ప్రగడ వీరేంద్ర
రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్ : కష్టే.. ఫలి అన్నారు పెద్దలు, అది నిజమేనని నిరూపించాడు రాజానగరం మండలం, నరేంద్రపురానికి చెందిన ప్రగడ వీరేంద్ర అనే యువకుడు. ప్రస్తుతం రాజమహేంద్రవరం రూరల్ మండలం, శాటిలైట్‌సిటీలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్న ఈ యువకుడు 2016 గ్రూప్– 2లో 316 మార్కులు సాధించి
ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు.
దినసరి కూలీ నుంచి ఎక్సైజ్ ఎస్సైగా..
తండ్రి ప్రగడ పద్దరాజు వ్యవసాయ కూలీ, అతడికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు సంతానం కాగా, అమ్మాయికి వివాహం చేశాడు. అబ్బాయిలకు పెద్దగా చదువులు చెప్పించలేకపోయాడు. ఆ తరుణంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా తనకు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్నా వీరేంద్రకు పదో తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పవలసి వచ్చింది.
తండ్రితో పాటు కూలీకి పోతూ తన లక్ష్యాన్ని ఏవిధంగా సాధించాలనే ఆలోచనతో నిత్యం ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ని ప్రైవేట్‌గా పూర్తి చేశాడు. అదే సమయంలో సైకిల్‌పై పాలను సేకరించే అవకాశం రావడంతో ఆ పనిని చేస్తూ తద్వారా పరిచయమైన రాజానగరంలోని ఉపాధ్యాయుడు బి. కామేశ్వరరావు(చిన్న మాస్టారు) సలహాలు, సూచనలు తీసుకుంటూ గణితంతో బీఏ చేసి, ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేశాడు.
అయితే ఆంగ్ల భాషలో సరైన పట్టులేక మాట్లాడే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు హైదరాబాద్ వెళ్లి ఒక ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పగలంతా పని చేస్తూ రాత్రి సమయంలో ఆంగ్ల భాషపై పట్టు సాధించే దిశగా శిక్షణ తీసుకునేవాడు.
ఇదే సమయంలో జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)లో డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ పడడంతో దరఖాస్తు చేసి, కొవ్వూరు బ్రాంచ్‌లో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా 2008లో చేరి 2010 వరకు పని చేశాడు. అనంతరం 2008 డీఎస్సీలో అర్హత సాధించడం ద్వారా 2010లో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని అందుకుని రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
అతడి భార్య కూడా ఉపాధ్యాయురాలే కావడంతో గ్రూప్ పరీక్షల వైపు దృష్టిని సారించి, ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను శనివారం అందుకున్నాడు. అతడి తమ్ముడు మాత్రం ఎలిమెంటరీ చదువుతోనే స్వస్తి పలికి అదే గ్రామంలో ప్లంబింగ్ వర్కు చేస్తున్నాడు.
తనకు పరిచయమైన వారంతా తన ఆశయాన్ని గౌరవించి ప్రోత్సహించడం వల్లనే తాను ఈ స్థాయిని అందుకోగలిగానని వీరేంద్ర తన విజయ రహస్యాన్ని తెలిపాడు. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు తపనతో సాధన చేస్తేనే ఫలితం ఉంటుందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment