సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ‘ఆర్థికాంశాలు’ కొలిక్కివచ్చాయి. ఈ పత్రాల విక్రయంలో కేతావత్ రాజేశ్వర్ కీలకపాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నియామక పరీక్షకు సంబంధించిన మూడు ప్రశ్నపత్రాలను రూ.40 లక్షలకు విక్రయించారని, ఇప్పటికే నిందితులకు రూ.23 లక్షలు ముట్టగా మిగతా సొమ్ము పరీక్ష ఫలితాలు వచ్చాక ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు.
ఇందులో ఇప్పటికే రూ.8.5 లక్షలు రికవరీ చేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్లను పంచుకున్నారే తప్ప అమ్ముకోలేదని అధికారులు చెబుతున్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పులిదిండి ప్రవీణ్ కుమార్, మాజీ నెట్‌వర్క్ అడ్మిన్ అట్ల రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ పేపర్లు తస్కరించినట్లు ఇప్పటికే సిట్ స్పష్టం చేసింది. ఏఈ పరీక్ష పేపర్లను ప్రవీణ్ తన స్నేహితురాలైన రేణుక రాథోడ్, ఆమె భర్త లవడ్యావత్ డాక్యాలకు ఇచ్చాడు.
నమ్మకమైన వారికే వీటిని విక్రయించాలని చెప్పాడు. తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని చెప్పి రూ.5 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. డాక్యా ఈ పేపర్ల గురించి సమీప బంధువైన కేతావత్ రాజేశ్వర్‌కు చెప్పాడు. ఇతడు ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తుల ద్వారానే గోపాల్, నీలేశ్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌లకు రూ.40 లక్షలకు విక్రయించాడు. వీరి నుంచి రూ.23 లక్షలు వసూలు చేసిన రాజేశ్వర్.. అందులోంచి డాక్యాకు రూ.10 లక్షలిచ్చాడు.
తన వాటాగా వచ్చిన దీని నుంచి ఇతగాడు మరో రూ.5 లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చాడు. ప్రవీణ్ తన వద్దకు వచ్చిన డబ్బులోంచి (మొత్తం రూ.10 లక్షలు) రూ.4 లక్షలు ఇంట్లోనే ఉంచుకుని, రూ.3.5 లక్షలు తన సమీప బంధువుకు ఇచ్చాడు. ఓ బీమా పాలసీకి సంబంధించి రూ.1.2 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తం ఇతర ఖర్చులకు వాడేశాడు. ఈ సొమ్ములో సిట్ అధికారులు రూ.7.5 లక్షలు రికవరీ చేశారు.
గ్రామానికి రూ.8 లక్షలు వెచ్చించిన రాజేశ్వర్
గతంలో చిట్టీల వ్యాపారం చేసిన రాజేశ్వర్ నష్టాలు రావడంతో ఆపేశాడు. ఇతడి తల్లి ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం మన్సూర్‌పల్లి తండాకు సర్పంచ్‌గా ఉన్నారు. ఈమె తరఫున గ్రామంలో అభివృద్ధి పనులను ఇతడే పర్యవేక్షిస్తుంటాడు. పేపర్లు విక్రయించగా వచ్చిన మొత్తంలో డాక్యాకు ఇచ్చింది మినహా మిగిలింది తన వద్దే ఉంచుకున్నాడు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత చేతికందే రూ.17 లక్షల నుంచి మిగిలిన వారికి వాటాలు ఇవ్వాలనుకున్నాడు.
తన వద్ద ఉన్న సొమ్ములో రూ.8 లక్షలు వెచ్చించి గ్రామంలో అభివృద్ధి పనులు చేశాడు. వీటికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వం మంజూరు చేశాక ఆ మొత్తం తాను తీసుకోవాలని భావించాడు. నిందితుడి విచారణలో సిట్ అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆ బిల్లులకు సంబంధించిన మొత్తం తమకు అందేలా చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. అలా వచ్చిన మొత్తాన్ని సీజ్ చేసి కోర్టుకు సమర్పించాలని భావిస్తున్నారు.
చైర్మన్‌కు నోటీసులు ఇవ్వకుండా...
సిట్ అధికారులు శనివారం కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చైర్మన్ ఆధీనంలోనే పని చేస్తుంది. ఈ స్కామ్ మొత్తం ప్రశ్నపత్రాలకు సంబంధించిందే కావడంతో చైర్మన్ వాంగ్మూలం నమోదు అనివార్యంగా మారింది.
అయితే కార్యదర్శి, సభ్యులు, ఉన్నతోద్యోగుల మాదిరిగా చైర్మన్‌కు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ పోస్టు రాజ్యాంగ బద్ధమైంది కావడంతోపాటు ప్రస్తుత చైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేయడానికి బదులు స్టేట్‌మెంట్ తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించారు. సోమవారమే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment