ఒకటి... రెండు... మూడు!  అరెస్టు | Three Arrests In TSPSC Question Paper Leak Case | Sakshi
Sakshi News home page

ఒకటి... రెండు... మూడు!  అరెస్టు

Published Thu, May 18 2023 5:08 AM | Last Updated on Thu, May 18 2023 5:08 AM

Three Arrests In TSPSC Question Paper Leak Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ) పరీక్షల్లో అత్యధిక మార్కులు పొంది, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు ర్యాంకులు సాధించింది ‘లీకు వీరులుగా’తేలింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజేశ్వర్‌కు మొదటి ర్యాంకు, అతడి భార్య శాంతికి రెండో ర్యాంకు, మరో నిందితురాలు లవడ్యావత్‌ రేణుక స్నేహితుడు రాహుల్‌ కుమార్‌కు మూడో ర్యాంకు వచ్చాయి.

ఈ ముగ్గురూ లీౖకైన మాస్టర్‌ ప్రశ్నపత్రం ఆధారంగానే పరీక్షలు రాసినట్లు అధికారులు తేల్చారు. ఇప్పటికే అరెస్టయిన రాజేశ్వర్‌కి బెయిల్‌ కూడా వచ్చింది. దీంతో శాంతి, రాహుల్‌తో పాటు టీఎస్‌పీఎస్సీ మాజీ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డి భార్య సుచరిత, నాగార్జునసాగర్‌కు చెందిన దళారి రమావత్‌ దత్తులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 

రేణుక ద్వారా రాహుల్‌కు..  
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాహుల్‌కు కొన్నేళ్లుగా లీకేజీలో కీలక సూత్రధారి అయిన ప్రవీణ్‌కుమార్‌ స్నేహితురాలు రేణుకతో పరిచయం ఉంది. డీఏఓ పరీక్ష రాస్తున్నాడనే విషయం తెలిసిన రేణుక ఈ ఏడాది ఫిబ్రవరిలో రాహుల్‌ను కలిసి డీఏఓ మాస్టర్‌ పేపర్‌ను చూపించింది. అందులో ఉన్న ప్రశ్నలు–జవాబులను రాహుల్‌ తన వద్ద ఉన్న నోట్‌ బుక్‌లో రాసుకున్నాడు. వీటి ఆధారంగా పరీక్షకు సిద్ధమైన అతడు మూడో ర్యాంకు సాధించాడు. ఇదే పేపర్‌ను రేణుక భర్త డాక్యా నుంచి తీసుకుని రాజేశ్వర్, అతడి భార్య శాంతి పరీక్ష రాశారు. 

తొలి పది ర్యాంకులు వచ్చిన వారిపై దృష్టి 
లీకేజ్‌ కేసు దర్యాప్తు ప్రారంభించిన సిట్‌ అధికారులు వివిధ కోణాల్లో ముందుకు వెళ్తున్నారు. ప్రతి పరీక్షలోనూ అధిక మార్కులు, మొదటి పది ర్యాంకులు సాధించిన వారి వివరాలను సేకరించి విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీఏఓ పరీక్షల్లో ర్యాంకులు, మార్కులు సాధించిన వారిపై దృష్టి పెట్టిన పోలీసులు శాంతి, రాహుల్, సుచరిత, రాజేశ్వర్‌ల వ్యవహారం గుర్తించారు. రాజేశ్వర్‌ గతంలోనే ఈ కేసులో అరెస్టు అవడంతో బుధవారం రాహుల్, శాంతి, సుచరిత, దత్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.

వీళ్లు విషయం అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ పేపర్‌ వీరి నుంచి మరెవరికైనా చేరిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ నలుగురినీ కస్టడీకి కోరాలని సిట్‌ అధికారులు నిర్ణయించారు. ఈ అరెస్టులతో కలిసి ఇప్పటి వరకు లీకేజ్‌ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 34కు చేరింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement