగోపాల్ కమిటీ ప్రతిపాదనలకు ఉప సంఘం ఆమోదం
* నేడో రేపో సీఎం కేసీఆర్‌కు.. కేబినెట్ ఆమోదానికి..

 
 ఉపసంఘం సిఫారసులు
  కొత్తగా గ్రూప్-3 కేడర్‌ను సృష్టించాలి. గ్రూప్-2లోని  నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-3లో చేర్చాలి.
 గతంలో ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో ఉన్న పోస్టులను మాత్రమే ఇకపై గ్రూప్-2 కేడర్ కింద భర్తీ చేయాలి.
 ఇప్పటివరకు గ్రూప్-2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఇంటర్వ్యూ విధానం లేదు. కానీ ఇకపై గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులన్నింటికీ ఇంటర్వ్యూ ఉంటుంది.
ఈ రెండింటి పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి.
గ్రూప్-2లోని ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్-1బీగా మార్చుతూ 2013లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 622ను అమలు చేయవద్దు. గ్రూప్-1 పరీక్షల్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల విధానాన్ని యథాతథంగా కొనసాగించాలి.
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్-3 పేరిట కొత్త కేడర్‌ను సృష్టించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. గ్రూప్-2లోని నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను తీసి గ్రూప్-3లో చేర్చాలని.. వీటి భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. గ్రూప్-1 మెయిన్స్‌లో ‘తెలంగాణ చరిత్ర’పై కొత్తగా ఆరో పేపర్‌ను నిర్వహించాలని భావిస్తోంది. దాంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపును ఐదేళ్లకే పరిమితం చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీచేయనున్న వివిధ ఉద్యోగ పరీక్షల విధానాన్ని (స్కీం) కొన్ని మార్పులు, చేర్పులతో మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించింది.
 
పోటీ పరీక్షల విధానం, సిలబస్‌పై ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ గత ఫిబ్రవరిలో అందజేసిన నివేదికను టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వ ఆమోదం కోసం పంపిన విషయం తెలిసిందే. ఆ నివేదికను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు చేయడం కోసం ప్రభుత్వం గత నెలలో ముగ్గురు మంత్రులతో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన ఉపసంఘం సభ్యులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అధికారులు.. బుధవారం సచివాలయంలో చివరిగా మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక సిఫారసులను రూపొందించారు. ఈ సిఫారసులతో కూడిన నివేదికను ఒకటి రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌కు పంపనున్నారు. సీఎం ఆమోదం తరువాత కేబినెట్  ఆమోదం తీసుకొని ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనుంది.
 
 రెండు మార్పులతో..
గ్రూప్-1 మెయిన్స్ విషయంలో హరగోపాల్ కమిటీ చేసిన సిఫారసులను మంత్రివర్గ ఉపసంఘం యథాతథంగా ఆమోదించింది. దాని ప్రకారం గ్రూప్-1లో కొత్తగా ఆరో పేపర్ ఉంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్రపై 150 మార్కులతో ఈ పేపర్ ఉంటుంది. దీంతో ఇదివరకు మొత్తం మార్కులు 825 (750 రాతపరీక్ష, 75 ఇంటర్వ్యూ)గా ఉండగా.. ఇప్పుడు 1000 మార్కుల (900 రాత పరీక్ష, 100 ఇంటర్వ్యూ)కు పెరగనున్నాయి. అలాగే డాటా అప్రిసియేషన్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్, ప్రాబ్లం సాల్వింగ్ పేరుతో 150 మార్కులకు ఐదో పేపర్ ఉంది. ఇప్పుడు దాని స్థానంలో కొంత గణితంతో పాటు, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్‌ను ప్రవేశపెడతారు. గణితం ప్రాధాన్యం తగ్గుతుంది. దీంతో ఇంగ్లిష్ మీడియం, గణితం చదువుకున్న వారే కాకుండా తెలుగు మీడియం, సోషల్ సెన్సైస్ చదువుకున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఈ పేపర్ అనుకూలంగా ఉంటుంది.
 
 పెంపు ఐదేళ్లే!
ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి సడలింపును ఐదేళ్లకే పరిమితం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. సాధారణంగా ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో పదేళ్లు జాప్యం జరిగినప్పుడు వయోపరిమితిని పదేళ్లు సడలిస్తారని... ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడక నాలుగేళ్లే అయినందున ఐదేళ్లు పెంచితే చాలని భావిస్తోంది. పైగా వయోపరిమితిని పదేళ్లు సడలిస్తే కొన్ని కేటగిరీల్లో 49 ఏళ్లకు ఉద్యోగంలో చేరుతారని, వారు ఇక సర్వీసు చేసే అవకాశం పెద్దగా ఉండదనే యోచనతో సడలింపును ఐదేళ్లకే పరిమితం చేయాలని నిర్ణయించింది.     
 
లెక్చరర్ పోస్టులకు డిస్క్రిప్టివ్ విధానం?
లెక్చరర్ పోస్టుల భర్తీలో ఆబ్జెక్టివ్ విధానంతోపాటు డిస్క్రిప్టివ్ (రాత పరీక్ష) విధానాన్ని అమలు చే యాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసినట్లు తెలిసింది. అలాగే అధ్యాపకుల నియామకాలకు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం లెక్చరర్ పోస్టుల భర్తీలో పేపర్-1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ సిలబస్‌లో సమకాలీన అంశాలు, చరిత్ర, అభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, జియాగ్రఫీ, రీజనింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉన్నాయి. ఇకపై లెక్చరర్ పోస్టుల భర్తీలో ఇచ్చే జనరల్ స్టడీస్ పేపర్-1లో విద్యా విధానం, మౌలిక సూత్రాలు, విద్య ప్రాధాన్యం, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ, ఎడ్యుకేషన్ సైకాలజీకి  సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి. తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ విధానం ఉండాలన్న అంశంపైనా సిఫారసు చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement